💥వైశాఖ శుద్ధ తదియ.. పరశురామజయంతి.
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥వైశాఖ శుద్ధ తదియ.. పరశురామజయంతి.
పరశురాముని స్తుతి:
ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీనె కద దాశరధీ కరుణా పయోనిధీ.
శ్రీ మహా విష్ణువు దశావతారాలలో ఆరవ అవతారమే శ్రీ పరశురామ అవతారం. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించాడని స్కంద పురాణం మరియు బ్రహ్మాండ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది.
ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆవేశావతారంగా అగుపిస్తాడు. అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంత వరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగలుగుతాడు. పరశురాముడు చిరంజీవుల్లో ఒకడిగా కుడా ప్రసిద్ధుడు.
పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్య ప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలియజేస్తున్నాయి.
కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరకు వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయి గుర్రాలు ఇమ్మని కోరుతాడు.
ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి "విప్ర" మంత్రపూతం అయిన ఒక హవిస్సు, "రాజ" మంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళతాడు.
సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని.. విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది.
ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని చెబుతాడు.
ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు.
భృగువంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.
పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.
హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని వేయి చేతులు పొంది మహావీరుడైనాడు.
ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు.
ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు.
ఆగోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు.
పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
కాలం ఇలా నడుస్తుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది.
కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు.
జమదగ్ని సంతోషించి ఏమైనా వరం కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది.
పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు.
శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం
అర్పిస్తాడు. దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విషయం తెలిసిన పరశురాముడు తన గురువైన శివుడి విల్లు విరిచినందుకు కోపంతో రాముడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరథుడు చేసిన అభ్యర్థనలను కానీ, శ్రీరాముని శాంత వచనాలను కానీ పట్టించుకోకుండా చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రాముడికి ఇచ్చాడు.
రాముడు దాన్ని కూడా అవలీలగా ఎక్కుపెట్టాడు. శ్రీరాముడు తాను ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు వదలాలి అని పరశురాముడిని అడిగగా తన తపోశక్తిని కొట్టేయమని చెప్పి తిరిగి మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
పరశురామ జయంతి దినాన్ని పురస్కరించుకుని చాలా మంది ప్రజలు ఉపవాసం ఉంటారు. పూజలు, హవనాలు నిర్వహిస్తారు. కొంతమంది "భాండారా" పేరుతో పేదలకు, భక్తులకు అన్నదానం చేస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment