💥శివమహాపురాణం - శాక్తేయ_నాయనారు.
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
విశ్వేశ్వరాయ దేవాయ శివ శ్శంభో భవాయ చ /
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః //
💥శివమహాపురాణం - శాక్తేయ_నాయనారు.
"పెరియపురాణం" అని ఒక గ్రంథం ఉంది.
అది మనకి "నాయనార్ల చరిత్ర"ను తెలియజేస్తుంది.
అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు.
కాని ఆయన ఉన్న రోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలి వున్నాయి. కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమ భక్తి భావన ఉండేది.
ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు.
ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివ నామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూవులు వెయ్యాలని ఆయన కోరిక.
ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరయినా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు.
అపుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు. శివార్చన చెయ్యని వాడిలా కనపడాలి పైకి. లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కె తీరాలి.
అందుకని ఆయన అటుగా వెళుతూ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని "శివా, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను? అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి..
"నీవు శివుడి వా?" అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ, ఆ శివలింగం మీద పడేసేవారు.
మరొక రాయిని తీసుకుని ‘నీవు శివుడివా?' అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు.
నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరినా రాళ్ళకు బదులు చేమంతిపువ్వులు, మల్లెపువ్వులు పడ్డాయి.
చూసే వాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారముల ననుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు, ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు.
అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అదీ ఆయన పూజ! ఇది ఆర్తిలో నుంచి వచ్చిన పూజ.
ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అపుడు ‘శర్వతి’ అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ‘ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్న వాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వెయ్యడం మర్చిపోయాను.. అని
అన్నం పళ్ళెం దగ్గరనుంచి లేచి, భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి ‘శివుడివా’ అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు.
'ఇలా తప్ప మరొక విధంగా నీకు పూజ చేయలేక పోతున్నానయ్యా’ అని మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు.
వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజ మూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు.
దీనిని బట్టి "మహేశ్వరుడు" అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీచిత్తశుద్ధిని చూడగలిగిన వాడు. ఇదీ ఆయన స్వతంత్రత.
లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి.. నాలుగు రాళ్ళతో పూజ చేసినా మోక్షము యిచ్చిన వాడు శంకరుడు.
"తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తమ్
దేవతానాం పర మం చ దైవతం"
🌹దేవతలు అందరూ కూడా ఎవరికీ ప్రార్థన చేసి నమస్కరిస్తారో, సర్వ జగత్తును ఎవరు నియమించి, పోషించి రక్షిస్తున్నారో, ఎవరు దీనిని నిలబెడుతున్నారో, ఎవరు దీనిని తన లోకి తీసుకుంటున్నారో ఆయనే.. మహేశ్వరుడు.
సేకరణ... శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన భాష్యం (శివపురాణ గాథలు) నుండి💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment