💥దక్షిణా మూర్తి.. మౌనబోధ

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।

నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥


💥దక్షిణా మూర్తి.. మౌనబోధ


ఉపదేశం విభిన్న రూపాలలో ఉంటుంది.

ఉత్తమ గురువు తాను ఉపదేశం చేసే వారి అభిలాష, గ్రాహ్య శక్తి, జిజ్ఞాసలను బట్టి అది ఏ రూపంలో ఇవ్వాలో, ఎంత స్థాయిలో ఇవ్వాలో నిర్ణయం చేస్తాడు.


అంతేకాదు.. విద్యార్థి సంకల్పశక్తి, దానికి అతడు జత చేయగల ధృతి స్థాయిని కూడ అంచనా వేస్తాడు.

అపుడే ఉపదేశ పద్దతి, దాని స్థాయిని, లోతును నిర్ణయం చేస్తాడు.


సామాన్యులకు వాగ్రూప ఉపదేశం. కొంత పక్వ మనస్కు లకు నయనోపదేశం. అతి పక్వచిత్తులకు మౌనమే ఉపదేశం అవుతుంది.

గురూపదేశంలో పద్ధతులు ఇవి.


దీనికి మరొక కోణం ఉంది.

గురువు తన ప్రవర్తన ద్వారా, మాట్లాడే తీరు వల్ల ఎంతో గొప్ప జ్ఞానాన్ని, ఎన్నో గొప్ప విషయాలను చెప్పకనే చెపుతాడు. అంటే, పరిశీలనాసక్తి తన శిష్యుల్లో పెంపొందేటట్టు చేస్తాడు.


పరిశీలన దృష్టిని అలవరచుకున్న శిష్యులు తమ నిర్ణీత విద్యాభ్యాస కాలానికే నేర్చుకోవటం పరిమితం చేయరు. తమ జీవితాంతం పరిశీలన అన్న అలవాటును వీడరు. 


వీరు గురువు ద్వారా నేర్చు కున్న విద్యను, జ్ఞానాన్ని అనూహ్యమైన రీతిలో వృద్ధి చేస్తారు. గురువు ఆశించేది అదే.


"సహనా వవతు... సహనం భునక్తు” అన్న శాంతి మంత్ర సారమిదే. ఉపదేశించేదదే.


గురువు నుండి పొందిన జ్ఞానానికి తమ ప్రతిభతో, అద్భుత ఊహా శక్తితో మరింతగా చేసి తమ శిష్యులకు అందచేస్తారు. అదే భారతీయ గురు పరంపరలోని విశిష్టత.


💥"దక్షిణామూర్తి" పరమ శివుని జ్ఞానరూప అవతారం. ఇతర గురువులు మాటలతోనే బోధిస్తారు.

కాని దక్షిణామూర్తి మౌనంలోనే శిష్యులు జ్ఞానాన్ని పొందుతారు.

గురువు మౌనంలోనే సందేహాలు నివృత్తి అవుతాయి. అది ఎలా సాధ్యమవుతుంది?


గురువులోని జ్ఞాన తేజస్సు ఆ ప్రదేశమంతా పరివ్యాపితమై ఒక గొప్ప శక్తి చాపంలా ఏర్పడుతుంది.

ఆ జ్ఞాన ప్రకాశం, గురువు ముఖ వర్ఛస్సు శిష్యులకు ఒక మనోప్రశాంతతను, అచంచలమైన ఏకాగ్రతలను ఇస్తాయి.

వారి సందేహాలకు సమాధానం దొరుకుతుంది.


ఉత్తమ గురువుల దివ్య మౌనమే శిష్యకోటికి మహత్తరోపదేశం.


💥సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తన ముఖం నుంచి బ్రహ్మ మానస పుత్రులు సనక, సనందన, సనతుజాత, సనత్కుమారులను సృష్టించాడు.


వారిని బ్రహ్మ, సృష్టిని కొనసాగించమని చెప్పగా, అది వారికి ఇష్టంలేక తాము జ్ఞానం పొందాలని, మేము మీకు సాయపడలేమని చెప్పి వారు విరక్తులై జ్ఞానాన్ని పొందడానికి తగిన గురువు కోసం అన్వేషిస్తూ వెళ్లిపోయారు.


అలా వారు గురువుకై వెదుకుతూ నారద మహర్షి సలహాపై మొదట బ్రహ్మ లోకానికి వెళతారు.

అక్కడ బ్రహ్మ సరస్వతితో ఉండటం చూసి ఆయన తమకు ఏమని ఉపదేశిస్తాడు. తగిన గురువు కాదనుకున్నారు.


అక్కడ నుంచి వైకుంఠానికి వెళ్లారు. విష్ణు పాదాలను ఒత్తుతున్న లక్ష్మిని చూసి మహావిష్ణువును ఏమీ ప్రశ్నించకుండా వెనుదిరిగారు.


ఆ తరువాత కైలాసానికి వెళ్ళి అక్కడ పార్వతీదేవితో వున్న అర్థనారీశ్వరుని చూసారు.

తమకు అక్కడ కూడా జ్ఞానం లభించదని అనుకుని వెనుతిరిగారు.


తమకు జ్ఞానాన్ని బోధించే వారెవరా అని అన్వేషిస్తూ వెళుతుంటారు. అలా వందల సంవత్సరాలు తిరిగారు. వారి అన్వేషణ తీవ్రతరం చేశారు.


వారి జ్ఞానాసక్తిని గుర్తించిన పరమశివుడు వారి పట్ల కరుణాతరంగుడై వారు వెళ్ళే దారిలో మర్రి చెట్టు కింద దక్షిణమూర్తి రూపంలో కూర్చున్నారు.


సనకసనందులు మొదటిసారి దక్షిణామూర్తిని చూసినప్పుడు ఆయన తేజస్సుకు పరవశులై ఆయనే నిజమైన గురువు అని అర్థం చేసుకున్నారు.

ఆయన చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, పాదాల వద్ద కూర్చున్నారు.


దక్షిణామూర్తిని చూస్తూనే సనకసనందులు ఆత్మ సాక్షాత్కారం పొందారు.

సంశయాలన్నీ దూరమయ్యాయి. వీరేమీ అడగలేదు. దక్షిణామూర్తి వారికి ఏమీ చెప్పలేదు.


గురు మౌనంలోనే వారు అన్నిరకాల సందేహాల నుండి విముక్తులయ్యారు. వారు జ్ఞానులు అయ్యారు.

ఆత్మను (శివుడిని) గ్రహించి సంకెళ్ల నుండి విముక్తి పొందారు.


అన్ని దు:ఖాలకు మూలం అజ్ఞానం. అజ్ఞానం తొలగితే శాశ్వత దు:ఖం తొలగుతుంది.

ఈ అవిద్యను దూరం చేసే జ్ఞాన స్వరూపమే దక్షిణా మూర్తి.


దక్షిణామూర్తి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. తల్లితండ్రులు పిల్లలకు ప్రతి నిత్యం జ్ఞాన ప్రదాత దక్షిణామూర్తి స్తోత్రం చదవటం అలవాటు చేస్తే అర్ధ వంతమైన, సుజ్ఞానం వారికి పట్టుబడుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు