శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం – విజయుని చరిత్ర.

 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏


దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ

తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే !

భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే

సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే !!


💥ఓం హం హనుమతే నమః💥


💥శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం –  విజయుని చరిత్ర.


శ్రీ ఆంజనేయస్వామిని అర్చించి తరించిన భక్తుల చరిత్రలను పరాశర మహర్షి , మైత్రేయునికి తెలిపాడు. అందులో "విజయుని చరిత్ర" తెలుసుకుందాం.


త్రేతాయుగంలో "చంద్ర కోణం" అనే ప్రసిద్ధి చెందిన నగరం  వుంది. దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు. అతడు బలశాలి, శత్రు సంహారకుడు, సమర్ధుడు.


యుద్ధ విద్యలో చేయి తిరిగినవాడు. నాలుగు దిక్కులలో వున్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోర్కె అతనికి కలిగింది.


రాజ్యాన్ని కుమారులకు అప్పగించి, పెద్ద సైన్యంతో, జైత్ర యాత్రకు బయల్దేరాడు. కొంత ప్రయాణం చేసిన తరువాత "గర్గ మహర్షి" ఆశ్రమం చేరాడు.


సైన్యాన్ని దూరంగా వుంచి తానొక్కడే మహర్షిని సందర్శించాడు. భక్తీతో ఆయనకు నమస్కరించి నిలుచున్నాడు.


ఆతని శ్రద్ధకు భక్తికి సంతోషించిన గార్గుడు కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి ఆతిధ్యం ఇచ్చాడు.


గర్గముని- రాజైన విజయుడితో ”రాజా!స్వాగతం. ఎక్కడి నుంచి బయల్దేరావు? ఎక్కడి దాకా ప్రయాణం? అని అడిగాడు.


దానికి రాజు విజయుడు వినయంతో "మహర్షీ! మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే వుంది. ఇంటి నుంచే బయల్దేరాను. సర్వ దిక్కులలో వుండే రాజ్యాలన్నీ జయించాలనే కాంక్షతో దిగ్విజయ యాత్రకు బయల్దేరాను. నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి. నాకు పని సానుకూలం ఆవటానికి ఇంకా ఏదైనా ఉపాయం వుంటే సెలవివ్వండి" అని విన్నవించాడు.


గర్గమహర్షి సంతోషించి "నీ కోరిక మంచిదే అయితే ఏ పనికైనా దైవ అనుగ్రహం కావాలి. అప్పుడే ఆ కోరిక నెర వేరుతుంది. సఫల మనోరధుడవై "విజయుడు" అనే పేరు సార్ధకం చేసుకో.


ఎన్నో మంత్రాలున్నాయి. కాని శీఘ్రంగా ఫలసిద్ధినిచ్చే మాత్రం ”హనుమన్మంత్రం” ఒక్కటే. అది భక్తులకు అందుబాటులో వుంటుంది. యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది.


నేను నీకు ఆ మహామంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని త్రికరణ శుద్ధిగా భక్తీ శ్రద్ధలతో జపించు. నువ్వు అనుకొన్నది సాధించగలుగుతావు" అని చెప్పి బీజ సహితంగా మంత్ర ఉద్ధార న్యాస పూర్వకంగా అష్టాక్షరీ హనుమ మంత్రాన్ని గర్గుడు విజయునికి ఉపదేశించాడు.


గర్గాశ్రమం లోనే విజయ మహారాజు వుండి ఆయన సన్నిధి లోనే మంత్రం మీద మంత్ర దైవం అయిన ఆంజనేయుని మీద సమాన భావంతో విశ్వాసము గౌరవము చూపించి 108 సార్లు జపించాడు.


శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షం అయాడు. ఆనంద బాష్పాలు కారుతుండగా విజయుడు వాయునందనుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు.


నాలుగు ముఖాలు కల బ్రహ్మ, ఆరు ముఖాల కుమార స్వామి, వెయ్యి ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్యపడేట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమను పెక్కు విధాల కీర్తించాడు. అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకొన్నాడు.


హనుమ భగవానుడు సంతృప్తి చెంది విజయుని తో "నీ ఎడల ప్రసన్నుడిని అయాను. నీకు శుభం కలుగుతుంది. ఏదైనా వరం ఇస్తాను కోరుకో” అన్నాడు. 


మనసులో సంతోషించి దోసిలి ఒగ్గి వాయుసుతునీకి మళ్ళీ నమస్కరించి ”అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనం ఇచ్చి, నన్ను కృతార్దుడిని చేశావు మహా బలవంతా ఆంజనేయా ! నీ దర్శనమే కోరికలన్నిటినీ తీరుస్తుంది. 


అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు. తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు. నీ కృప అపారం. నా మనసులో నాలుగు దిశలు జయించాలని కోరిక వుంది. నీ అనుగ్రహం కావాలి. దానిని తీర్చి , నాకు మేలు చేయి” అని ప్రార్ధించాడు.


ఆంజనేయుడు అతని వినయ వచనాలకు సంప్రీతుడై , వాత్సల్యంతో ”రాజా! నాలుగేమిటి? పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్ధకం చేసుకో. 


అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు. రాబోయే ద్వాపర యుగాంతంలో ఈ కోరిక నెరవేరుతుంది. అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రుని కుమారుడివై జన్మిస్తావు. 


శ్రీకృష్ణుని సారధిగా చేసుకోని అన్ని దిక్కులను జయిస్తావు. కురు క్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు. అప్పుడు నీ రధానికి నేను జెండా పై అధివసించి నీకు విజయం చేకూరుస్తాను.


నేను వుండే ఆ జెండాను ”కపిధ్వజం” అంటారు. నిన్ను ”కపిధ్వజుడు” అని పిలుస్తారు” అని వరం ప్రదానం చేసి మారుతి అంతర్ధానం అయాడు.


హనుమ చెప్పిన మాట విని విజయ మహారాజు తన జైత్ర యాత్రను విరమించుకోని గర్గ మహాముని ఆశీస్సులను అందుకొని ఆయనకు నమస్కరించి మళ్ళీ రాజధానికి చేరుకొన్నాడు. రాజ్యాన్ని ధర్మ సమ్మతంగా ప్రజా క్షేమంగా పరిపాలించి చివరికి స్వర్గలోకం చేరాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం