💥తిరుమలలో శ్రీకృష్ణాష్టమి.. ఉట్ల ఉత్సవం.

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏


💥తిరుమలలో శ్రీకృష్ణాష్టమి.. ఉట్ల ఉత్సవం.


శేషాద్రిపై వెలసివున్న కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామియే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమలలోని శ్రీవారి ఆలయంలో  శ్రీకృష్ణ జన్మాష్టమిని, ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.


శ్రీ కృష్ణుడే గోవిందుడని, ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు యదార్థమని ఎందరో ఆళ్వారులు, కన్నడదాసులు, తాళ్ళపాక అన్నమాచార్యులు సైతం ఎన్నో పదకవితలను కృష్ణ గోవిందులకు అభేదం తెలుపుతూ వర్ణించారు, స్తుతించారు. వేంకటాచల మహత్మ్యంలో సైతం వేంకటేశుడే శ్రీకృష్ణుడని పేర్కొనబడినది.


చారిత్రక నేపథ్యాన్ని గమనిస్తే శ్రీవారి ఆలయ ఒకానొక అర్చకులైన పెరియపెరుమాళుకు, శ్రీరంగ క్షేత్రం నుండి వచ్చిన వారియర్‌ అనే సంకీర్తనాచార్యునికి, అలాగే చిరుక్కన్‌ అనే మరో భక్తునికి తిరుమలలో ఒకనొక ఉత్సవం సందర్భంగా ఈ ముగ్గురికి శ్రీకృష్ణ భగవానుడు స్వప్నంలో ఒకే సమయంలో కనిపించి..


"ఓ భక్తులారా! కలియుగంలో అత్యంత ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుమలలో పూర్వం నా జన్మాష్టమిని పురస్కరించుకొని వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉండేవి. వాటిని మీ మువ్వురు తిరిగి పునఃనిర్వహించి పునఃరుద్దరించ వలసిదిగా”  ఆదేశమిచ్చి అంతర్థానమైనాడని ‘తిరుమలై ఒళుగు’ అనే గ్రంథం తెలుపుతుంది. అప్పటినుండి శ్రీకృష్ణ జన్మాష్టమిని తిరుమలలో ఘనంగా నిర్వహిస్తుండడం విశేషం.


గోకులాష్టమిని పురస్కరించుకొని రాత్రి 8.00 గం||లకు బంగారు వాకిలి చెంత ఉత్సవమూర్తులైన ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామికి తోమాలసేవ, అభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. దీనినే ద్వాదశ తిరువారాధనం అంటారు. 


అనగా శ్రీకృష్ణ భగవానుని ద్వాదశ మంత్ర బీజాక్షరాలను ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అంటూ అర్చక స్వాములు, ఆచార్యపురుషులు సంపుటీకరిస్తూ ఆరాధన చేస్తారు.


పూర్వం ఈ అభిషేకాన్ని దేవేరులతో కూడిన ఉగ్ర శ్రీనివాసునికి, శ్రీకృష్ణస్వామికి చెరో 12 మార్లు నిర్వహించేవారు గనుక దీనిని ద్వాదశ తిరువారాధనం అని వ్యవహరించేవారు. అయితే నేటికి ఒకే మారు అభిషేకం నిర్వహించినా అదే పేరుతో ఈ ఆరాధనను వ్యవహరిస్తున్నారు.


అనంతరం శ్రీకృష్ణస్వామివారికి దివ్యప్రబంధ పారాయణం నివేదించి పురాణ పఠనాన్ని అర్చకులు గావించి హారతి నైవేద్యాలు సమర్పించడంతో సాలకట్ల గోకులాష్టమి ఆస్థానం వైభవంగా ముగుస్తుంది. వెంటనే స్వామివారు సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. 


💥#ఉట్లోత్సవం:


తిరుమలలో ఉట్లోత్సవాన్ని అత్యంత వైభవంగా గోగర్భం ఉద్యానవనాల్లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.00 గం||కు ప్రారంభమైయ్యే ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. 


యువకులు ఎంతో ఉత్సాహముతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.


జోలెలోని పాలు, వెన్న కుండలను పగలగొట్టే ఉత్సవాలు

తిరుమలలో అడుగడుగునా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి ఆలయంలోకి ప్రవేశించడంతో అవి ముగుస్తాయి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు