పాహి పాహి పరమేశ్వరా!!

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥పాహి పాహి పరమేశ్వరా!!


సృష్టి, స్థితి, లయకారులలో శివుడికి లయకారుడని పేరు. అయితేనేం, ఆయన పరమ భోళాశంకరుడు. భక్తజన రక్షకుడు. సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు.


భక్తితో కొలిచే తన భక్తులతో పాటు క్రిమికీటకాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే శివయ్య దర్శనం సర్వ పాపహరణం.


💥#మహాశివరాత్రి💥


ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి.


వాటన్నింటిలోనూ తలమానికమైనది, మహి మాన్వితమైనది మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి.. మహాశివరాత్రి. తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందురోజు – రాత్రి చతుర్దశి కలిగి ఉన్న రోజుని జరుపుకోవాలని నిర్ణయ సింధు చెబుతోంది.


'మహా’ అని ఎక్కడ అనిపించినా అన్నింటికంటే గొప్పదని అర్థం చేసుకోవాలి. శివ పార్వతులిరువురికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం.


అందుకే శివరాత్రి నాడు అయ్యకి – అమ్మకి కూడా ఉత్సవం జరుగుతుంది. శివ అంటే మంగళకరమైన అని. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం.


💥క్షీరసాగర మథనంలో అమృతం కంటే ముందు హాలాహలం పుట్టిన విషయం తెలిసిందే. అది ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదం ఉండడంతో దేవదానవులందరు భీతావహులై తమను రక్షించాలంటూ పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో లోక రక్షణార్థం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి "గరళ కంఠుడు"గా పేరుపొందాడు.


ఈ హాలాహల ప్రభావానికి ఆయన కంఠం నీలంగా మారడంతో నీలకంఠుడయ్యాడు. లోకాలన్నీ ఆ లోకనాయకుడి మూలాన స్థిమితపడిన రోజు పర్వదినం గాక మరేమిటి?


💥#పురాణగాథ:


పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్తా వివాదంగా మారింది.


రానురానూ అది మరింతగా పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు.


ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది.


దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు శ్వేతవరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు.


ఎంత దూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పాతాళం దాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు.


ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు పడుతూ, ఒక కామధేనువు క్రిందకు దిగుతూ ఉండడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును, కామధేనువును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు.


ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు బ్రహ్మ.


సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేక  వారు కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు.


బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పా డు. ‘నిజమే’నంది మొగలిపువ్వు. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది.


దాంతో  తాను ఓడిపోయానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.


బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలిపువ్వు వైపు చూసి, అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. 


దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది.


దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.


బాధ్యతాయుతమైన పదవిలో ఉండీ అల్పవిషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు.


అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు.


తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోళాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, "మొగముతో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను.


సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా  పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు. 


అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద  కూర్చుండబెట్టారు.

హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, పూలమాలలు, పువ్వులు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం,  శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారంగా పూజించారు.

ఆ పూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు.


జ్యోతిర్లింగ రూపంలో  బ్రహ్మకు, విష్ణువుకు తాను కనిపించిన సమయాన్ని లింగోద్భవకాలంగా పరిగణించాలని, ఇకనుంచి మాఘబహుళ చతుర్ధశి శివరాత్రి అనే పేరుతో తన పూజలకు శ్రేష్ఠమైనదిగా వర్థిల్లుతుందని చెప్పాడు.


అంతేకాదు, ఆ తిథి నాడు తన మూర్తిని, లింగాన్ని పూజించే వారికి మోక్షం లభిస్తుందన్నాడు.

శివరాత్రినాడు పార్వతీసమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు