ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః 🌹🙏


‘సర్వం సూర్యమయం జగత్‌..’ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది. సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది.


‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు.


యోగ్యత, అయోగ్యలతో నిమిత్తం లేకుండా సర్వ జీవకోటికి సమానంగా వెలుగులు (కాంతులు) పంచే భగ వానుడు.


సృష్టి స్థితి లయలు సూర్యుని ప్రమేయంతోనే జరుగుతున్నాయని (సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితానిచ/సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్యః సోహ మేవచ) ‘సూర్యోపనిషత్తు’ పేర్కొంది.


సూర్యభగవానుడికి, సముద్రుడికి, మట్టికి (భూమికి) గల స్నేహం, బాంధవ్యం వర్షం, పంటల రూపంలో లోకాన్ని ఆదుకుంటోంది. తన కిరణాలతో నీటిని గ్రహించి వర్షరూపంలో ధరణిని సస్యశ్యామలం చేస్తున్నాడు.


తినే మెతుకుపై వారి వారి పేర్లుంటాయన్నది ఎంత నిజమో, పండే ప్రతి గింజ సూర్య భగవానుడి దయాపాత్రమనడం అంతే నిజమంటారు విజ్ఞులు. ఆయనకు గల అనేక పేర్లలో ‘మిత్రుడు’ అనేది సార్థకమైనది.


సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తికిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న ఆదిత్యుడు ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఉద్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం. 


సూర్యభగవానుడు నిత్యానుసంధాన నీయుడు. మరీ ముఖ్యంగా మాఘ మాసంలోని ఆదివారాలలో ఆయన అర్చనను మరీ ప్రత్యేకతగా చెబుతారు. ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.


సూర్యభగవానుడు సమత్వానికి, చైతన్యానికి, క్రమశిక్షణకు ప్రతీక. తరతమ భేదాలు, పాప పుణ్యాలతో నిమిత్తం లేకుండా అందరికి వెలుగు నిస్తాడు. ఆయన ఉదయాస్తమానాలు క్రమశిక్షణకు నిదర్శనం.


కాలానికి ఆదిత్యుడే కొలమానం. సమస్త జీవరాశికి ఆధారభూతుడు. కాలం ఎవరి కోసం ఆగదని నిరూపిస్తూ సాగుతాడు.


లోకబాంధవుడు సూర్యుడు ఎవరి ప్రభావం లేకుండానే ఉదయిస్తూ, ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదిస్తూ తన పని చేసుకుంటూ పోతాడు. ఎప్పటిపనులు అప్పుడు చేయాలన్న సందేశం ఆయన గమనంలో కనిపిస్తుంది.


'సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ

సప్త ద్వీప ప్రకాశయ భాస్కరాయ నమోనమః’


‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్‌’ (ఆరోగ్యం కోసం భాస్కరుని ఆరాధించాలి) అంటారు. సూర్యారాధన సర్వరోగాలను హరించి ఆరోగ్యాన్ని, బలాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. ఆయన ఔషధరూపుడని, ఆయన కిరాణాల వల్ల ఎన్నో వ్యాధులు తొలగి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 


ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. వేదకాలంలో ప్రస్కణ్వుడు అనే మహర్షి సౌరమంత్రాలు మూడుసార్లు జపించి చర్మవ్యాధి నుంచి విముక్తుడయ్యాడని (అది ‘తృచభాస్కరం’ అని ప్రసిద్ధికెక్కింది), మయూరుడనే కుష్టువ్యాధిగ్రస్తుడు ‘సూర్యశతకం’ రచనతో సంపూర్ణ ఆరోగ్యం పొందారని చెబుతారు.


సూర్యజయంతి రథసప్తమిని ‘ఆరోగ్య సప్తమి’ అనీ అంటారు. ఆ రోజు చేసే స్నాన, ధ్యాన, నమస్కారాది పక్రియలు శారీరక రుగ్మతలను దూరం చేయడంతోపాటు మానసిక ప్రవృత్తులను సన్మార్గంలో పెడతాయంటారు. 


సూర్యుడిలో అపారమైన రోగ నిరోధక శక్తి ఉందని, అంతటి శక్తి ప్రపంచంలోని మరే వస్తువులోనూ లేదని పాశ్చాత్య వైద్యశాస్త్రవేత్తలు సైతం ప్రకటించారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు