💥జ్యేష్ట శుద్ధ పౌర్ణమి.. ఏరువాకపౌర్ణమి.
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
💥జ్యేష్ట శుద్ధ పౌర్ణమి.. ఏరువాకపౌర్ణమి.
హిందూ సంప్రదాయంలో ప్రతి తెలుగు మాసమునకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో సైతం పండగలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం జ్యేష్టమాసం నడుస్తుంది. మనం ఈసారి ఏరువాక పౌర్ణమిని జూన్ మాసం11 వ తేదీన జరుపుకోబోతున్నాం. దీన్ని "జ్యేష్టపౌర్ణమి" అని కూడా పిలుస్తారు.
ఏరువాక పౌర్ణమి వేడుక అనాదిగా వస్తోంది. వేదకాలం నుంచి ఈ వేడుక ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. అధర్వణ వేదంతో పాటు, విష్ణుపురాణంలో దీని ప్రస్తావన ఉంది. విష్ణుపురాణంలో ఏరువాక పౌర్ణమిని "#సీతాయజ్ఞం"గా పేర్కొన్నారు.
సీత అంటే నాగలి అనే అర్థం ఉందని, నాగలి యజ్ఞం అంటే వ్యవసాయ యజ్ఞం ఆరంభించే రోజు అని పండితులు సూచిస్తున్నారు.
రోళ్లు పగిలే రోహిణి కార్తె వెళ్లి, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి.
వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు.
ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్ధిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు.
ఈ రోజున మట్టిని నమ్మి కష్టించి పని చేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉదయాన్నే ఎడ్లను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, రకరకాల గజ్జెలు, గంటలు, పూసల దండలతో, పూల దండలతో ఎద్దులను సర్వాంగసుందరంగా అలంకరించి, పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్లి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు.
అదే రోజు సాయంత్రం గ్రామంలో ఊరి ముంగిట గోగు నారతో చేసిన తోరణాలను కడతారు. ఈ తోరణాల మధ్యలో అక్కడక్కడా జిలేబీలు, గారెలు, కరెన్సీ కాగితాలు ఎత్తులో కడతారు. దీనినే "#ఏరువాకతోరణం" అని అంటారు.
రైతులు తమ తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకెళ్తారు. దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లో, ధాన్యాగారంలో దాచి ఉంచుతారు. అలా చేయడం వల్ల పంటలు సమృద్ధిగా పండి కరువు ఉండదని రైతుల విశ్వాసం.
మానవ జీవితమే ప్రకృతి ప్రసాదం. ప్రకృతి మీద ఆధారపడి జీవించే మానవుడు ప్రకృతి రక్షించాలి, వర్షాలు కురవడం కోసం చెట్లను పెంచాలి. ప్రకృతి ఆగ్రహిస్తే ప్రళయం తప్పదు. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతారు. అందుకే ప్రకృతిని పరిరక్షించుకోవడం మన బాధ్యత. ప్రకృతిని మనం రక్షిస్తే అదే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది.
ఏరువాక పౌర్ణమి పండుగ ఒక్క అన్నదాతకు మాత్రమే కాదు. మనందరికీ పండుగే! ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశమంటే మనమందరం కదా! అందుకే ఈ పండుగ మనందరికీ కూడా పండుగే!
ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఏరువాక పౌర్ణమి పండుగను ఆనందంగా జరుపుకుందాం.
అన్నదాతలందరికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
సర్వేజనా సుఖినోభవంతు. లోకాసమస్తా సుఖినోభవంతు!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment