💥తిరుమల తెప్పోత్సవం:
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏
💥తిరుమల తెప్పోత్సవం:
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. పుష్కరిణిలో మలయప్పస్వామి శోభ!!
తిరుమలలోని వేంకటేశ్వర స్వామివారి పుష్కరణిలో ప్రతి ఏటా వైభవంగా ఐదు రోజుల పాటు తెప్పోత్సవం జరుగుతుంది.
తిరుమల శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమి నాడు ముగిసేలా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు.
తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది.
శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో “నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు.
క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు.
వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.
తెప్పోత్సవాలను ఐదు రోజుల పాటు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు.
తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు.
ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.
💥కలియుగ ప్రత్యక్ష దైవం, సాక్షాత్తు ఏడుకొండల పైన కొలువుతీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెలలో జరగనున్నాయి.
మార్చి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శ్రీవారి తో పాటు అమ్మవారు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు మార్చి 20 తేదీన శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తెప్పలపై పుష్కరిణిలో స్వామి వారు విహరించనున్నారు. పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు.
తరువాత మార్చి 21వ తేదీన రెండవ రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి అవతారంలో పుష్కరిణిలో మూడు రౌండ్లు తెప్పలపై విహరించి భక్తులను కరుణించనున్నారు.
మూడవరోజు మార్చి 22వ తేదీన శ్రీ భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు మూడుసార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఆపై నాలుగవ రోజు మార్చి 23వ తేదీన శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు సార్లు తెప్పలపై పుష్కరిణిలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇక చివరి రోజు మార్చి 24వ తేదీన మలయప్ప స్వామి ఏడు సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment