💥శ్రావణ పూర్ణిమ.. రాఖీపౌర్ణమి

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥శ్రావణ పూర్ణిమ.. రాఖీపౌర్ణమి


అన్నాచెల్లెళ్ల అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పూర్ణిమ. సిరిసంపదలతో, పూర్ణాయుష్షుతో సోదరులుండాలని, శ్రావణ పూర్ణిమ నాడు అక్కాచెల్లెళ్ళు, సోదరులకు కట్టే ఓ తోరమే (పట్టీ యే) రాఖీ. 


అక్కాచెల్లెళ్ళకు రక్షగాఉంటాననే సోదరుల ప్రతినకు ప్రతిరూపమే రాఖీ పండుగ. భవిష్యోత్తర పురాణంలోను, మహాభారత కాలంలోనూ రక్షాబంధన్‌ ప్రసక్తి కనిపిస్తుంది.


"రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే, ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధలు ఉండవని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని” శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు.


పూర్వం దేవతలు రాక్షసుల యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోవడంతో త్రిలోకాధిపత్యం పోతుంది. అప్పుడు దేవగురువైన బృహస్పతి సలహాతో, శ్రావణ పూర్ణిమ నాడు ఇంద్రుని భార్య శచీదేవి, పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయ ణులకు పూజలు సలిపి, రక్షను ఇంద్రుని చేతికి కడుతుంది.


దేవతలు కూడా పూజలు చేసి, రక్షలను ఇంద్రుడికి కడతారు. అప్పుడు ఇంద్రుడు రాక్షసులతో యుద్ధంలో గెలిచి, త్రిలోకాధి పత్యాన్ని మళ్ళీ పొందుతాడు.


ఆ రకంగా శచీదేవితో ప్రారంభమైన రక్షాబంధనం, అప్పటి నుంచి లోకంలో రక్షాబంధనంగా ప్రాచుర్యం పొందిందని పురాణాలు చెబుతున్నాయి.


శిశుపాలుడ్ని వధించడానికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగించే సందర్భంలో, కృష్ణుని వేలికి గాయమై ధారాపాతంగా రక్తం కారుతుంది.


అక్కడున్నవారంతా ఏదో చేయాలని పరుగులు తీస్తారు. ద్రౌపది మాత్రం తను కట్టుకున్న పట్టుచీర కొంగు చింపి, కృష్ణుడి వేలుకు కట్టు కడుతుంది. సంతసించిన శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఓ అన్నగా రక్షగా ఉంటానని ద్రౌపదికి మాట యిస్తాడు.


ఫలితంగా నిండు సభలో వస్త్రాపహరణ సమయంలో, చీరలిచ్చి ద్రౌపదిని ఆదుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు.


బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు పాతాళంలో ఉండిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్ష కట్టి మహావిష్ణువును తనతో పంపమని అడుగుతుంది. 


లక్ష్మీదేవిని సోదరిగా భావించిన బలి చక్రవర్తి ఆమె కోరిక మన్నిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి శ్రీహరిని వైకుంఠానికి తీసుకు వెళుతుంది.


రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం:


యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,

తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల


దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.


రాఖీ పూర్ణిమ రోజున అక్కచెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది, చేతికి ప్రేమగా రాఖీ కట్టి, మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తికొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీటు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు.


భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు