💥శ్రావణ పూర్ణిమ.. హయగ్రీవజయంతి
⚜️🕉️🚩 ఓం హయగ్రీవాయ నమః🌹🙏
💥శ్రావణ పూర్ణిమ.. హయగ్రీవజయంతి
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే॥
అనంతమైన, ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి, సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవుడికి నమస్కరిస్తున్నాను.. అని పై శ్లోకానికి అర్థం.
యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. అయితే తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారాల్లో ‘హయగ్రీవావతారం’ ఒకటి.
పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు.. బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్నవారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు.
వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. దీంతో దేవతలంతా ఆదిదంపతులను శరణువేడారు.
యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది.
శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.
వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల.. శరీరం నుంచి వేరై పోయింది.
ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాధి దేవతలు తమ జ్ఞానాన్ని.. శక్తి సామర్ధ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు.
ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా.. జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడు.
తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతా రాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య – విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. నారాయణుడు హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధి స్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ... విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి వరం ఇచ్చింది.
హయగ్రీవుడిని పూజించిన భక్తులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించ బడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.
వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు. హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.
హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. తెల్లపూవులతో పూజించాలి.
శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి.
సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment