భగవంతుడు బందీ అయ్యేది భక్తి పాశానికే!

 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏


ఆంజనేయ మతిపాటలాననం

కాంచనాద్రి కమనీయ విగ్రహం!

పారిజాత తరుమూల వాసినం

భావయామి పవమాన నందనం!!


భగవంతుడు బందీ అయ్యేది భక్తి పాశానికే!

అందుకే నవవిధ భక్తిమార్గాల ద్వారా దైవాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు.


ఈ భక్తి విధానాల్లో "దాస్యభక్తి"కి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు.

అనంతశక్తులు తనలో దాగి ఉన్నా.. రామబంటుగా ఒదిగి ఉండటమే దాసాంజనేయుడికి ఇష్టం.

ఆ పరమభక్తుడు పిల్లల దేవుడు, పెద్దల దేవుడు, అందరి దేవుడు.


ఆంజనేయుడి కోవెల లేని ఊరు ఉండదు.

ఒకచోట సంజీవరాయడిగా, మరోచోట సహకార ఆంజనేయుడిగా, ఇంకోచోట వీరాంజనేయుడిగా ఊరూరా అభయమిస్తూ ఉంటాడు.


మనందరికీ దేవుడే అయినా, తనను తాను సదా రామచంద్రుడి దాసుడిగానే భావిస్తాడు స్వామి. 


లంకాపురిలో సీతమ్మ జాడకనిపెట్టి అంతటి ఘనకార్యం చేసినా.. దానికి సహకారం చేసింది రామనామమే అని వినమ్రంగా చెప్పుకొన్నాడు.


💥శ్రీమద్భాగవతంలో తెలిపిన నవవిధ భక్తి మార్గాల్లో దాస్యభక్తికి ప్రతీకగా హనుమంతుడిని చెప్పుకొంటారు. 


అయితే, ‘వానరుడిగా జన్మించిన హనుమ ఇంతటి పరిపూర్ణతను ఎలా సాధించగలిగాడు?’ అన్న ప్రశ్నకు ప్రభుపాదుల వారు సహేతుకమైన వివరణ ఇచ్చారు. 


"హనుమంతుడు చేసిందల్లా ఒక దాసునిగా తనకు అప్పజెప్పిన పనిని నిర్వర్తించడమే.


అది ఎంతటి దుస్సాధ్యమైన కార్యమే గాని, రామచంద్రుడు చెప్పాడంటే అంతే! మరో ఆలోచన లేకుండా ఆచరించడమే హనుమ వంతు.

తన అపారమైన దేహబలాన్ని ప్రభుసేవలో వినియోగించడమే.


లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు అవసరమైన ఔషధాన్ని మాత్రమే తెమ్మని అక్కడివారు చెప్పారు.

కానీ, ఆ ఔషధం ఎలా ఉంటుందో తెలియదు.

రివ్వున ఎగిరిపోయాడు. సంజీవని గిరిపై ఔషధాన్ని గుర్తించలేకపోయాడు.


స్వామికార్యం నిర్వర్తించే క్రమంలో ఏకంగా ఆ పర్వతాన్నే పెళ్లగించి తీసుకుపోయాడు. లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు.


అంతేకాదు, యుద్ధ సమయంలో లంకా నగరాన్నంతా చెట్లు, గుట్టలు, మురికి కుప్పలతో ముంచేసి, శత్రుసేనలు కదిలేందుకు వీల్లేకుండా చేశాడు.


ఇలా వానరుడిగా జన్మించినా, రామచంద్ర ప్రభువును సేవించాలన్న దృఢ సంకల్పం వాయునందనుడిని భక్తాగ్రేసరుడిగా నిలబెట్టింది. జీవిత పరమసిద్ధివైపు నడిపించింది" అని ప్రభుపాదులు వివరించారు.


💥నమ్మిన దైవంపై పరిపూర్ణమైన అంకితభావం కలిగి ఉండాలి. నిరంతరం స్వామి సేవలో తరిస్తూ ఇది తప్ప మరేదీ తనకు అవసరం లేదని ఆంజనేయుడు ప్రార్థించేవాడు.


భవబంధచ్ఛిదే తస్యై స్పృహయామి న ముక్తయే

భవాన్‌ ప్రభురహం దాస ఇతి యత విలుప్యతే

                                               -- (చైతన్య చరితామృత)


‘ఓ ప్రభూ! ఈ భవబంధాల నుంచి నన్ను విముక్తుడిని చేయదలిచితే చేయి. మోక్షాన్ని ప్రసాదించాలనుకుంటే, ప్రసాదించు. కానీ, నేను మాత్రం ఇవేవీ కోరుకోను. మీపై నా దాస్య భావనను మరిపించేదేదీ నాకు అవసరం లేదు’ అని వినయంగా వేడుకుంటాడు హనుమ.


💥పురాణాలను అనుసరించి హనుమ చిరంజీవి. నిరంతరం రామనామాన్ని జపిస్తుంటాడు.


అంతేకాదు, ఎక్కడైనా రామనామం వినిపిస్తే చాలు.. అక్కడికి వెళ్లిపోతాడు. ఆనందబాష్పాలు నిండిన కండ్లతో, చేతులు జోడించి అక్కడే ఉంటాడు.


రామకథా గానం చేస్తున్న భక్తుల సేవా సంకల్పాన్ని పవనసుతుడు మరింత బలపరుస్తాడని శాస్ర్తాలు చెబుతున్నాయి.


సురోవసురో వాప్యథ వానరో నరః

సర్వాత్మనా యః సుకృతజ్ఞముత్తమమ్‌

భజేత రామం మనుజాకృతిం హరిం

య ఉత్తరాననయత్కోసలాన్దివమితి   (భాగవతం)


"సురులు గానీ, అసురులు గానీ, నరులు గానీ, వానరులు గానీ, మానవమాత్రునిగా ఈ లోకంలో అవతరించిన దేవాదిదేవుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధించాలి.

భక్తుడు ఆచరించే తృణమాత్రపు సేవనైనా ప్రేమతో స్వీకరించే ఆ స్వామిని సేవించడానికి కఠోర తపస్సులు ఆచరించ అవసరం లేదు.

భగవంతుడు ప్రీతి చెందితే, తన భక్తుడికి సార్థకత చేకూరినట్టే. రామచంద్రుడు అయోధ్య వాసులందరికీ తన స్వధామాన్ని (వైకుంఠాన్ని) అనుగ్రహించాడు"

అని పలికిన హనుమంతుడి మాటలు రామభక్తులకు కొండంత బలాన్నిస్తాయి.

సేకరణ... శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభూజి గారి వ్యాసములు నుండి..💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు