భాద్రపద శుద్ధ పంచమి.. ఋషిపంచమి.

 ⚜️🕉️🚩 సప్తఋషిభ్యో నమః🌹🙏


భాద్రపద శుద్ధ పంచమి.. ఋషిపంచమి.


కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః|

వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||


కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు.


ఋషి పంచమి రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.


అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు.


సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి.


తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు.


రాముని గురువు విశ్వామిత్రుడు.

కులగురువు వశిష్టుడు.


విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి.


దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి.


ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.


💥సప్తఋషి ధ్యాన శ్లోకములు💥


కశ్యప ఋషి:

కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః|

ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||

ఓం అదితి సహిత కశ్యపాయ నమః||


అత్రి ఋషి:

అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్|

సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||

ఓం అనసూయా సహిత అత్రయేనమః||


భరద్వాజ ఋషి:

జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్|

కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||

ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||


విశ్వామిత్ర ఋషి:

కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్|

దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||

ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||


గౌతమ ఋషి:

యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||

ఓం అహల్యా సహిత గౌతమాయనమః||


జమదగ్ని ఋషి:

అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్|

దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||

ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః


వశిష్ట ఋషి:

శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్|

బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా|| ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||


💥"ఋషిపంచమి" స్త్రీలకు సంబంధించిన పండుగ. ఏటా భాద్రపద శుద్ధ చవితి మర్నాడు వచ్చే పంచమి రోజు ఆచరించాలని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.


ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో ఏర్పడిన దోషాలు తొలగిపోతాయని, ఆ సమయంలో చేసే పాపాలు పరిహారం అవుతాయని స్వయంగా బ్రహ్మదేవుడు శితాశ్వుడనే మహారాజుకి చెప్పాడని పురాణాల్లో ఉంది. 


హైంద‌వ సంస్కృతిలో ఋషి పంచ‌మికి ఎంతో విశిష్ట‌త ఉంది. ఋషి పంచమి పర్వదినాన ప్రాతఃకాలంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీతీరానికి వెళ్లి అక్కడి మట్టిని తీసుకుని శరీరానికి రాసుకుని, గోమయం, గోమూత్రంతో శరీరాన్ని శుభ్రపరచుకోవాలి.


అనంతరం నదీస్నానమొనరించి ఆ నదీజలాన్ని తీర్థంగా తీసుకోవాలి. స్నానానంతరం సూర్యునికి నమస్కరించి నదీజలాన్ని దోసిళ్ళతో తీసుకొని అర్ఘ్యమివ్వాలి. 


అనంతరం ఇంటికి చేరుకున్న తర్వాత వ్రతానికి సంబంధించిన పూజాగృహాన్ని, ఇంటిని గోమయంతో శుభ్రం చేసి మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.


గడపలకు పసుపురాసి, కుంకుమ పెట్టి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పూజా అనంతరం.. "మమ రుతుసంపర్క జనిత దోష పరిహారార్థం అరుంధతీ సహిత కశ్యపాం రుషి ప్రీత్యర్థం రుషిపూజన కరిష్యే" అని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతిని, నవగ్రహాలను పూజించాలి.


సప్త ఋషులను అర్చించి, పంచామృతం, బియ్యం, గంధం, కుంకుమ, పూలు, ఆకువక్కలుతో ప్రసాదం సమర్పించి, హారతిని ఇవ్వాలి. వేదవిదులకు వాయనమిచ్చి పూజించాలి.


పంచమి తిథి మధ్యాహ్నం ఉన్న రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం. వరుసగా ఏడు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉద్యాపన చేయాలి.


💥ఋషి పంచమి కథ:


పూర్వకాలంలో విదర్భ దేశంలో ఉత్తంకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కుమార్తెకు జన్మాంతర పాపం చేత  వివాహమైన కొంత కాలానికే భర్త చనిపోగా తండ్రి వద్దనే ఉండేది. తండ్రి వేదపారంగతుడవడం వల్ల ఎందరో శిష్యులు ఉండేవారు.


ఒకనాడు ఉత్తంకుడు తన కుమార్తె శరీరం నుండి పురుగులు రాలి పడటాన్ని చూశాడు. దివ్యదృష్టితో పరిశీలించగా ఆమె గత జన్మలో రుతుక్రమంలో ఉన్న సమయంలో వంట ఇంటిలోకి ప్రవేశించి పాత్రలను తాకడం వల్లనూ, రజస్వలా నియమాలను పాటించకపోవడమూ చేసేది.


ఒకప్పుడు ఆమె చెలికత్తెలు ఋషిపంచమి వ్రతాన్ని చేస్తుంటే చూసి ఎగతాళి చేసింది. కానీ ఆ వ్రతాన్ని చూసినందువల్ల ఈ జన్మలో ఉత్తమమైన కుటుంబంలో పుట్టింది.


ఆమె తండ్రి తన కుమార్తె చేసిన దోష పరిహారార్థం ఋషిపంచమి వ్రతాన్ని ఆచరింపజేసి, పాప విముక్తిని కలిగింప జేసి, ఆమె సంపూర్ణ ఆరోగ్యం పొందే విధంగా చేశాడు.


భూమ్మీద మనిషిగా జన్మించినందుకు తీర్చుకోవాల్సిన పంచరుణాల్లో ఋషి రుణం కూడా ఒకటి. మనం అనుసరించాల్సిన ధర్మాలు, పాటించాల్సిన ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ నేర్పించింది వీళ్లే.. అందుకు కృతజ్ఞతగా ఋషిపంచమి రోజు వారిని సంతుష్టులను చేస్తారు.  


మానవ జీవన మార్గానికి దశను, దిశను నిర్దేశించిన మహర్షులను స్మరించడం మన బాధ్యత. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇలా మనం ఒక తత్వమార్గంలో పయనించడానికి మూలపురుషులు ఆ మహాజ్ఞానులే. అందుకే వారిని స్మరించి, దివ్యమార్గం వైపు పయనించి తరిద్దాం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం