💥 శ్రీవారి ఆలయంలో.. ధనుర్మాసోత్సవాలు
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏
💥 శ్రీవారి ఆలయంలో.. ధనుర్మాసోత్సవాలు
భూలోక వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసిన జగత్ ప్రసిద్ధమైన ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.
శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది "ధనుర్మాసం" కార్తీకం తర్వాత వచ్చే ఈ మాసంలో పురాణాల ప్రకారం దేవతలు శ్రీహరిని బ్రహ్మముహూర్తంలో ప్రత్యేకంగా ప్రార్ధిస్తారు.
కాబట్టి ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా సుప్రభాత సేవ స్థానంలో జనవరి 14 వరకూ "తిరుప్పావై" పారాయణం చేస్తారు.
ఇక, 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ (గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు.
శ్రీవేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాసురాలను కలిపి "తిరుప్పావై" అంటారు.
వాటినే "గోదాదేవి పాసురాలు" అంటారు.
ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం.
తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది.
శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒక పాశురం వంతున అర్చకులు పారాయణం చేస్తారు.
నిత్యం శ్రీవారిని తులసీ ఆకులతో అర్చిస్తుంటారు అర్చకులు. అయితే ఈ మాసం మొత్తం తులసి ఆకులకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగించడం ఆచారం.
ఈ బిల్వపత్రాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో ఈ పత్రాలతోనే స్వామివారిని అర్చిస్తారు అర్చకులు.
శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవ నిత్యం భోగ శ్రీనివాస మూర్తికే జరుపడం ఆచారం. అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాస మూర్తికి బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు అర్చకులు.
ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
ధనుర్మాస వ్రతం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుందని గోదాదేవి తెలియజేసింది.
ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో చెప్పబడింది.
ఇక, ధనుర్మాసం చివరి రోజున గోదాదేవిని శ్రీరంగనాథుడు తన భార్యగా స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే భోగి రోజున "గోదా కళ్యాణం" నిర్వహిస్తారు.
అలాగే, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్ ఆలయం నుంచి గోదాదేవికి అలకరించిన మాలలను తిరుమలకు తీసుకొచ్చి.. వాటిని స్వామివారికి అలంకరిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గరుడ సేవ రోజున ఈ సంప్రదాయం పాటిస్తారు.
అలాగే ఈ ధనుర్మాసంలో స్వామి వారికీ ప్రత్యేక నైవేధ్యాలను నివేదిస్తారు ఆలయ అర్చకులు.
శ్రీవారికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దోసెలు నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం దోసెలకు బదులుగా బెల్లం పాకంలో ఉంచిన ప్రత్యేక దోసెలని శ్రీవారికి నివేదిస్తారు అర్చకులు.
ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment