💥శ్రీ మహాలక్ష్మ్యష్టకం💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏


💥రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా... భక్తుల అభీష్టాలను తీర్చే మహాలక్ష్మి సర్వ మంగళకారిణి.


లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్ముల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవినీ పూజిస్తే... ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ, దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలూ కలుగుతాయనీ భక్తుల నమ్మిక.


💥శ్రీ మహాలక్ష్మ్యష్టకం💥


ఇంద్ర ఉవాచ -


నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।

శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥


తాత్పర్యం: 

అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ!దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.  


#వివరణ:

సృష్టి స్థితి లయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు.  ఆమెయే శ్రీచక్రారూడ. సకల దేవతలు ఆమెనే పూజిస్తుంటారు. ఆమె శంఖచక్రగదాహస్త అయి, వైష్ణవీరూపంతో మహాలక్ష్మిగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తూంది. లక్ష్మి అంటే సర్వాన్నీ చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్నీ రక్షించేదీ అయింది.  విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికీ వర్తించాయి.


నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।

సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥


తాత్పర్యం: 

గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కలిగించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు. 


#వివరణ:

విష్ణుదేవుని అర్ధాంగి గనుక మహాలక్ష్మి కూడా గరుడవాహనయే ! లక్ష్మీసహస్రనామస్తోత్రం 65వ శ్లోకం లో "గరుడో పరిసంస్థితా" అని ఉంది. గరుత్మంతుడు వేదమూర్తి కనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు. అంటే వేదాలపై విహరిస్తాడు. జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా వేదారూఢయే! అమ్మవారు వేదమాత, కోలా విధ్వంశులనేవాళ్ళు స్వారొచిషమనువు కాలం వాళ్ళు.  ఆకాలంలో చైత్రవంశీయుడైన 'సురధుడు' అనే రాజును కోలావిధ్వంశులనేవాళ్ళు జయించి, అతనికి శత్రువులయ్యారు.  కోలుడు, విధ్వంశుడు అనే ఈ రాక్షసుల్ని అమ్మవారు లక్ష్మీ రూపంతో సంహరించింది.  కనుక కోలాసుర భయంకరి అయింది.  ఈ విషయం దేవీసప్తశతి ప్రధమాధ్యాయం ఐదవ శ్లోకంలో సూచితం. భగవతీ నామస్మరణం సర్వపాపాల్నీ నశింపజేస్తుంది.


సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।

సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥


తాత్పర్యం: 

సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ! అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు 


#వివరణ:

అమ్మవారు జగన్నాయకి. విష్ణుపత్ని కనుక ఆమెకు తెలియని విషయం ఉండదు. ఎవరికి ఏ సుఖం కల్గినా అది శ్రీదేవియొక్క అనుగ్రహవిశేషమే ! అమ్మ 'సర్వజ్ఞ కనుక సర్వ దుష్టశక్తుల్నీ,దుఃఖాలనీ తొలగించి, అందరికీ సుఖశాంతుల్ని ప్రసాదిస్తూంది.  బాహ్యాంతశ్శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కల్గుతుంది. ఇందుకు లక్ష్మీదేవియొక్క అనుగ్రహం చాలా ముఖ్యం.


సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।

మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥


తాత్పర్యం: 

సిద్ధినీ  బుద్ధినీ   ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.  


#వివరణ:

అమ్మవారు కార్యసిద్ధిని, అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇహపరసౌఖ్యాలు అనుగ్రహిస్తుంది .  అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి, పూజిస్తే వారివారికి తగినట్లుగా రక్షణ ఇస్తూంటుంది.  కార్యసిద్ధీ, కార్యనిర్వహణబుద్ధీ, భుక్తీ, ముక్తీ ఇలా జీవికి అవసరమైన అన్ని దంద్వాలనూ ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత.  అన్ని మంత్రాలూ 'శ్రీం' బీజ మయాలే ! కనుక అమ్మ మంత్ర స్వరూపిణి.


ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।

యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥


తాత్పర్యం: 

ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము. 


#వివరణ:

అమ్మ ఆదిశక్తి. సృష్ఠి స్థితి లయాలకు కారణమైనది.  ఈ తల్లికి మొదలు, తుది అనేవిలేవు.  సర్వకాల, సర్వావస్థలలో అమ్మ చైతన్యరూపిణియై ఉంటుంది.  అమ్మ 'యోగం' వల్ల సంభవించింది.  'యోగ'మంటే ధ్యానం.  ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారం కల్గుతుంది. కనుక అమ్మ "యోగజ", "యోగసంభూత" అయింది. అనగా పరమాత్మరూపిణి, జగత్ప్రభువగు విష్ణుదేవుని భార్య కనుక అమ్మ "మహేశ్వరి" అనగా జ్ఞానస్వరూపిణి. 


స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।

మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6


తాత్పర్యం: 

స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ ! గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము. 


#వివరణ:

లక్ష్మీదేవి రజోగుణస్వరూపిణి.  హిరణ్యవర్ణ. కనుకనే ఆమె రౌద్ర, స్థూల, సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాలలో వ్యక్తమవుతూ ఉంటుంది.  భౌతికంగా భక్తులు కోరికలకై పూజించేరూపం స్థూలం.  ఇది రజోగుణాత్మకం.  యోగులు నిష్కాములై ధ్యానించే రూపం సూక్ష్మం! ఇది సర్వగుణాత్మకం.  ఇక శత్రుసంహారం కావించేరూపం తామసం.  ఇది రౌద్రం.  ఇలా త్రివిధరూపాలతో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ, అమ్మవారు విష్ణుదేవుణ్ణి అనుసరించి వుంటుంది. ఆమె మహాశక్తి. ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలూ ఉన్నాయి. అమ్మ పాప సంహారిణి. సకలలోకజనని. 


పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।

పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥


తాత్పర్యం: 

పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము. 


#వివరణ:

లక్ష్మి పద్మం నుండి జనించింది.  పద్మంలోనే నివసిస్తుంది.  పద్మాన్నే ధరిస్తుంది. పద్మం పైనే కూర్చుంటుంది.  నిల్చుంటుంది. ఇలా ఆమే సర్వమూ పద్మమే ! పద్మమంటే ఇందు లక్ష్మి ఉంటుంది. "పద్యతే అత్ర లక్ష్మీః" అని వ్యుత్పత్తి. అమ్మ నివసించడంవల్లనే పద్మాలకు అంతటి శోభ, మృదుత్వం, ప్రశస్తీ వచాయి.  పద్మాసన - పద్మాన్నే ఆసనంగా కలిగి ఉండేది.  అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగియగు లక్ష్మియు పరబ్రహ్మమే ! లక్ష్మి మహానాయకురాలు. సృష్ఠి స్థితి లయాలకు ఆమె కారణం.  మాత అంటే గర్భం తనలో ఇమిడియుండునది అని వ్యుత్పత్తి.  అమ్మ సకలలోకాలనూ తన గర్భం లో ధరించి సృష్ఠి చేస్తుంది. కనుక జగజ్జనని. 


శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।

జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥


తాత్పర్యం: 

తెల్లని వస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.  


#వివరణ:

మహాలక్ష్మిని శ్వేతాంబరధారిణిగా వర్ణించుట ఇందలి విశేషం.  సాధారణంగా సరస్వతిని శ్వేతాంబరధారిణి గా నుతిస్తారు. ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మి గా భావించినపుడు ఆమె సరస్వతీ స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి.  అష్టవిధలక్ష్ములలో విద్యా లక్ష్మి నానాలంకారభూషితురాలు.  ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమైనవే !  అమ్మ జగత్తునందలి చరాచర వస్తువులన్నింటా నిల్చి వాటిల్ని శక్తిమంతాలుగా చేస్తుంది.  అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం, లౌకిక స్థితికి అమ్మవారే కారణం !


మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।

సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥


ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।

ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥


త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।

మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥


తాత్పర్యం: 

ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు.  రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు.  రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. మూడుకాలాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం - పఠించే వాళ్ళు సకల శత్రు బాధల్ని తొలగించుకొని సుఖిస్తారు.  అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది.  శుభాలు కలిగిస్తుంది. 


#వివరణ:

ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, భక్తి ముఖ్యం.  భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలోపోసిన నీళ్ళవలె వృధా అవుతుంది.  సర్వం మహాలక్ష్మీ ఆధీనం.  ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు.  కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు.  వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు. భగవదనుగ్రహ పాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది.  అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి.  త్రిలోకాధిపతియగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య శ్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు.


ఇతి ఇంద్ర కృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం ||

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు