💥జ్ఞానప్రదాత.. దత్తావధూత

 ⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః 🌹🙏


"అక్షరాత్‌, వరేణ్యాత్‌, ధూత సంసార బంధనాత్‌, తత్వ మస్యాది లక్ష్యత్వాత్‌, అవధూత ఇతీర్యతే"


అవధూత అంటే అక్షరుడు (నాశనం లేనివాడు), వరేణ్యుడు (ఉత్తముడు), ధూతబంధనుడు (సంసార బంధనాలేవీ లేనివాడు) వేదాంత గోచరమైన తత్వమస్యాది వాక్యాలకు లక్ష్యమైన వాడని అవధూత ఉపనిషత్తు  చెబుతుంది.


ఈ లక్షణాలన్నీ కలిగి బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల అంశతో త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే దత్తావతారం.


అవధూత అంటే.. పూర్తిగా దేహధ్యాస లేనివారు. లౌకిక ప్రపంచం, బంధాలు, బంధుత్వాలు పట్టనివారు.

వారు ఎక్కడా నిలవరు. ఆవు పాలు పితికినంత సేపే వారు ఒకచోట ఉంటారు.


💥జ్ఞానప్రదాత.. దత్తావధూత


మహా తపస్సంపన్నుడు అత్రి మహర్షికీ, పతివ్రతా శిరోమణి అనసూయాదేవికి కలిగిన పుణ్య సంతానమే దత్తాత్రేయ స్వామి.


సత్వ, రజో, తమో గుణాలు లేనివాడు అ‘త్రి’ మహర్షి. న+ అసూయ అసూయా గుణం లేని, మరోవిధంగా చెబితే మాయను వదిలిన తత్వం గలది అనసూయా మాత. అందుకే త్రిగుణాతీతుడై మాయారహితుడైన అవధూత స్వరూపంగా దత్తాత్రేయుడు ఉద్భవించాడు. 


అత్రి తనయుడు కనుక ఆత్రేయుడు, తనకు తానుగా దత్తమయినాడు (తల్లిదండ్రులకు ఇవ్వబడినాడు) కాబట్టి దత్తుడు. వెరసి దత్తాత్రేయుడు అయ్యాడు.


‘గురుదత్తా! జగత్తును అంధకారం నుంచి కాంతి మార్గంలోకి నడిపించడానికి అవతరించిన జగద్గురువు నువ్వు’ అని తల్లిదండ్రుల నుంచి ఆశీఃపూర్వక అభినందనలు పొందినవాడు దత్తుడు.


దత్తాత్రేయునిది జ్ఞానావతారం. విష్ణుమూర్తి ఏకవింశతి (21) అవతారాలలో ఆరోది దత్తరూపం.


ఆయన కరుణా సముద్రుడు. ఒక్కోసారి భక్తులను కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. ఆయన కనబరిచే ప్రతి లీలా ఓ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఓ తత్వాన్ని బోధిస్తుంది. 


అవతార లక్ష్యం పూర్తికాగానే విష్ణుమూర్తి ఆ అవతారం చాలించడం కనిపిస్తుంది. కానీ, దత్తావతారం పరిసమాప్తి లేనిది. గురు రూపంలో ఆయన చిరంజీవి.


దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం

ప్రపన్నార్తి హరంవందే స్మర్తృగామీ సనోవతు॥


దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి

తన్నో దత్తః ప్రచోదయాత్‌


💥తాత్వికంగా స్వామి దిగంబరుడు (దిక్కులే వస్ర్తాలుగా కలవాడు). కేవల బ్రహ్మనిష్ఠతో దండ కమండలాలను కూడా వదిలిన శుద్ధ సాత్విక చైతన్య మూర్తి అయిన అవధూత.


భక్తితో స్మరిస్తే సంతృప్తిని పొంది తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తాడు.


బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలలో మూడు తలలతో, తెల్లని శరీరంతో, జటలతో, శంఖ, చక్ర, కమండల, జపమాల, త్రిశూల, డమరుకాలు ఆరుచేతులలో ధరించి, నాలుగు వేదాలకు ప్రతీకలైన నాలుగు శునకాలు వెంట ఉండగా.. ధర్మస్వరూపమైన గోవును తన వెనుక నిలుపుకొని ఔదుంబర (మేడి) వృక్షం నీడలో సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగా దత్తాత్రేయుడి రూపాన్ని భక్తులు దర్శించుకుంటారు.


మనోనిగ్రహం ఉన్నవారికి నీడనిచ్చే ఔదుంబరం. కఠోర పరీక్షకు నిలిచినవాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదించే గురుపీఠం.. దత్తాత్రేయం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం