⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


సనాతన సంప్రదాయం ప్రకారం ఏ పూజలు చేపట్టినా, ఏ యజ్ఞ యాగాదులు చేపట్టినా వినాయకుడికే తొలిపూజ చేసి, ఆ తర్వాత మిగిలిన క్రతువులను కొనసాగించడం ఆనవాయితీ.


పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు ప్రమథగణాలకు ఆధిపత్యం పొందినందున గణపతిగా, విఘ్నాలను నివారించే దేవుడు కనుక విఘ్నేశ్వరుడిగా

పూజలందుకుంటున్నాడు. 


వినాయక వ్రతకల్పంలోని గాథ వినాయకుడి సృష్టి ఎలా జరిగిందో మాత్రమే చెబుతుంది. అయితే, పార్వతీ పరమేశ్వరులు గణపతిని ఎందుకు సృష్టించారనే దానికి సంబంధించిన గాథ స్కాంద పురాణంలో ఉంది. ఇది వ్రతకల్పంలోని గాథకు కొంత భిన్నమైనది.


గణపతిని ఎందుకు సృష్టించారంటే..?


స్వర్గలోకం సకల భోగాలకు నిలయం. భూలోకంలో జీవితాంతం అలాంటి భోగాలను అనుభవించడం అసాధ్యం.


జరామరణాలతో కూడిన మర్త్య జీవితం కంటే, స్వర్గాన్ని చేరి అమర సౌఖ్యాలను అనుభవిస్తేనే కదా సార్థకత అనుకున్న మానవులు ఘోర తపస్సులు ఆచరిస్తూ, తపః ఫలితంగా ఒక్కొక్కరే స్వర్గానికి వెళ్లసాగారు. స్వర్గంలో దేవతల కంటే మనుషులే ఎక్కువయ్యారు. స్వర్గంలో తమ ఆధిక్యత పెరగడంతో మానవులు ఏకంగా దేవతల మీద ఆధిపత్యం చలాయిస్తూ స్వైరవిహారం చేయడం ప్రారంభించారు.


మానవులంటేనే దేవతలు భయపడే పరిస్థితి దాపురించింది. మానవులకు భయపడుతూ బతకడం దుస్సహంగా ఉందని, వాళ్లను ఎలాగైనా నియంత్రించాలని స్వర్గంలోని దేవతలందరూ దేవేంద్రుడితో మొరపెట్టుకున్నారు.


తపస్సులు సాగించి స్వర్గానికి వచ్చిన వాళ్లను ఎలా నియంత్రించాలో దిక్కుతోచని దేవేంద్రుడు నేరుగా కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి, వారిని పరిపరి విధాల స్తుతించాడు.


'దేవేంద్రా! నీ రాకకు కారణమేమిటి?' అని పరమేశ్వరుడు ప్రశ్నించగా, తన మొర వినిపించాడు.


'పరమేశ్వరా! ఘోర తపస్సులు చేసి, తపః ఫలాల కారణంగా స్వర్గానికి చేరుకున్న మానవులు దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇదేమని నిలదీసిన దేవతలను నానా రకాలుగా బాధిస్తున్నారు. వారి దాష్టీకాలకు స్వర్గంలో ప్రశాంతత లేకుండా పోయింది. మానవజాతి అంటేనే దేవతలు భయభ్రాంతులయ్యే పరిస్థితి దాపురించింది. మానవుల బెడద నుంచి మమ్మల్ని నీవే కాపాడాలి తండ్రీ!' అని వేడుకున్నాడు.


దేవేంద్రుడి మాటలు విన్న పరమేశ్వరుడు సాలోచనగా

పార్వతీదేవి వైపు చూసి చిరునవ్వు చిందించాడు. అప్పుడు పార్వతీదేవి మట్టి తీసుకుని తన చేతులతో ఒక ఆకృతిని రూపొందించింది.


ఏనుగు ముఖం, పెద్దబొజ్జ, భారీ శరీరం, నాలుగు చేతులు కలిగిన వింత ఆకారం ప్రాణం దాల్చి, పార్వతీ

పరమేశ్వరులకు నమస్కరించి, పార్వతీదేవితో ఇలా అన్నాడు.


‘అమ్మా! నన్ను ఎందుకు సృష్టించారో చెబుతారా? 'అందుకు పార్వతీ దేవి, 'నాయనా! నీవల్ల నెరవేరవలసిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్లు. అక్కడ స్వర్గానికి వెళ్లాలనుకుంటున్న మానవులకు విఘ్నాలు కలిగించు. ఈ బృహత్కార్యంలో నీకు నంది, మహాకాలుడు సహాయకులుగా ఉంటారు' అని బదులిచ్చింది.


ప్రమథ గణాలకు అధిపతిగా తానే స్వయంగా గణేశుడికి అభిషేకం చేయించింది. ఈ కార్యక్రమాన్ని తిలకించిన దేవతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గణేశునికి జయజయ ధ్వానాలతో ఆశీస్సులు పలికి, పుష్పవృష్టి

కురిపించారు.


పరమేశ్వరుడు గణపతికి పరశువును, బ్రహ్మ త్రికాలజ్ఞతను, విష్ణువు బుద్ధిని, కుబేరుడు ఐశ్వర్యాన్ని, సూర్యుడు పరాక్రమాన్ని, చంద్రుడు కాంతిని, దేవేంద్రుడు సౌభాగ్యాన్ని, పార్వతీదేవి మోదకపాత్రను ఇచ్చారు. కుమారస్వామి మూషికాన్ని గణేశునికి వాహనంగా బహూకరించాడు.


ఇలా దేవతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చి, గణేశుని గణాధిపత్యాన్ని ఆమోదించడంతో అతడు అమిత బలశాలిగా మారి, పార్వతీదేవి అనుజ్ఞతో దేవతలంతా తనపై ఉంచిన కార్యభారాన్ని నెరవేర్చేందుకు భూలోకానికి పయనమయ్యాడు.


స్వార్థబుద్ధులై స్వర్గప్రాప్తిని ఆశించే మానవులకు ప్రతి పనిలోనూ విఘ్నాలు కలిగించడం ప్రారంభించాడు. వినాయకుడు కల్పించిన విఘ్నాలను అధిగమించడం మానవులకు దుస్సాధ్యంగా మారింది.


వినాయకుడి ప్రభావంతో స్వర్గలోకానికి వెళ్లే మానవుల

సంఖ్య తగ్గుముఖం పట్టింది. స్వర్గంలో తిరిగి ప్రశాంతత

ఏర్పడింది. మానవుల్లో గణపతి పట్ల భయభక్తులు ఏర్పడ్డాయి. అందుకే ఏ పని మొదలుపెట్టినా, విఘ్నాలు తొలగించుకోవడం కోసం వినాయకుడికి తొలిపూజలు చేయడం ప్రారంభించారు.


భక్తి శ్రద్ధలతో పూజించి వినాయకుడి అనుగ్రహం పొందిన వారు తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని, ఆయనకు ఆగ్రహం కలిగిస్తే విఘ్నాలు తప్పవనే నమ్మకం బలపడింది.


వినాయకుడు అవతరించిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక వ్రతం ఆచరించడం అప్పటి నుంచే మొదలైందని ప్రతీతి. 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు