💥సద్బుద్ధి ప్రదాయిని.. గాయత్రి..
⚜️🕉️🚩ఓం శ్రీ గాయత్రై నమః 🌹🙏
💥సద్బుద్ధి ప్రదాయిని.. గాయత్రి..
ఏ పనిచేస్తున్నా- ‘ఇది నేను చేయటం లేదు, నాలోని జగన్మాత చేయిస్తున్నది’ అనే సంపూర్ణ శరణాగతి, నివేదన భావంతో మంచిపని చేస్తే అది జగజ్జనని ఆరాధన అవుతుంది.
జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. అద్భుతమైన ఈ శరీర యంత్రాన్ని మనకు ప్రసాదించిన శ్రీమాతను స్మరిస్తూ, ఈ శరీరం మనకూడా ఉండగానే, ఇందులో అంతర్లీనంగా ఉన్న ఆనంద బిందువును ఆర్ద్రతతో, అప్రమత్తంగా, ఆప్యాయంగా అందుకోవాలి.
అందుకు ఆధారం-త్రికాల సంధ్యా దేవత గాయత్రీమాత అనుగ్రహం.
గాయత్త్రీ వ్యాహృతి సంధ్యా అని గాయత్రీ మాతను కీర్తించాడు హయగ్రీవ మహర్షి.
దీనినిబట్టి మనకర్థమయ్యేదేమిటంటే- సంధ్య ఎవరో గాదు- గాయత్త్రే. ఆ గాయత్రి కూడా ఎవరో కాదు- శ్రీలలితా పరదేవతే, మహాశక్తే.
ఆ శక్తి కాలస్వరూపిణి. కాలమంటే కదిలేది. అచలమైన తత్త్వం నుండి చలించి వస్తుంది ఆ శక్తి. చలించి, పరా పశ్యంతి, మధ్యమా, వైఖరీ అని నాలుగు దశలలో కిందికి చలించి దిగి వచ్చింది. వచ్చి, అదే మనకు చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చరాచర ప్రపంచమే- నిరంతర భ్రమణశీలమైన ఆ గాయత్రీ శక్తి.
"మన నాత్త్రాయతే ఇతి మన్త్రః" మననం చేసే కొద్దీ మనలను కాపాడేదేదో అదీ మంత్రమంటే.
"మంత్రాణా మర్థస్తిరోహితో భవతి" అని పెద్దలు చెప్తారు. మంత్రం పైకి కనిపిస్తున్నా మంత్రార్థమలా కనిపించదు. అందులో రహస్యంగా ఉంటుంది. మననం వల్లనే అది ప్రకటితమవుతుంది.
ఆదిభౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికమని మూడు భూమికలలో భావన చేయాలి. ఆది దైవికమైన స్థాయి నుంచే దిగి వచ్చిందది మనదాకా. దిగి వచ్చేటప్పుడది గాయత్త్రి.
"గాయతి త్రాయతే ఇతి గాయత్త్రీ" ఎవరా మంత్రాన్ని గానం చేస్తుంటే వారిని కాపాడుతుంది కనుక గాయత్త్రి అయింది.
"న గాయత్య్రాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్" గాయత్రికి మించిన మంత్రము లేదు. తల్లిని మించిన దేవత లేదని దివ్య సూక్తి.
ఏ మంత్రానుష్ఠానం చేసినా, ముందు గాయత్త్రీ మంత్రం చేస్తేనేగాని దాని ఫలితం మనకు రాదు. అదీ గాయత్త్రీ మంత్ర జప విశిష్టత.
"గాయత్రీ ఛందసామహమ్" అని ఋక్కులలో గాయత్రి మంత్రమును తానేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించటం- గాయత్రీ మంత్ర మహోదాత్తత విశదమవుతుంది.
సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి. దీర్ఘాయువు, సత్సంతానం, గోవులు, కీర్తి, ద్రవ్యము, బ్రహ్మ వర్చస్సులను ప్రసాదించి, అంత్యంలో బ్రహ్మమును అనుగ్రహించు కరుణామయి ‘గాయత్రి’ అని చెపుతోంది అధర్వణ వేదం.
గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి. వాటిని మూడు భాగాలుగా చేస్తే, ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి.
ఈ మూడు ఖండాలు- సృష్టి స్థితి లయాలకు సూచితం. మొదటి ఖండం- ఋగ్వేదం; రెండవది-సామవేదం; మూడవది- యజుర్వేదం అవుతాయి. కనుక గాయత్రి వేదమాత.
గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలకు, వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలతో, వెరసి ఇరవది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని రచించారు. కనుకనే, గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణము సర్వశక్తి సమన్వితమయింది.
కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి అతనికి కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment