💥జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అందించే- త్రిమూర్తుల అంశ దత్తాత్రేయుడు.

 ⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః🌹🙏


💥జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అందించే- త్రిమూర్తుల అంశ దత్తాత్రేయుడు.


త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి పిలిచిన వెంటనే ప్రత్యక్షమై అనుగ్రహించే దైవం. దత్తుడు ఎంతటి దయామయుడో అంతటి పరీక్షమూర్తి. తన భక్తులకు కఠినమైన పరీక్షలు పెట్టి బంగారానికి అంటుకున్న మలినాన్ని వదలగొట్టినట్లుగా వారి పాపాలను తొలగించే దయామయుడు దత్తుడు. 


🌹దత్త జననం


అత్రిమహర్షి ధర్మపత్ని అనసూయ పాతివ్రత్యాన్ని గుర్తించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి అసూయతో ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని తమ భర్తలైన త్రిమూర్తులను అత్రి మహర్షి ఆశ్రమానికి పంపుతారు. 

సన్యాసుల రూపంలో ఆశ్రమానికి వచ్చి మహర్షి దంపతుల ఆతిధ్యాన్ని స్వీకరించడానికి విచిత్రమైన షరతు పెడతారు త్రిమూర్తులు. తన పాతివ్రత్యంతో త్రిమూర్తులను పసిపాపలుగా మార్చి వేస్తుంది అనసూయ. జరిగింది తెలుసుకొని క్షమించి పతిభిక్ష పెట్టమని ప్రార్ధించిన లక్ష్మి సరస్వతి పార్వతిల విన్నపం మేరకు త్రిమూర్తులకు నిజస్వరూపం వస్తుంది. అత్రిఅనసూయ దంపతుల కోరిక మేరకు త్రిమూర్తుల అంశతో వారికి జన్మించిన వరపుత్రుడే దత్తాత్రేయుడు.


🌹బాల్యంలోనే వైరాగ్యం


దత్తుడు చిన్నప్పటి నుంచి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఎప్పుడూ ధ్యానంలోనే నిమగ్నమై ఉండేవాడు. ఈ దత్తుడు ఒక్కోసారి ప్రశాంత మనోహరమైన యతి రూపం ధరిస్తే మరోసారి ఆగ్రహంతో భయానక రూపంలో చిందులు తొక్కుతూ భక్తులను భయబ్రాంతులకు గురిచేసేవాడు. ఇదంతా స్వామిలీల అని గ్రహించి స్థిరచిత్తంతో నిలిచినవారికి భక్తియోగ సామ్రాజ్యాన్ని ప్రసాదించేవాడు.


🌹దత్త స్వరూపం


కల్పవృక్షం నీడలో నాలుగు వేదాలను నాలుగు కుక్కల రూపంలో వెంటబెట్టుకుని, ధర్మప్రబోధమే ధ్యేయంగా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో యోగ సాధనలో ఉంటూ భక్తులను సదా రక్షించే కరుణామూర్తి దత్తాత్రేయుడు.


🌹చర్మం ఒలిచి ఇచ్చిన జ్ఞాని


దత్తాత్రేయుడు బాల్యంలో సన్యసించి ఇల్లు విడిచి వెళ్తుండగా పుత్రప్రేమతో అతని తల్లి 'నేను ఇచ్చిన శరీరం నీది' అన్న మాటకు చిరునవ్వు నవ్వి తన గోళ్లతో చర్మాన్ని చీల్చి తన తల్లి చేతిలో పెట్టి ఆమె అజ్ఞానాన్ని పోగొట్టిన బాలమేధావి.


🌹బ్రహ్మకే బ్రహ్మ జ్ఞానం ప్రసాదించిన మహాజ్ఞాని


ఒకానొక సమయంలో బ్రహ్మ దేవునికి బుద్ధి నశించి వేదాలను మరిచి పోతాడు. ఆ సమయంలో దత్తాత్రేయుడు వేదమాత గాయత్రీదేవి ఆదేశంతో బ్రహ్మకు వేదాలను తిరిగి వివరించి స్ఫురించేలా చేస్తాడు.


🌹ప్రహ్లాదునికి ఆత్మజ్ఞానం


ఒకసారి ప్రహ్లాదుడు 'నేనెవరు'? అని కుమిలిపోతుండగా అతనికి ఆత్మజ్ఞానం ప్రసాదించిన దివ్యమూర్తి దత్తుడు.


🌹భక్తసులభుడు


దత్తాత్రేయుడు భక్తసులభుడు. తనను నమ్ముకున్న కార్త్యవీర్యునికి జ్ఞానయోగాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించాడు. దత్తాత్రేయుడు తనను నమ్ముకున్న వారితో పాటు వారి సంతతిని కూడా కంటికిరెప్పలా కాపాడే కరుణాసముద్రడని దత్తచరిత్ర వివరిస్తోంది.


🌹అహింసా పరమో ధర్మః


అహింస, సహనం ఉత్తమమైన ధర్మాలని దత్తాత్రేయుడు ప్రబోధించాడు. సహనంతో, శాంతంతో క్రోధాన్ని జయించవచ్చని దత్తుడు బోధించాడు. ప్రతికూల పరిస్థితులలో మౌనంగా ఉండాలని, ఎల్లప్పుడూ ప్రియభాషణంతో అందరితో సఖ్యంగా ఉండాలని దత్తబోధలు తెలియజేస్తాయి. సత్సాంగత్యం మనిషిని మహానుభావునిగా మారుస్తుందని తెలిపే ఎన్నో కథలు దత్తపురాణంలో ఉంటాయి.


🌹ఎన్నో అవతారాలు


దత్తాత్రేయస్వామి శ్రీపాద వల్లభుడుగా గాణగాపురంలో, కురుపురంలో నృసింహ సరస్వతిగా వెలిసాడు. పిలిస్తే పలికే దైవంగా భక్తులను అనుగ్రహించే దత్తాత్రేయుని గురువారం ఆరాధించడం వల్ల జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం.


🌹ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః🌹

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️


Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు