💥శని త్రయోదశి

 ⚜️🕉️🚩ఓం శనైశ్చరాయ నమః🌹🙏


💥శని త్రయోదశి


నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం |

ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||


💥చాలా మంది శని పేరు వింటేనే అరిష్టం అని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషం ఎక్కడ తమకు అంటుకుంటుందో అని భయపడుతుంటారు.

అయితే అవన్నీ అపప్రథలు మాత్రమే.

వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు.

ఆయన అకారణంగా ఎవరినీ బాధించడు. 

            

మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు.


అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు.

దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలుగ చేస్తాడు. 


వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే సర్వశుభాలు కలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.


💥శనీశ్వరుడు నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు. ప్రభావశాలి.

మార్గశిర బహుళ నవమి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. మకర కుంభరాశులకు అధిపతి.


సూర్యుని భార్య సంజ్ఞ, ఆమె సంతానం వైవస్వతుడు, శ్రాద్ధదేవుడు, యముడు, యమున.


శనీశ్వరుని గురించి పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణాలు విభిన్న విషయాలు వివరిస్తున్నాయి.

శని మందగమనం గలవాడు గనకు "మాదుడు" అంటారు. ఇతని వాహనం కాకి.

నలుపు, నీలివర్ణాలు ఈయనకు ఇష్టమైనవి.

జిల్లేడు ఆకులు, తిలలు, తైలాభిషేకం ఇష్టం.


💥సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి శని అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. 


దానధర్మాలతో, సత్యాహింసలను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని అనుసరించేవారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాలు కలిగిస్తాడని, ఆ కారణంగా ఎవరినీ బాధించడని పురాణాలు వివరిస్తున్నాయి.


శని బాధలు ఆయా మానవుల పూర్వ కర్మ ఫలాలే.

వారి వారి కర్మలను అనుసరించి ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆ కర్మ ఫలితాలను సిద్ధింపజేస్తాడు.


అయితే అనాదిగా శనీశ్వరుడంటే పీడించి కష్టనష్టాలు కలిగించే వాడనే భావం ప్రబలంగా ఉంది.

కానీ శని దూషణ కూడదు.

శనీశ్వర దూషణ సర్వదేవతా దూషణ.

శని కృప సకల దేవతాకృపతో సమానం.

కాగా త్రయోదశి తిథి, శనివారం శనికి ప్రీతికరమైనవి.


💥శనిదోష పరిహారానికి...


శని త్రయోదశి రోజున తిల, తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శని దోష శాంతిని చేసేది అయ్యప్పదీక్ష.


భైరవ స్తోత్రం  చేసినా, ఆంజనేయుని అర్చించినా, వేంకటేశ్వరుని ఆరాధించినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు.


శనివారం- త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్ఠమైనది.

శని బాధలు పడేవారు జమ్మిచెట్టుకు లేదా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.

అలాగే నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మిచెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గోపూజ చేస్తే శనిదోషం పరిహారం కాగలదని విశ్వాసం. 


కాకులకు, నల్లచీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చునని శాస్త్రం.


💥అలాగే ప్రతి నెలా వచ్చే త్రయోదశి తిథినాడు తిలదానం కూడా ప్రశస్తమని చెబుతారు.


దశరథుడు, నల మహారాజు, పరీక్షిత్తు, ధర్మరాజు మొదలైనవారు కష్టాల్లో శనిని పూజించి భక్తితో తరించారని కథనాలు ఉన్నాయి.


లోహమయమైన శని ప్రతిమను తైలం గల పాత్రలో ఉంచి నల్లని వస్త్రాన్ని కప్పి గంధం, నీలి పుష్పాలు, తిలాన్నాలతో పూజించి ప్రతిమను దానం చేయాలి. 


కోణస్థ, పింగల తదితర శని దశనామాలను రావిచెట్టు వద్ద జపిస్తే శని బాధ కలగదని విశ్వాసం.


శనిత్రయోదశి అయిన నేడు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహం పొందుదాం.!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం