కార్తికపురాణము

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥కార్తికపురాణము - తృతీయోధ్యాయము💥


శ్లో!! కార్తీకేమాసి రాజేంద్ర స్నానదాన జపాదికం!

లేశంవాకురుతేమర్త్యః తదక్షయ్య ఫలం స్మృతమ్!!


ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు స్నానము దానము జపము మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసిన యెడల ఆ స్వల్పమే అనంతఫలప్రదమగును. స్త్రీలుగాని, పురుషులుగాని, అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తీకవ్రతమును

చేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమిరోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడైయుండును. ఈవిషయమందొక పూర్వకథ చెప్పెదను వినుము.

ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించివాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలయందాసక్తి గలవాడు. రాజా! ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకుపోవుచు గోదావరీ తీరమందు ఆకాశమునంటియున్నట్లు ఉన్న ఒక మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి. నోరు వికటముగా ఉన్నది. శరీరము నల్లగా ఉన్నది. ఉదరము కృశించియున్నది. నేత్రములు, గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నవి. దంతములు పొడుగుగా

ఉన్నవి. చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయముచేత ఆ వటవృక్షమునకు ఆరుక్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుట లేదు. పర్వతసమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలయిన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను చేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్త్వనిష్ఠుడు దైవవశముచేత మార్గమున పోవుచు మర్రిచెట్టు మీద ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచి

భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు

దేవేశా! నన్ను రక్షించుము. లోకేశా!నారాయణా!అవ్యయా! నామొర ఆలకించుము. సమస్త భయముల నశింపచేయు దేవా! నాభయమును పోగొట్టుము. నాకు నీవే దిక్కు. నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరు లేరు. హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మ రాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతనివెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంతదూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మ రాక్షసులకు జాతి స్మృతి గలిగినది.

ఓరాజా! తరువాత వారు ఆ బ్రాహ్మణుని ముందు భూమియందు దండప్రణామములాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లనిస్తుతించిరి. బ్రాహ్మణోత్తమా! మీదర్శనమువలన మేము పాపరహితులమైతిమి. మీరాక మాకు ఉపకారము అయినది. అది న్యాయమే మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుటకొరకే ఉపకారము కొరకే అగునుగదా! బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో . మీరెవ్వరు? ఏకర్మచేత మీకు ఇట్టి వికృతరూపములు కలిగినవి? లోకనిందితమైన ఏకర్మను మీరు పూర్వమందు చేసినారు. భయమును వదలి సర్వమును నాకు చెప్పవలసినదని అడుగగా రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పల్కెను. అయ్యా? నేను పూర్వజన్మమందు ద్రావిడదేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడను. కఠినముగా మాటలాడువాడను. ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నాకుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని, బ్రాహ్మణులకు గాని ఒకనాడయినను అన్నమును పెట్టి యెరుగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహముచేత హరించుటచేత ఏడుతరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్య చంద్ర నక్షత్రములు ఉండువరకు కుటుంబము నశించును. తరువాత మృతినొంది యమ బాధలను అనేకములనొందితిని. ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని. బ్రాహ్మణోత్తమా! ఈ దోషము నశించు ఉపాయమును విచారించి చెప్పమని అడిగాడు.

రెండవవాడు అయ్యా! నేను ఆంధ్రదేశమందు ఉండే వాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేను, నా భార్యాపిల్లలును, షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నాతల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను. బంధువులకుగాని, బ్రాహ్మణులకుగాని, ఒకనాడయినను అన్నమును పెట్టినవాడనుకాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు యెనిమిదియుగముల వరకు యమబాధలనుబొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించితిని. ఓబ్రాహ్మణోత్తమా! నాకీపాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుమని అడిగాడు. మూడవవాడు నమస్కరించి తన స్థితిని అయ్యా! నేను ఆంధ్రదేశ నివాసిని. బ్రాహ్మణుడను. విష్ణ్వాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను చేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి, నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆనేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి

దానితో సంభోగించుచుండు వాడను. ఆ దోషముచేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రిచెట్టు మీద ఉన్నాను. సమస్త భూతదయాపరా బ్రాహ్మణోత్తమా! నన్ను రక్షించు. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపచేయమని అడిగాడు.

తత్త్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది మీకు కొంచెమైనను భయములేదు. మీదుఃఖము పోగొట్టెను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను. నాతో మీరుకూడా రండి అని వారిని తీసుకొనిపోయి కావేరి నదిలో రాక్షసులచే గూడ స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను. "అముకానాం బ్రహ్మరాక్షసత్త్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్స్నానమహం కరిష్యే" ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆముగ్గురు దోషవిముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు పోయిరి. ఓ జనకమహారాజా! వినుము. మోహము చేతగాని, అజ్ఞానముచేత గాని కార్తీకమాసంబున శుక్ర నక్షత్రముదయించినప్పుడు (తెల్లవారుఝామున) సూర్యోదయకాలమందు కావేరీనది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణుపూజను చేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీకమాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నామును తప్పక చేయవలయును. కార్తీకమాసమందు దామోదర ప్రీతిగా ప్రాతఃస్నానము చేయని వాడు పదిజన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీగాని, పురుషుడుగాని కార్తీకమాసమందు తప్పక ప్రాతఃస్నానము చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు.

ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే తృతీయోధ్యాయసమాప్తః

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు