⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః🌹🙏


జపా-కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్

తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్!!


మందార పువ్వు (జపా కుసుమం) రంగుతో శోభిల్లుచున్న, కశ్యప వంశములో జన్మించి, గొప్ప కాంతితో వెలుగొందుచూ, సర్వ పాపములను పోగొట్టువాడు అయి ఉండి, దివాకర నామముతో పిలవబడుచున్న సూర్య భగవానునికి నమస్కరించుచున్నాను.


మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు.

వీరందరిలో మన చర్మచక్షువులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు.


అందుకనే ఆయన కర్మసాక్షి అయ్యాడు. సకల వేద, పురాణ, ఇతిహాస, కావ్య వాజ్ఞ్మయమంతా సూర్యోపాసన వైశిష్ట్యాన్ని ప్రకటిస్తుంది.


కంటికి కనిపించే సకల ప్రపంచాన్ని తన తేజస్సు ద్వారా నడిపించే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. 


అదిత్యుడని, భానుడని, మిత్రుడని... ఎన్నో పేర్లతో పూజలందుకుంటూ, మనలోని అజ్ఞాన తిమిరాల్ని తన కిరణాల ద్వారా దహింపజేస్తూ, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసే దైవం సూర్యనారాయణమూర్తి.


తరు, పశు, పక్ష్యాదులతో సహా ఏ జీవి చైతన్యంగా ఉండాలన్నా అందుకు ఆదిత్యుని అనుగ్రహం తప్పనిసరి.


సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు. అనంతమైన శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు. 


అన్ని ఐశ్వర్యాలకన్నా పరమోన్నతమైన ఆరోగ్య భాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి.


అందుకనే, ఆదిత్యోపాసన సర్వోన్నతమైందిగా, సకల పాపాలను పోగొట్టే తారకమంత్రంగా శాస్త్ర, పురాణ, ఇతిహాస గ్రంథాలు చెబుతున్నాయి.


సూర్యోపాసన చేసి, సూర్యశతకాన్ని రచించిన పుణ్యం చేత మయూరుడనే కవి కుష్ఠువ్యాధి నుంచి విముక్తుడయ్యాడు.


అగస్త్య మహర్షి చేత ఆదిత్యహృదయాన్ని ఉపదేశం పొంది, దాన్ని పారాయణ చేసిన ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించాడు. 


ఇంకా మరెందరో పుణ్యమూర్తులు సూర్యోపాసన చేసి, రథసప్తమీ వ్రతాన్ని ఆచరించిన పుణ్యప్రభావం చేత ఎందరో భక్తులు ఎన్నో బాధల నుంచి విముక్తులైన గాథలు ఉన్నాయి. మొత్తంగా సూర్యోపాసన అనంతమైన ఫలితాలను ఇస్తుంది.


సూర్యగ్రహ గమనాన్ని బట్టే ఋతువులు, ఉత్తర, దక్షిణాయనాలు ఏర్పడతాయి. ఈవిధంగా సూర్యగమనంలో మార్పుల వల్ల ఏర్పడ్డ ఉత్తరాయణమే మకర సంక్రమణంగా, సంక్రాంతి పండుగగా లోకంలో వ్యాప్తి చెందింది.


ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల సముద్రాలు, నదుల్లోని నీరు ఆవిరవుతుందని,  ఆ ఆవిరి మేఘాలుగా మారి, వర్షించటం వల్ల సకల ప్రాణికోటి తాగటానికి మంచి నీరు, పంటలు పండటానికి తగిన నీరు లభిస్తోందని చెబుతోంది.


ఈవిధంగా చూసినా అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యుడే అని స్పష్టమవుతోంది.


సూర్యారాధన వల్ల విజ్ఞానం, ఉత్తమ గుణాలు, వర్చస్సు, ఆయుష్షు, ధనం, సంతానభాగ్యం కలుగుతాయి. వాత, పిత్త, క్షయ, కుష్ఠు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా ఆరోగ్య సంపద ఆదిత్యుని ఉపాసన ద్వారా వరంగా లభిస్తుంది.


జ్యోతిషశాస్త్రం ప్రకారం శారీరక రోగాలు ఉన్నవారు సూర్యారాధన చేస్తే, మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి నేత్రదోషాలు, చర్మవ్యాధుల నుంచి సూర్యోపాసన ద్వారా వేగంగా ఉపశమనం లభిస్తుంది.  


మొత్తంగా సూర్యోపాసన సకల వ్యాధులను దూరం చేసేదిగా, సకల పాపాలను పోగొట్టే ఉత్తమ వ్రతంగా లోకవ్యాప్తిలో ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


మానవ జీవితం ప్రకృతి అధీనమని, ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదనే జాగృతిని "సూర్యోపాసన"  తెలియజేస్తుంది.


భారతీయ ఆచార సంప్రదాయాలు, పండుగలు మూఢనమ్మకాలు కావని, అనంతమైన వైజ్ఞానికత వాటిలో దాగి ఉందని సూర్యోపాసన చాటుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం