⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


విద్యకు, విజ్ఞానానికి, బ్రహ్మతత్వ వివేచనానికి ప్రతీకగా విఘ్నేశ్వరుడు విచిత్రమైన మూషికవాహనాన్ని అధిరోహిస్తాడు. వింతైన మోదకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తాడు. ఇంతకూ మూషికానికి, మోదకానికి గల ఆధ్యాత్మిక వైశిష్ట్యం ఏమిటి?


💥ఆదిపూజితుడిగా మోక్షదాయకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే లంబోదరుడు మూషికాన్ని తన వాహనంగా ఎంచుకున్నాడు. ఇందులో ఆధ్యాత్మిక గూఢార్థముంది. 


వెలుగంటే భయపడే ఈ అల్పజీవి నేలలో చీకటి బొరియలు చేసుకొని నివసిస్తుంది. చీకటిలో అత్యంత వేగంగా పరుగెట్టే ఎలుక ఇంద్రియ లౌల్యానికి నిదర్శనం. 


ఆవిధంగా అజ్ఞానానికి, భయానికి, కామక్రోధాలకు ప్రతీక అయిన ఎలుకపై సర్వవిద్యాసమన్వితుడైన విఘ్నేశుడు కూర్చోవడం ద్వారా మానవులు అజ్ఞాన నివృత్తిని సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాడు.


అంతరంగపు వెలుగును ఇచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం, ఇంద్రియాలను నిగ్రహించడం, ధర్మాచరణతో నిర్భయులవడం వంటి లక్షణాలను సాధించడం ద్వారా మానవులు ముక్తిధామాన్ని చేరగలరని ఉపదేశించే దివ్యమూర్తి విఘ్నేశ్వరుడు.


💥మోదకం – అంతరార్థం


గణపతికి మోదకం అత్యంత ప్రియమైన తినుబండారం. అచ్చ తెనుగులో ఉండ్రాళ్ళుగా పిలువబడే ఈ మోదకం బొజ్జ గణపయ్యకు ప్రియమైన ఆహారం కావడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది.


పూర్వం దేవతలు సమస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దివ్యమైన మోదక రూపంలో కూర్చి పార్వతీపరమేశ్వరులకు సమర్పించారట. జగజ్జనని అయిన పార్వతీదేవి ఆ మోదకాన్ని తన పుత్రులైన గణపతి, కుమారస్వాములకు చెరి సగం పంచి ఇవ్వబోయింది. ఈ విభాగాన్ని నిరాకరించిన పుత్రులిద్దరూ ఆ మోదకం తమకే కావాలని పట్టుబట్టారు.


అప్పుడు గణపతి, కుమారస్వామి ఇద్దరిలో ఎవరు తమ భక్తిని నిరూపిస్తారో వారికే మోదకం దక్కుతుందని చెప్పింది పార్వతీదేవి.


తల్లి మాటను ఆలకించిన షణ్ముఖుడు తన మయూర వాహనం ఎక్కి వెనువెంటనే సమస్త తీర్థ క్షేత్రాలను దర్శించడానికి బయలుదేరాడు.


వినాయకుడు మాత్రం “జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” అంటూ తల్లిదండ్రులకు భక్తితో ప్రదక్షిణలు చేసాడు. విఘ్ననాయకుని వినయాన్ని, విజ్ఞతను వీక్షించిన హిమాలయ తనయ ఆ దివ్య మోదకాన్ని మూషికవాహనుడికి అనుగ్రహించింది. 


ఆవిధంగా మోదకం వినాయకునికి అత్యంత ప్రియమైన భక్ష్యంగా మారింది. ఆనాటి నుండి పార్వతీతనయుడు మోదకప్రియునిగా త్రిలోకఖ్యాతిని పొందాడు.


సంస్కృతంలో మోద అంటే అత్యంత ఉన్నతమైన సంతోషమని అర్థం. ఆవిధంగా మోదక అంటే సంతోషాన్ని కలిగించేదని అర్థం.


జీవులకు నిజమైన సంతోషాన్ని కలిగించేది జ్ఞానం మాత్రమే అని సకల శాస్త్రాలు చాటుతున్నాయి. మోదకం పైనుండే పొరలు పంచభూతాలను సూచిస్తాయి. ఆ లోపల ఉండే మెత్తటి, తియ్యటి పూర్ణం భాగం ఆధ్యాత్మిక జ్ఞానానికి నిదర్శనం.


ఈవిధంగా మోదకం ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూనే మోక్షదాయకమైన వేదాంత జ్ఞానాన్ని సాధించే సూక్ష్మాన్ని బోధిస్తుంది.


ముక్తిహేతువైన జ్ఞానదాయకునిగా కీర్తిని పొందిన గణపతి ’మోదక హస్తు’నిగా, ’మోదక ప్రియుని’గా సాక్షాత్కరిస్తూ భక్తుల తాపత్రయాలను తొలగించి, జ్ఞానప్రాప్తిని అందిస్తున్నాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు