💥భక్తి ముక్తి💥
⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥భక్తి ముక్తి💥
ఎవరైతే మనసా, వాచా, కర్మణా భగవంతుని యందు భక్తి కలిగి ఉంటారో, వారి యోగక్షేమాన్ని భగవంతుడే భరిస్తాడనేదానికి ఒక యదార్ధ సంఘటనను ఉదాహరణగా చెబుతాను.
కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతుల వారికి ముందు పీఠాధిపతులుగా అదే పేరుతో ఇంకో స్వామి వారుండేవారు.
వారు అమ్మవారికి గొప్ప ఉపాసకులు.
వారితో వాదభిక్ష (వాదించాలని కోరుకోవడం) కావాలని ఒకసారి కొందరు వచ్చారు.
వారిని వాదం మొదలెట్టమన్నారు స్వామి వారు.
అందుకు వారన్నారు “స్వామీ! మీ ఒళ్ళో కూర్చున్న ఆ అందమైన పాపను చూస్తుంటే మా నోట మాట రావటం లేదు. ఆ పాపను మాకు కనిపించకుండా చేస్తే మేము మాట్లాడగలం” అన్నారు.
అప్పుడు స్వామి వారన్నారు “నేనొక సన్యాసిని. నా ఒళ్ళో పాప ఆడుకోవడం ఏంటి? మీరేదో పొరబడుతున్నారు” అన్నారు.
అప్పుడు వారన్నారు “కాదు స్వామీ! మీ ఒళ్ళో పాపను ప్రత్యక్షంగా మేం చూస్తున్నాం. అందువల్లే మేము మాట్లాడలేకపోతున్నాం!"
అప్పుడు ఆ స్వామి వారు ” ఆ పాప మరెవరో కాదు. నేను ఉపాసిస్తున్న కామాక్షి అమ్మవారే! ఆమెకు నామీద కల దయ వలనే మీరు వాదించలేక పోతున్నారు” అన్నారు.
శరణాగతి స్థితికి చేరుకున్న భక్తులతో, భగవంతుడు ఇలా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాడు.
💥శంకర భగవత్పాదులు ఇలా అంటారు..
"మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే"
-అంటే మోక్షానికి కారణాలైన వాటిల్లో “భక్తి” గొప్పది అని. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది.
భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరం గానే ఉంటాడని, దగ్గర ఉన్నాడని అనుకొంటే దగ్గరే ఉంటాడని అని చెప్తారు!
అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది, అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం.
ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తుల నిరోధమే “యోగ”మన బడుతుందనీ పతంజలి మహర్షి చెప్పాడు.
అదే భక్తి అని శంకరుల వివరణ.
ఇలాంటి భక్తి వలనే మానవుడు తరిస్తాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే భగవంతుని పట్ల ప్రేమనే భక్తి అనొచ్చు.
అటువంటి భక్తుల పట్ల పరమేశ్వరుడు సంతృప్తిగా ఉండి, వారి బాధ్యతలను తానే భరిస్తాడు.
అనన్యాశ్చింతయంతోమాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం!!
ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను అన్నది భగవంతుడి హామీ!
ఇంతకన్నా మనకు ఏమి కావాలి?
ఈ భక్తి ఎప్పుడైతే ఏమీ ఆశించదో అప్పుడే దానిని "శరణాగతి" అంటారు.
💥భక్తులలో నాలుగు రకాల వారుంటారని, ఈ నాలుగు రకాల వారు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.
ఆ నాలుగు రకాలవాళ్ళు– కష్టాల్లో ఉన్నవాడు, కోరికలున్నవాడు, జిజ్ఞాసువు (అంటే జ్ఞానం పొందాలనే ఆసక్తి ఉన్నవాడు), జ్ఞాని.
భక్తి అనేది ఒక యోగం.
దీన్ని గురించి రెండు ఉదాహరణలు చెప్పారు.
మొదటిది "మర్కట కిశోర న్యాయం"
మర్కట కిశోరం అంటే కోతి పిల్ల.
ఇది తన తల్లి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగిరేటప్పుడు తల్లి కడుపును జాగ్రత్తగా పట్టుకునే ఉంటుంది.
ఇది కష్టమైన పని. వేదాంత మార్గంలో నడిచేవారు దీన్ని అనుసరిస్తారు.
రెండవది "మార్జాల కిశోర న్యాయం"
మార్జాల కిశోరమంటే పిల్లి పిల్ల.
దీన్ని దాని తల్లే నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంది.
భక్తి మార్గంలో నడిచేవారు దీన్ని అనుసరిస్తారు.
💥భక్తి భావానికి అంతిమ లక్ష్యం ఏమిటంటే "జన్మరాహిత్యం"
దీని కోసం నిరంతరం భగవంతుడిపై భక్తిని కలిగి వుండాలి.
ఆ భగవత్ స్వరూపాన్ని మనలో నిక్షిప్తం చేసుకుంటే ఏదో ఒకరోజు ఈ జీవుడు పరమాత్ముడితో అనుసంధానం అవుతాడు. దాన్నే ఆత్మ సాక్షాత్కారమని అంటారు.
కొన్ని బారువుల బంగారంతో సత్యభామ శ్రీ కృష్ణుడిని తూచలేకపోయింది.
రుక్మిణీ దేవి అదే శ్రీ కృష్ణుడిని భక్తితో ఒక తులసీదళంతో తూచి దక్కించుకుంది.
భగవంతుడికి కావలసింది భక్తి మాత్రమే.
సేకరణ... శ్రీమతి శారదాప్రసాద్ గారి ఆధ్యాత్మిక వ్యాసముల నుండి 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment