💥సకల గుణాభిరామా శ్రీరామా!💥

 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ🌹🙏


💥సకల గుణాభిరామా శ్రీరామా!💥


జీవితం త్రిగుణాత్మకమైంది. అవే సత్త్వ రజ స్తమో గుణాలు.


సత్వగుణం దేవతల్ని, రజోగుణం యక్ష, రాక్షసుల్ని, తమోగుణం భూత, ప్రేత, పిశాచాల్ని ఆశ్రయించి ఉంటుందని భగవద్గీత చెబుతోంది.


ఇక్కడ భూతాల్లో తమోగుణం ఉంటుందని కాక, తమో గుణం ఉన్న మనుషులు వాటిలా ప్రవర్తిస్తారని అర్థం చేసుకోవాలి.


అలాగే రజోగుణం యక్ష, రాక్షసుల్లా.. సత్వగుణం దేవతల్లా ప్రవర్తింపజేస్తుంది.


అంటే మనుషులుగా సహజ స్వభావంతో ఉన్న మనం సాధనతో మాధవత్వానికి ఎదగనూవచ్చు, పిశాచ స్థాయికి దిగజారనూవచ్చు.


ఆ విషయాన్నే వాల్మీకి అనేక సన్నివేశాల్లో రాముడి పాత్ర

ద్వారా, ప్రత్యేకించి స్త్రీలపట్ల ఆయన ప్రవర్తించే విధానం

ద్వారా చాటిచెప్పాడు.


💥బాలకాండలో విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థం

రామలక్ష్మణుల్ని తన ఆశ్రమానికి తీసుకెళ్లే ప్రధాన

ఘట్టాల్లో కొన్ని- తాటకా సంహారం, అహల్యా

శాపవిమోచనం, సీతాస్వయంవరం.


శ్రీరాముడికి తారసపడిన స్త్రీలలో వీరు ముఖ్యులు. గురువు విశ్వామిత్రుడితో కలిసి యాగరక్షణార్థం వెళ్లి, దారిలో ఆయన ఆజ్ఞతో తాటకను సంహరించాడు. 


అలానే గౌతమ ముని ఆశ్రమంలో శిలాసదృశంగా ఉన్న

అహల్యకు తన పాదధూళితో శాపవిమోచనం

కలిగించాడు.


జనకుడి కొలువులో శివధనస్సును విరిచి సీతను పరిణయం చేసుకున్నాడు.


వీరిలో తాటక తమోగుణానికి, అహల్య రజోగుణానికి, సీత సత్త్వగుణానికి ప్రతీకలు.


తమోగుణం పూర్తిగా విడువదగింది. రజోగుణం

కొంతవరకు క్షంతవ్యం. సత్త్వగుణం ఆచరణీయం,

ఆదరణీయం.


అందుకే తాటక విషయంలో రాముడు ఆలోచించలేదు, వెంటనే బాణాలతో సంహరించాడు.

కానీ అహల్య విషయంలో ఆలోచించాడు. రజోగుణం

తమోగుణమంత ప్రమాదమైందీ కాదు, విడిచిపెట్టదగిందీ

కాదు. కొంత ప్రయత్నంతో దాన్ని సంస్కరించవచ్చు.

అందుకే అహల్యాసాధ్విని పాదరజోలేశంతో

సంస్కరించాడు.


శుద్ధసత్త్వగుణానికి ప్రతీక సీత. సత్వగుణం సాధన యోగ్యం. అందుకే ఆ గుణాన్ని సాధించడం కోసం రాముడంతటివాడు కూడా పందెంలో పాల్గొని మరీ స్వీకరించాడు. ఇవి విశ్వామిత్రుడి మార్గదర్శనం లోనే జరిగాయి.


జీవితంలో వదిలేయాల్సిన, సంస్కరించాల్సిన, సాధించాల్సిన విషయాలను ఈ మూడు సన్నివేశాలూ ప్రతీకాత్మకంగా సూచిస్తున్నాయి.


💥మూర్తీభవించిన అహంకారం రావణుడు. అతడు సీతమ్మను అపహరించిన తర్వాత విలవిల్లాడిపోయాడు శ్రీరాముడు.

అంటే భార్యాభర్తల మధ్య అహంకారం ప్రవేశించినప్పుడు సత్త్వగుణం మాయమై అన్యగుణాలు ప్రకోపించి మనిషిని తలకిందులు చేస్తాయని మహర్షి భావన.


రావణుడి వల్ల ఒకసారి, ఓ అనామక మూర్ఖుడి వల్ల మరోసారి రాముడికి సీతావియోగం కలిగింది.

అయితే మొదటిసారి అంతగా రెండోసారి కుమిలి పోలేదు.


కారణం తొలిసారి తన అజాగ్రత్త వల్ల సీతను (సత్త్వగుణాన్ని) పోగొట్టుకున్న రాముడు, రెండోసారి రాజధర్మానికి కట్టుబడి తానే వదులుకున్నాడు.

అంటే అవసరమైనప్పుడు రజస్తమోగుణాలనే కాదు సత్త్వగుణాన్ని కూడా త్యజించి త్రిగుణాతీతుడిగా వెలుగొందాడు.


అప్పటివరకూ ఉత్తమపురుషుడిగా ఉన్న రాముడు పురుషోత్తముడిగా రూపొందాడు. అందుకే దేవుడయ్యాడు.


కనుకనే ఆయన పుట్టినరోజును పండుగ చేసుకుంటున్నాం. అందుకే ఆ పరిపాలన మనకు ఆదర్శం. ఆ పురుషోత్తముడి నుంచి నేర్చుకోవాల్సింది అదే!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు