మార్గశిర శుక్ల షష్ఠి.. సుబ్రహ్మణ్య_షష్టి, సుబ్బారాయ షష్ఠి, స్కందషష్ఠి.

 ⚜️🕉️🚩ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః🌹🙏


💥మార్గశిర శుక్ల షష్ఠి.. సుబ్రహ్మణ్య_షష్టి, సుబ్బారాయ షష్ఠి, స్కందషష్ఠి.

కొలిచిన వారికి కొంగు బంగారమై, అభీష్టములు నెరవేర్చి, ఆయన పాదములను పట్టుకున్న వారికి ధర్మార్ధకామములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగిన వాడు, అవ్యాజకరుణామూర్తి, ఎప్పుడూ చిద్విలాసముతో చిరునవ్వులొలికిస్తూ ఉండే తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.

శివశక్తుల అనురాగమునకు ఫలము, జ్ఞాన పండిత అని కీర్తించబడ్డ వాడు, గజముఖానుజుడు, దేవసేనాపతి, వల్లీనాయకుడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. 

లోక సంరక్షణార్ధం తారకాసురున్ని వధించేందుకై దేవతల కోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడు అంశతో "మార్గశిర శుద్దషష్టి" నాడు జన్మించారు సుబ్రహ్మణ్య స్వామి.

💥పూర్వము "తారకాసురుడు" అనే రాక్షసుడు శివుని మెప్పుకై తీవ్రముగా తపస్సు చేసి తపోఫలముగా.. బ్రహ్మగారిచే ఒక వరం పొందాడు.

అది ఏమిటంటే, పరమశివుని వీర్యమునకు జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు. 

శివుడు అంటే కామమును గెలిచిన వాడు, ఆయన ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని, తారకాసురుడు..

తాను అజేయుడునని, అమరుడునని వర గర్వముతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకువెళ్ళి మొరపెట్టుకుంటారు.

తదుపరి ఆ శ్రీహరి.. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వలెనే తారకాసురుని మరణం సంభవిస్తుందని తెలిపి ఆ ఆదిదేవుని వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవివ్వగా దేవతలు పరమశివుని వద్దకు వెళ్తారు.

పరమశివుడు సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.

💥సుబ్రహ్మణ్యస్వామి జన్మ వృత్తాంతం:

దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు, శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా... 

అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాత యందు ప్రవేశ పెడతాడు.

అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది.

అంతటి గంగా నది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరముల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకము నందు విడిచిపెడుతుంది.

ఆ రెల్లుపొదల తటాకము నుండి, ఆరుముఖములతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుక్ల షష్ఠినాడు, ఒక బాలుడు ఉద్భవించాడు.

ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. 

ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రములు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కావున, స్వామివారికి కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖములతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామము వచ్చినది.

షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్ప వర్షము కురిపించారు. దేవదుందుభిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితులయ్యారు.

💥శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణముగా స్వామికి శరవణభవ అని నామము వచ్చినది.

ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి, నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామము వచ్చినది.

అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో, వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామములు వచ్చాయి.

దేవతలను రక్షించుటకొరకై శివుని నుండి, స్ఖలనమై వచ్చాడు కావున స్వామికి స్కంద అనే నామము వచ్చినది.

అలాగే క్రౌంచపర్వతమును భేదించడం వలన, క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు.

స్వామి వారికి గల అనేక నామములలో “గురుగుహా” అనే నామము కలదు. గురుగుహా అంటే, ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే ప్రణవార్ధం బోధించిన గురుస్వరూపము.

పార్వతి పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించారు.

💥సుబ్రమణ్యస్వామి..  నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి.. "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు..

స్కంద షష్టి రోజునాడు సుబ్రహ్మణ్య దేవాలయాలలో "శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి" కళ్యాణం నిర్వహిస్తుండడం పరిపాటి.

ఈ వివాహాన్ని వీక్షించిన వివాహం కాని యువతీ యువకులకు ఆటంకములు తొలగి వివాహాలు జరుగుతాయని చెబుతుంటారు.

అంతేకాకుండా వీరికి సత్సంతానము కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.

ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు.

స్వామి వారు ఇఛ్చాశక్తి, జ్ఞానశక్తిలతో కూడిన క్రియాశక్తి స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపము.

వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యారాధన చేసిన వారికి తప్పక సత్సంతానము కలుగును. స్వామి అనుగ్రహం వల్ల, సమస్త శుభములు సర్వులకూ లభించును.

💥శ్రీ సుబ్రహ్మణ్యానుగ్రహ సిద్ధిరస్తు !💥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు