💥ముక్తికి మార్గం.. మార్గశిర మాసం
⚜️🕉️🚩 ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏
💥ముక్తికి మార్గం.. మార్గశిర మాసం
మార్గశిర మాసాన్ని పన్నెండు నెలల్లో కెల్లా ప్రత్యేకమైనదిగా చెప్తారు.
"మాసానాం మార్గశీర్షోహం" అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రకటించడం ఈ నెలకు ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది.
పౌర్ణమినాడు "మృగశిర" నక్షత్రం పరివ్యాప్తమై ఉండటం వల్ల ఈ నెలకు మార్గశిరం అనే పేరు వచ్చింది.
ఈ మాసంలో వరుసగా పర్వదినాలు పలకరిస్తాయి.
💥మార్గశిర శుక్ల షష్ఠి నాడు "సుబ్రహ్మణ్య షష్ఠి"గా చేసుకుంటారు.
శివ కుమారుడైన సుబ్రహ్మణ్యుడు అవతరించింది ఇదే రోజు అని చెప్తారు.
దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం కూడా ఇదే.
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి విశేష ఆరాధనలు చేస్తారు. వల్లి, దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం నిర్వహిస్తారు.
ఈ పండుగను పురస్కరించుకొని ‘ప్రావరణ వ్రతం’ ఆచరించే సంప్రదాయం ఉంది.
నిరుపేదలకు దుప్పట్లు, కంబళ్లు దానం చేయడమే ఈ వ్రత విధానం.
వేసవిలో వచ్చే శ్రీరామనవమి సందర్భంగా చలివేంద్రాలు ప్రారంభించినట్టుగా, ఎముకలు కొరికే చలి ఉండే మార్గశిరంలో దుప్పట్లు దానం ఇచ్చే వ్రతాన్ని సూచించారు మన పూర్వులు.
చలికి తాళలేకపోతున్న పేదలను ఆదుకోవడమే ఈ వత్రం ఆంతర్యం.
💥మార్గశిర శుక్ల అష్టమిని "కాలభైరవ జయంతి"గా జరుపుకొంటారు.
పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ముందుగా రుద్రుడి ఉగ్రాంశగా భావించే కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలన్నది పెద్దల మాట.
కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులు ముందుగా అక్కడి క్షేత్ర పాలకుడైన కాలభైరవుడి అనుజ్ఞ కోరి విశ్వనాథుడి దర్శనానికి వెళ్లడం సంప్రదాయం.
💥మార్గశిరంలో శుక్ల ఏకాదశిని "గీతా జయంతి"గా జరుపుకొంటారు.
భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయంలో శిఖరాయమానంగా పేర్కొనే భగవద్గీత ఆవిర్భవించింది ఏకాదశి నాడే.
శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసి కార్యోన్ముఖుణ్ని చేశాడు.
💥ఇక మార్గశిర పౌర్ణమి "దత్త జయంతి"గా చేస్తారు. సద్గురువు గొప్పదనాన్ని లోకానికి తెలియజేసిన దత్తాత్రేయుడు అవతరించింది ఈ రోజునే.
దత్తజయంతి నాడు ఉపాసకులు ‘గురు చరిత్ర’ను విధిగా పారాయణం చేస్తుంటారు.
💥వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖమైనదిగా పేర్కొనే "ధనుర్మాసం" కూడా మార్గశిరంలోనే మొదలవుతుంది.
సూర్యుడు ధనూ రాశిలో ప్రవేశించింది మొదలు మకర సక్రాంతి వరకు ధనుర్మాసంగా పరిగణిస్తారు.
ఈ కాలంలో వైష్ణవ ఆలయాలు కొత్త శోభను సంతరించుకుంటాయి.
ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని సేవించిన భక్తాగ్రేసరురాలు గోదాదేవి.
రోజుకో పాశురం చొప్పున భక్తి పారవశ్యంతో స్వామిని మెప్పించి తనవాడిగా చేసుకుంది.
గోదాదేవి కీర్తించిన ముప్పయి పాశురాలను "తిరుప్పావై" ప్రబంధంగా పిలుస్తారు.
ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలను పఠిస్తారు.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి ప్రేమను పొందడానికి గోపికలు "కాత్యాయనీ వ్రతం" ఆచరించింది కూడా మార్గశిరంలోనే.
వణికించే చలిని సైతం లెక్క చేయకుండా పొద్దు పొడవకముందే యమునా నదిలో స్నానం చేసి, కాత్యాయనీ దేవి సైకత మూర్తిని తీర్చిదిద్ది వ్రతం చేశారు గోపికలు.
అమ్మవారి అనుగ్రహంతో గోపికలు శ్రీకృష్ణుడి అనురాగం పొందారని భాగవతం పేర్కొన్నది.
ఇలా రకరకాల ఆధ్యాత్మిక విశేషాలు సంతరించుకున్న మహిమాన్విత మాసం మార్గశిరం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment