శివధనుర్భంగ దృశ్యం.
⚜️🕉️🚩 శ్రీరామ జయరామ జయ జయ రామ 🌹🙏
💥విశ్వామిత్రుడి యాగ సంరక్షణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, యాగం పూర్తికాగానే ఆ బ్రహ్మర్షి వెంట మిథిలా నగరంలోని జనక మహారాజు ఆస్థానానికి చేరుకుంటారు.
విశ్వామిత్రుడు చెప్పిన మీదట జనక మహారాజు శివధనుస్సును రామలక్ష్మణులకు చూపించటానికి సిద్ధపడి, ఆ ధనస్సును తీసుకురావల్సిందిగా తన మంత్రులను ఆదేశిస్తాడు.
నృణాం శతాని పంచాశత్
వ్యాయతానాం మహాత్మనామ్
మంజూషామ్ అష్టచక్రానాం
తాం సమూహస్తే కథంచన॥
🌹బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన ఐదువేల మంది పురుషులు, ఎనిమిది చక్రాలున్న శకటం మీద అమర్చి ఉన్న శివధనుస్సును అతికష్టంతో తోసుకుంటూ తీసుకు వస్తారు.
నాగ, కిన్నర, కింపురుష, యక్ష, రాక్షసులు సహా సమస్త దేవతా గణాలకు ఈ ధనుస్సును ఎక్కుపెట్టడం సాధ్యం కాలేదని జనకుడు విశ్వామిత్రుడితో చెబుతాడు.
వెంటనే విశ్వామిత్రుడు ‘వత్స రామ ధనుః పశ్య’ – ‘నాయనా రామా! ఈ ధనుస్సును చూడు’ అంటాడు. వ్యవహార భాషలో చెప్పాలంటే ‘ఈ ధనుస్సు సంగతి చూడు’ అని అర్థం.
మహర్షి వాక్యంలోని అంతరార్థం గ్రహించిన రాముడు ‘లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః’- ఆ ధనుస్సు మధ్యభాగాన్ని చేతితో పట్టుకుని, ఎంతో అలవోకగా ఎక్కుపెడతాడు.
కేవలం రాముడి కర స్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడి చేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి, ఆకర్ణాంతం అల్లెత్రాటిని లాగుతాడు.
మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోకభీకరమైన శబ్దం చేస్తూ, శివధనుస్సు రెండుగా విరిగిపోతుంది.
💥మహోజ్జ్వలమైన ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మికంగా పరికించి చూస్తే, సమున్నతమైన ఆత్మబోధ మనకు అందుతుంది.
శాస్త్ర పరిభాషలో ధనుస్సు అంటే ఓంకారం (ప్రణవం) అని అర్థం.
‘ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే’ అని ఉపనిషద్వాక్యం.
ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికైతే వంగుతుందో, అటువంటి వ్యక్తికి మన ఆత్మను అర్పించాలి.
ఇక్కడ ధనుస్సు రూపంలో ప్రణవం రామచంద్రునికి వంగింది. అంటే, మన ఆత్మను అర్పించడానికి తగిన దైవం శ్రీరాముడు.
శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు. వారెవరికీ అది సాధ్యం కాలేదు. అంటే ప్రణవం ఎవరికీ వంగలేదు. రామునికి మాత్రమే వంగింది.
అంటే, మన ఆత్మార్పణకు అసలైన మార్గం శ్రీరాముడి చరణాలే అని స్పష్టమవుతుంది.
💥మరొక అర్థంలో చూస్తే – శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా శివధనుస్సును ఎక్కుపెట్టాడు. దాన్ని సంధించటానికి ఉన్న నారిని కట్టగానే, ఒక్కసారిగా ధనుస్సు రెండు ముక్కలైంది.
ధనుస్సు ఒకభాగం శ్రీరాముడి చేతిలో ఉంది. రెండో భాగం నారి ద్వారా వేలాడుతున్నది. ఇది శివధనుర్భంగ దృశ్యం.
'అ, ఉ, మ’ అనే అక్షరాల కలయికే ఓం కారం.
'అక్షరానాం అకారోస్మి’ అనే వాక్యం ప్రకారం రామచంద్రమూర్తి అకార స్వరూపం.
ఇది (నారాయణ స్వరూపం) నేను అని చెప్పటానికి రాముడు ధనుస్సు ఒక భాగాన్ని తన చేతితో పట్టుకున్నాడు.
రెండో భాగం ‘అ’తో కలిసి ఉండే ‘మ’ అంటే మనిషి (జీవుడు). ‘అ’, ‘మ’ మధ్య ఉన్న ధనుస్సు నారి ‘ఉ’కార స్వరూపం. ‘అ’కారాన్ని ‘మ’కారాన్ని ‘ఉ’కారం కలిపి ఉంచుతుంది.
అంటే, జీవాత్మ, పరమాత్మల సంబంధం ఎప్పటికీ వేరుపడేది కాదు అనే సత్యం మనకు బోధపడుతుంది.
రెండుగా విడివడిన ధనుస్సు ఒక ఖండాన్ని చేతితో పట్టుకుని ‘ఓంకార ప్రతిపాద్యమైన దైవాన్ని నేనే సుమా! జీవుడు నాకు సంబంధించిన వాడే కానీ స్వతంత్రుడు కాడు’ అనే విషయాన్ని రామచంద్రమూర్తి స్పష్టంగా ప్రకటించాడు.
ఇదీ శివధనుర్భంగ ఘట్టం ద్వారా మనకు అందే అద్వైత వేదాంత బోధ.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment