💥ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి?

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


నీ పాద కమల సేవయు

నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం

తాపార భూతదయయును

తాపస మందార! నాకు దయసేయగదే!


💥ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న పద్యం తెలియజేస్తుంది.


"అధికారం" కోరలేదు. దానివల్ల అహంకారం పెరుగుతుంది కాబట్టి. అది రజోగుణ లక్షణం. అది చివరికి దుఃఖదాయకం అవుతుంది.


ధనం కోరుకోలేదు. ‘ధనమెచ్చిన మదమెచ్చును’ అనేది ఉండనే ఉన్నది.


💥ముచ్చటైన మూడు కోర్కెలు..


1) "నీ పాద కమల సేవయు"


భగవంతుడు సేవ్యుడు (సేవించదగిన వాడు). భక్తుడు సేవకుడు.


భగవానుడి పాదసేవ వల్ల అహంకారం పరిహారం అవుతుంది. అది సత్వ గుణ లక్షణం. కాబట్టి క్రమంగా దివ్యానంద ప్రదమైన భగవత్‌ సన్నిధానానికి దారితీస్తుంది.


2) "నీ పాదార్చకుల తోడి నెయ్యము"


అంటే ‘నీ పాదాలను అర్చించేవారితో స్నేహం ప్రసాదించమ’ని అడిగాడు. భగవదర్చన వల్ల క్రమంగా అహంకారం మాయమవుతుంది.


అహంకారం లేనివాడు అలాంటివారితోనే స్నేహం చేయాలి కానీ, అహంకారులతో కాదు. చేసినా అది కలకాలం నిలువదు. 


3) "నితాంతాపారభూతదయ"


ఎల్లప్పుడూ అపారమైన భూతదయ ఉండాలని కోరుకున్నాడు.


ప్రాణులపట్ల దయ ఏ ఒక్కసందర్భం లోనో కాదు, ఎల్లప్పుడూ ఉండాలి. అలా ఉండకపోవడం వల్లే మనిషి జంతు హననానికి పాల్పడుతున్నాడు. అంతే కాదు సాటి మనుషులనూ చంపడానికి వెనుదీయడం లేదు.


నిరంతరం పాపభీతి లేకుండా జంతు హననానికి పాల్పడుతున్న మనిషిపై భగవంతుడికి కరుణా కటాక్షాలు ఎందుకు ఉంటాయి? లోకంలో మనుషులే బాధితుల పక్షం వహిస్తుంటే, దేవుడు మాత్రం వహించడా!


💥‘నీ పాదకమల..’ పద్యంలో సుదాముడు కోరుకున్న ముచ్చటైన మూడింటి కోసమే తపస్సు.

అటువంటి తాపసులకు కల్పవృక్షం భగవంతుడు. 

అందుకే దేవుణ్ని ‘తాపస మందార!’ అని సంబోధించారు. 


ఆయన కృపావృష్టి మనపై సదా కురవాలని కోరుకుందాం!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments