💥భాద్రపదమాసం శుక్ల చతుర్థి.. వినాయకచవితి

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః🌹🙏


💥భాద్రపదమాసం శుక్ల చతుర్థి.. వినాయకచవితి


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ!

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!!


వక్రతుండుడైన గజాననుడు కోటి సూర్యులతో సమానమైన కాంతితో ప్రకాశిస్తూ... భక్తుల ప్రార్థనలను మన్నించే మహితాత్ముడు. భక్తితో ఆయనను కొలిచిన వారికి ఏ విఘ్నం కలుగదనేది విశ్వాసం.


💥💥సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.


💥విఘ్నేశ్వరుని కథ:


"పూర్వం గజ రూపం కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి' అని కోరాడు.


శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు.


కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడవలసింది'  అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.


శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు.


దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు.


వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మం నీ వస్త్రంగా ధరించమని' వేడుకొన్నాడు.


అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు.


💥వినాయక జననం:


కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది.


ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదంగావించి లోపలికి వెళ్లాడు.


అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని, పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది.


శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు


కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు.


💥విఘ్నేశాధిపత్యం:


ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని' కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు.


ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో, వాళ్లే ఈ పదవికి అర్హులు' అన్నాడు. 


దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు.


గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు. 


అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.

"సకృన్‌ నారాయణే త్యుక్త్వా పుమాన్‌ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'


కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది.


షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండి పోయాడు.


అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు.


అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండీ' అన్నాడు.


ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. 


💥చంద్రునికి శాపం:


భక్తులందరూ విఘ్నేశ్వరునికి సమర్పించిన అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకం, వడ పప్పు  విఘ్నేశ్వరుడు తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు.


ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా? పొట్ట వంగితేనా? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు.


చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లు కుంటూ బయటకు వస్తాయి.


పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.'


💥ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట:


ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయపడ్డాడు.


అతని కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతనికి ప్రియం చేసింది.


ఋషులది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలి వేసారు. దీనికి కారణం, వారు చంద్రుని చూడటమే!


దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసుకుని ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు.


కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు.


అప్పుడు దేవతలు మొదలగు వారంతా 'ఓ పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు.


పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడరాదు' అని శాపోపశమనాన్ని కలుగ చేసింది. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. 


💥శ్యమంతకోపాఖ్యానం:


ద్వాపర యుగంలో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురూ, ఈ కబురూ చెప్పి, చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు.

"ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి" అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. 


కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడ్ని చూడవద్దని చాటింపు వేసాడు. అతనికి పాలంటే ప్రీతి కదా! తనే స్వయంగా పాలు పితుకుదామని, అకాశం కేసి చూడకుండా ఆవు దగ్గర కెళ్ళి పాలు పితుకుతూంటే పాలలో చంద్రబింబం కనిపించింది.


'హతవిధీ! నేనేమీ నీలాప నిందలు పడాలో కదా!' అనుకున్నాడు.


కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకి వచ్చాడు. అతని దగ్గర "శ్యమంతక మణి" ఉంది. అది సూర్యుని వరం వల్ల పొందాడు.


శ్రీ కృష్ణుడది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. 'అది రోజుకు ఎనిమిది బారువులు బంగారాన్నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు ' అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.


ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు.


అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతూండగా జాంబవంతుడనే ఒక భల్లూకం సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా యిచ్చాడు.


ఇదంతా తెలియని సత్రాజిత్తు 'ఇంకేముంది మణి నివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి మణి తీసుకున్నాడని ' చాటింపు వేసాడు.


శ్రీ కృష్ణుడు 'తను భయపడినట్టుగా నీలాపనిందలు రానేవచ్చాయి. దానినెలాగైనా రూపుమాపాలి ' అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు.


అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగు జాడలు కనిపించాయి.


ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది.


అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య యిరువయ్యెనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది.


రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలు పెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు.


వెంటనే చేతులు జోడించి 'దేవాదిదేవా! ఆర్తజనరక్ష! నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను.


ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే, నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు.


అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నాయింటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామీ! నాలో శక్తి క్షీణిస్తోంది. జీవితేచ్చ నశిస్తోంది. నా అపచారం మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు.


శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి 'జంబవంతా! శ్యమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది. దాన్ని రూపు మాపడానికి వచ్చాను. నువ్వు ఆ మణినిస్తే నేను వెళ్ళివస్తాను' అన్నాడు. 


జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతినీ కూడా కానుకగా ఇచ్చాడు.


తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శ్యమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరకెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు.


సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేని పోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాపపరిహారంగా తన కుమార్తె, సత్యభామని భార్యగా స్వీకరించమని అ మణిని కూడా కానుకగా ఇచ్చాడు.


శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి, మణిని మృదువుగా తిరస్కరించాడు. ఒక శుభముహుర్తాన శ్రీకృష్ణుడు సత్యభామనీ, జాంబవతినీ పెళ్ళి చేసుకున్నాడు.


దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో 'స్వామీ! మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మాబోటి అల్పుల మాటేమిటి?' అన్నారు.


శ్రీహరి వారియందు దయతలిచి 'భాద్రపద శుద్ధ చవితిరోజు ప్రమాదవశాన చంద్ర దర్శనం అయినా, ఆ రోజు ప్రొద్దున గణపతిని యథావిధిగా పూజించి, శ్యమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు గాక' అని ఆనతీయగా దేవతలు, మునులు సంతోషించారు.


కాబట్టి మునులారా! అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు, అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు" అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు. 


💥వినాయక నిమజ్జనం:


భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రంలో కాని నిమజ్జనం చేస్తారు.


పంచభూతాల్లో ఒకటైన మృత్తికతో... అంటే పృధ్వీ తత్త్వంతో రూపొందిన గణపతిని మరొక పంచ భూతాత్మకమైన జలంలో నిమజ్జనం చేస్తాం.


నదులన్నీ సాగరంలో కలిసినట్టు... గణేశ రూపాలన్నీ ఆ రూపచైతన్యంలో అంతర్హితమై... ఆయనను సేవించిన మనల్ని అనుగ్రహపాత్రుల్ని చేస్తాయనేది భక్తుల నమ్మకం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం