💥హనుమదుపాసన సర్వ సంపత్కరం..

 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏


💥హనుమదుపాసన సర్వ సంపత్కరం..


బ్రహ్మచర్య పాలన, శత్రు నిగ్రహం, కామ విజయం, కార్య సిద్ధి తదితర విషయాల దృష్ట్యా హనుమంతుడు ప్రసిద్ధి. దాస్య భక్తికి చక్కని నిదర్శనంగా నిలిచిన హనుమంతుడ్ని అంజనీ పుత్రుడు, పవనసుతుడు, రుద్రావతార మూర్తి, కేసరీ నందనుడు, సాధు శిరోమణి, కపి శిరోమణి, భక్త శిరోమణి, పాప నాశకరుడు తదితర పేర్లతో మనం స్మరిస్తాం.


రుద్రావతారుడు కావడం చేత శంకర నందనుడయ్యాడు. కేసరికి ఔరస పుత్రుడు కావడం వల్ల కేసరి నందనుడయ్యాడు.


హనుమంతునికి పవన సుత, అంజనీపుత్రుడు అనే పేర్లు రావడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది.


పుంజిక స్థల అనే అప్సరస శాపగ్రస్తురాలై కామ రూపం గల దివ్యాతి దివ్యమైన వస్త్రాలను ధరించి సంచరిస్తుందట. ఆమెను వీక్షించిన వాయుదేవుడు ఆమె వైపు పురోగమించాడు. ఈ హఠత్పరిణామానికి విస్తుపోయిన పుంజికస్థల పతివ్రత అయిన తనను స్పృశించిన వారెవరని గద్ధించిందట.


అంతట వాయుదేవుడు దేవీ.. అలాంటిదేమీ లేదు. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, అనాధ నాధుడు, కరుణామయుడైన భగవానుడు భూ భార హరణార్ధం మానవ రూపాన అవతరించనున్నాడు.


ఆ పరమాత్ముని సేవ కోసం నీ పుత్రునిగా మారుతి పుట్టి విఖ్యాతుడవుతాడని చెప్పాడట. అలా హనుమంతునికి పవన సుత, అంజనీ పుత్ర అనే పేర్లు వచ్చాయి.


అంతటి మహమాన్వితుడైన హనుమంతుడు మహా తత్వవేత్త. సనక, సనందన, సనత్కుమార, సనాతన సోదరులు నలుగులు హనుమంతుని ద్వారా రామ మంత్ర రహస్యాన్ని గ్రహంచారు.


హనుమదుపాసన అన్ని విధాల శ్రేయస్కరంగా పురాణాలు చెబుతున్నాయి. ఏకాగ్రతకు, స్వచ్చతకు మారుపేరు హనుమంతుడు కావడం వల్ల ఆ స్వామి దర్శనం, పూజల వల్ల ఏకాగ్ర చిత్తం ఏర్పడి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.


భూత, పిశాచ పీడా నివారణకు హనుమంతుని నామస్మరణమే పరమావధిగా చెబుతారు. బుద్ధి, వీర, బలాదులను హనుమంతుడు తన భక్తులకు ప్రసాది స్తూంటాడు.


భూత, ప్రేత, రాక్షసాదులు ఆ మహాత్ముని నామోచ్చరణ మాత్రం చేతనే పారిపోతాయి. స్మరణం మాత్రం చేతనే సమస్త రోగాలు శాంతిస్తాయి. హనుమంతుని ఆరాధించడం వల్ల ఆయనలోని సద్గుణాలన్నీ సాధకులు, భక్తులకు లభిస్తాయి.


హనుమదోపాసన పరమోత్కృష్టమైనది. హనుమదుపాసనకు ఏ నియమం లేదు. వయసు, కులం, మతం తేడాలు అంతకన్నా లేవు. నిష్కలమైన భక్తి విశ్వాసాలుంటే ఆ స్వామి కరుణిస్తాడు. అనుగ్రహంచి కోరినవన్నీ సమకూరుస్తాడు.


అపారమైన విశ్వాసం, నిష్కల్మషమైన సేవా గుణాలే హనుమంతుని అనుగ్రహానికి కారణమవుతాయి. జీవితంలో వెంటాడే భయాలకు దూరంగా ఉండి, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే హనమదుపాసనే మార్గం.


అయితే హనుమంతుని పూజలకు మంగళ, శనివారాలు శ్రేష్టమైనవిగా పెద్దలు చెబుతారు. స్వామి మంగళప్రదుడు కావడంవల్ల మంగళవారం పూజిస్తారు. అలాగే శని దోషాలను నివృత్తి చేసేవాడు కనుక శనివారం కొలుస్తారు. 


ఆయా రోజులలో స్వామిని తమలపాకులతో సేవించడం విశేషమైన ఫలితాలనిస్తుందంటారు. సింధూర వర్ణ శోభితంగా దర్శనమిచ్చే హనుమంతుని దర్శనం, స్మరణం, కీర్తనం వల్ల సమస్త దారిద్య్రాలు పోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు