💥విశ్వగురువు_దత్తాత్రేయుడు..
⚜️🕉️🚩ఓం దత్తాయ నమః🌹🙏
జగదుత్పత్తి కర్త్రేచ స్థితి సంహార హేతవే |
భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
💥విశ్వగురువు_దత్తాత్రేయుడు..
భాగవత మహాపురాణం మహావిష్ణువు ధరించిన 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారాన్ని గురించి ప్రత్యేకంగా వివరించింది.
సత్త్వ, రజో, తమో గుణాలను జయించిన మహా తపశ్శాలి అత్రి మహాముని. అసూయలేని సాధ్వీమణి అనసూయ.
ఈ దంపతులిద్దరి తపో ఫలితంగా త్రిమూర్తుల అంశతో మార్గశిర పూర్ణిమనాడు దత్రాత్రేయుడు జన్మించాడు.
దత్తుడు జ్ఞానానికి ప్రతీక.
ఇతర దైవాల తీరులో ఆయన రాక్షస సంహారం చేయలేదు.
ఆయన దృష్టిలో మనిషిలో ఉండే అజ్ఞానం, అహంకార మమకారాలే రాక్షసులు.
మనిషిలోని దుర్గుణాలే అతడిని రాక్షసుడిని చేస్తాయి. అందుకే దత్తుడు అజ్ఞానాన్ని సంహరించి, జ్ఞానదీపాలు వెలిగించాడు.
అసలు దత్తాత్రేయుడి పేరులోనే ప్రత్యేకత ఉంది.
దత్తం అంటే త్యజించడం అనే అర్థముంది.
సూక్ష్మ, స్థూల, కారణాలనే మూడు రకాల శరీరాలను, జాగృత్, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులను, సత్త్వ, రజో, తమో గుణాలను జయించినందుకు ఆయన దత్తాత్రేయుడయ్యాడు.
💥మహా యోగీశ్వరుడైన దత్తుడు జగదాచార్యుడు కూడా.. సకల లోకాలకు గురుమూర్తి.
మిగిలిన భగవదవతారాల్లో దైవత్వం మాత్రమే దర్శనమిస్తుంది. కానీ దత్తావతారంలో మాత్రమే దైవలక్షణాలతో పాటు గురులక్షణాలు కూడా కనిపిస్తాయి.
అంతేకాదు ఆయన మహా అవధూత.
ప్రకృతి పరిశీలన ద్వారా భూమి, మిడత, చేప, ఏనుగు, సాలె పురుగు వంటి 24 చరాచరాల నుంచి దత్తుడు జ్ఞానాన్ని గ్రహించాడు.
వాటినే గురువులుగా భావించి సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకుని లోకానికి వివరించాడు.
భూమి నుంచి క్షమ, వాయువు నుంచి నిస్సంగత్వం, ఆకాశం నుంచి సర్వవ్యాపకత్వం, జలం నుంచి నిర్మలత్వం, అగ్ని నుంచి తేజస్సు... ఇలా ప్రతి జీవి నుంచి ఒక్కో అంశాన్ని గ్రహించాడు.
💥సృష్టిలోని ప్రతి ప్రాణినీ గౌరవించాలి.
రూపభేదాలు భౌతికమైన దేహానికే గానీ మనసుకి లేదు.
ప్రతి ప్రాణి హృదయంలో ఉండే భగవంతుడు ఒక్కడే. ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శించగల స్థాయికి చేరుకోవాలి.
ప్రకృతి వైవిధ్యం విలసిల్లేలా మన కార్యకలాపాలు ఉండాలి. అనంతమైన ప్రకృతిలోని ప్రతి అణువు నుంచి మనం గ్రహించాల్సిన అంశాలెన్నో ఉంటాయి.
రూపం వెనకాల ఉన్న భావాన్ని గ్రహించాలని ప్రకటించటమే ప్రకృతిలోని వివిధ విషయాలను దత్తుడు గురువులుగా స్వీకరించటంలో ఉన్న అంతరార్థం.
గతాన్ని పునాదిగా చేసుకుని, వర్తమానానికి అనుగుణంగా జీవిస్తూ, భవిష్యత్‌కు బాటలు పరుచుకోవాల్సిన కర్తవ్యం మనిషికి ఉంది.
మూడు ముఖాల దేవుడు అందించే మహోన్నత సందేశం ఇది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment