ఓం గం గణపతయే నమః🌹🙏

 ⚜️🕉️🚩ఓం గం గణపతయే నమః🌹🙏


గణపతిని జ్యేష్ఠ రాజుగా, సర్వ దేవతలలో ప్రథమ పూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి.


శ్రీ మహా గణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకూ కూడా ప్రభువు. ప్రణవ నాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞ వల్క్యస్మృతి చెప్పింది.


"గణ్యంతే బుధ్యంతే తే గణాః" అన్నట్లు సమస్త దృశ్య మాన వస్తు ప్రపంచానికి అధిష్టాన దేవత గణపతి. 


నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు విఘ్నేశ్వరుడు.


దేవతా గణాలు ఉద్భవించి, సృష్టి ప్రారంభం అయినప్పటి నుండీ ఆది పురుషునిగా గణపతి పూజలు అందుకుంటున్నట్టుగా గణేశపురాణం తెలియజేస్తోంది.

గణేశుడు విష్ణు స్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ అన్న శ్లోకం సూచిస్తుంది.


వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడుగా ఆవిర్భవించాడు.

ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో ఏకదంతుడై సంపదబొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు.


💥గణేశుని పుట్టుకే ఒక అద్భుత సంఘటన. నలుగు పిండిని నలచి వినాయకుడిని చేసి ద్వార పాలకునిగా నిలబెట్టింది పార్వతి. ముందు వెనుకలు చూడక తనను అడ్డగించినందుకు శివుడు కోపించి అతని తల దునిమేశాడు. పార్వతి విచారం చూడలేక తర్వాత శివుడే తన గణాలను పంపి ఏనుగు తల తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు.


సుందరతర శుభవదనుడై అరుణ కాంతితో అలరారుతూ జ్యోతి ప్రభలతో, ప్రకాశమానమైన దివ్యాకృతితో వెలుగొందుతూ ఉన్న ఆ బాలగణపతి బ్రహ్మ విష్ణు శంకరులకు నమస్కరించి..

"క్షంతవ్యశ్చాపరాధోమే మానశ్చై వేదృశో నృణామ్"

అంటూ అభిమానవంతుడనై ప్రవర్తించిన తన అపరాధమును మన్నించమని కోరతాడు.


పార్వతీదేవి ఆ బాలుని దగ్గరగా తీసుకొని ‘‘గజవదనా! నీవు శుభకరుడవు. శుభప్రదాతవు. ఇక నుండి సమస్త దేవతలలోనూ ప్రథమార్చన నీకే లభిస్తుందని’’ ఆశీర్వదిస్తుంది.


ఆనాటి నుండి గణనాథుని ప్రథమ పూజ్యుడుగా ఆరాధించడం మొదలైందనీ, జ్ఞానంతో ముక్తి మార్గాన్ని పొందడానికీ గణేశుని ఆవిర్భావానికీ తాత్త్విక సమన్వయ సంబంధం ఉందనీ శివపురాణం అత్యద్భుతంగా విశదీకరించింది.


💥గణపతి ఆరాధన సర్వ శుభాలను చేకూరుస్తుంది.

త్రిపురాసుర సంహారానికి బయలుదేరినపుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట.


నారదుని ప్రబోధంతో ఇందుమతీ రాణి గణపతి మట్టి విగ్రహాన్ని చేసి చవితినాడు పూజించి, తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగి పొందింది.


కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగంతో జన్మించినవాడై గణేశుని ఆరాధించి సర్వాంగ సుందరుడై విరాజిల్లాడు.


రుక్మాంగదుడు చింతామణి క్షేత్రంలో గణేశుని ఆరాధించి కుష్ఠువ్యాధి నుండి విముక్తి పొందాడు.


రుక్మిణీదేవి గణేశుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది.


వినాయక చవితినాడు గణపతిని ఆరాధించేవారు సర్వరోగ విముక్తులై, ఆరోగ్యప్రద జీవనాన్ని గడుపుతారు. 


సమృద్ధినీ, మేధాశక్తినీ, విద్యాజయాన్నీ, అనుకూల మిత్రత్వాన్నీ, కార్యసాధననూ అనుగ్రహించగల దేవుడు గణనాథుడు.


యోగులకు "పరబ్రహ్మ"గాను, భాగవతులకు "గాన ప్రియుడు"గాను, విద్యార్థులకు "విద్యాదాత"గాను,

నర్తకులకు "నాట్యాచార్యుడు"గాను, నిస్సంతులకు "సంతాన వర దాత"గాను.. ఇట్లా ఎవరు ఏ కోరికతో కొలిస్తే వారి వారి కోరికలు ఈడేర్చే "గణనాథుడు" సర్వారాథ్యుడిగా విశ్వానికి అధీశ్వరునిగా కీర్తించబడుతున్నాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥