⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః🌹🙏
⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః🌹🙏
మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తొలుగుతాయి.
అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి.
ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది.
అపుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిధ్యయని తేలిపోతుంది.
సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయ పూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది.
అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి అత్రైమహాముని పుత్రుడై జన్మించి, శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు.
💥త్రిమూర్తి స్వరూపం, గురుస్వరూపమై, లోకోద్ధరణకు అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపమే దత్తాత్రేయుడు.
త్రిమూర్తుల సమష్టిరూపం.
గురుః బ్రహ్మః, గురుః విష్ణుః, గురుదేవో మహేశ్వరః
అనే శ్లోకానికి ప్రతీక దత్తాత్రేయుడు.
అత్రి, అనసూయ దంపుతుల పుత్రునిగా ఆవిర్భవించిన స్మర్తగామి. తనను స్మరించినవారికి వెంటనే అనుగ్రహించే సిద్ధుడు దత్తుడు.
జగదుత్పత్తికర్త్రేచ, స్థితి సంహారహేతవే
భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే॥
ఆదౌ బ్రహా హరిర్మధ్యేహ్యంతే దేవస్సదాశివః
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ! నమోస్తుతే॥
జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయచ
దిగంబర! దయామూర్తే! దత్తాత్రేయ! నమోస్తుతే ॥
దత్తాత్రేయ అవతారం జ్ఞాన అవతారం. గురువుగా లోకోద్ధరణ కోసం అవతరించిన రూపం. త్రేతాయుగంలో దత్తాత్రేయుడు అవతరించినట్లు పురాణాల్లో ఉంది.
పుణ్యదంపతులైన అనసూయ, అత్రి మహర్షిలకు త్రిమూర్తులు ఆయా సందర్భాల్లో ఇచ్చిన వరాల ఫలితంగా బ్రహ్మ సోముడుగా, విష్ణు దత్తుడుగా, శివుడు దుర్వాసుడుగా జన్మించారు. దీనిలో విష్ణు స్వరూపంగా అవతరించిన దత్తాత్రేయుడిలో త్రిమూర్తి అంశలు ఉన్నాయి.
అటు ఇటూ బ్రహ్మ, మహేశ్వరులు ఉంటారు. ఆయన శంఖం, చక్రం, గదా, పద్మం, త్రిశూలం, డమరుకం, కమండలం, అక్షమాల (జప-మాల) ధరించి వీరాసనంలో ఉంటాడు.
వీరాసనం అంటే ఎడమతొడపై కుడికాలుని వేసుకొని తన రెండుపాదాలను, పాదుకలను కన్పించేలా కూర్చోవడం. వీటితోపాటు తన చుట్టు నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీక.
ఇక దూరంగా ఆవు ఉంటుంది. ఇది ఉపనిషత్‌లకు సూచిక. దత్తుడు ధరించిన ఆయుధాలు శత్రు సంహారానికి కాదు. కేవలం జ్ఞానమార్గాన భక్తులను ఉద్ధరించడానికి మాత్రమే. ఈ అవతారం జ్ఞానావతారం.
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
దత్తాత్రేయుని భక్తితో స్మరించిన వారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని "దత్త హృదయం" లో చెప్పబడింది.
దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment