💥చైత్ర శుద్ధ తదియ.. మత్స్య జయంతి.
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే ।
మీనాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥
💥చైత్ర శుద్ధ తదియ.. మత్స్య జయంతి.
చైత్ర మాసం శుక్ల పక్షాన మూడవ రోజు.. మత్స్యావతారానికి గుర్తుగా మత్స్య జయంతిని జరుపుకుంటాం.
భగవంతుని దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు.
ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములలో ప్రసిద్ధమైనది.. మొట్టమొదటి అవతారం మత్స్యావతారం.
బ్రహ్మకు ఒక పగలు అంటే - వెయ్యి మహాయుగాలు... గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగ చెబుతారు.
ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని 'కల్పం' అని అంటారు.
వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు.
ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది.
రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది..
"రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు" అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు.
మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్ర పట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటి రోజుకి ఆ చేప పిల్లకి చెరువు కూడా సరిపోలేదు.
అ రాజు... ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది.
అంతట ఆ మత్స్యం "తాను శ్రీమన్నారాయణుడుని అని, ఏడు రోజులలో ప్రళయం రానున్నదని, సర్వ జీవరాశులు నశించిపోతాయి అని, ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని" పలికింది.
ఒకపెద్ద నౌకను నిర్మించి, అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.
మీన రూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహా సర్ప రూపమైన తాడుతో నావను కట్టి, ప్రళయాంతం వరకు రక్షిస్తాడు.
సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి, 'వైవస్వత మనువు' గ ప్రశిద్ధికెక్కాడు.
💥బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటి నుండి వేదాలు జారి క్రింద పడగా, "సోమకాసురుడు" అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి, సముద్రగర్భంలోకి వెళ్ళి పోయాడు.
బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా, అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి,, అతని కడుపుని చీల్చి... వేదాలను - దక్షిణావృత శంఖాన్ని తీసుకొని, బ్రహ్మవద్దకు వచ్చాడు.
శంఖాన్ని తాను తీసుకొని, శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.
💥వేదాలను అపహరించటం అంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకారశక్తిని తనలో లయం చేసుకోవటం అని సంకేతం.
రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృస్టికార్య ప్రతిబంధ రూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందటమే వేదాలు మరల గ్రహించటం అని తత్వార్థం.
పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి.
ఈరోజు మత్స్యావతారం లేదా మత్స్య పురాణం సంబంధించిన కథలు చదవడం కానీ వినడం వలన కానీ పాప చింతన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment