💥శ్రీ రామ‌త‌త్వ‌మ్ మ‌న‌కు ఏం బోధిస్తున్న‌ది?

 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥శ్రీ రామ‌త‌త్వ‌మ్ మ‌న‌కు ఏం బోధిస్తున్న‌ది?


ఇక్ష్వాకు వంశోద్ధరణ కోరి, పుణ్య చరితుడైన దశరథుడి పుత్రేచ్ఛ కారణంగా జన్మ ఎత్తిన ఆర్యపుత్రుడు శ్రీరాముడు.


విధిని అనుసరించి మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్న మానవీయ, మహనీయమూర్తి శ్రీరామచంద్రమూర్తి.


ఉత్తమ కుమారుడిగా, ఆదర్శ సోదరుడిగా, ధర్మ స్వరూపి అయిన భర్తగా, జీవకారుణ్య స్ఫూర్తిగా, అరణ్య జీవన రక్షకుడిగా, అధర్మ విదార శక్తిగా, అయోధ్య పాలకుడిగా, స్నేహబాంధవుడుగా, స్మిత పూర్వక సంభాషణా విన్నాణ మూర్తిగా, ధర్మాన్ని, సత్యాన్ని ఆలంబన చేసుకుని, అవనీ సంచారాన్ని ఆనంద గీతికగా ఆవిష్కరించిన పురుషోత్తముడు రాముడు!


దశావతారాలలో ఏడోదిగా, నక్షత్ర మాలలోనూ ఏడోది అయిన పునర్వసు పుణ్యరాశిగా ఆరాధనీయుడి అవతరణ రాముడు.


💥రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ

కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః


🌹భావం:

దశరథ మహారాజు, కౌసల్యల తనయుడు, శూరుడు, లక్ష్మణునిచే అనుగమించ బడిన వాడు,  బలవంతుడు, సూర్యవంశమున జన్మించిన వాడు, పూర్ణ పురుషుడు, రఘు కులములో ఉత్తముడు ఈ రాముడు.


వశిష్ఠ మహర్షితో సాగించిన గోష్ఠితో మనసు మర్మాన్ని ఎరిగి, విశ్వామిత్ర సారథ్యంలో మంత్రబలాన్ని గ్రహించి, తాటక సంహారంతో తామస గుణాన్ని జయించి, అహల్య శాప విమోచనంతో రాజసాన్ని అధిగమించి, సీతా కల్యాణ వైభోగంతో సత్వగుణాన్ని అందుకుని, పూర్ణ మానవత్వానికి పట్టం కట్టిన మహనీయుడు రాముడు!


పట్టాభిషేక ఆనంద క్షణాలలో ఎదురైన ఆశాభంగాన్ని స్థితప్రజ్ఞతతో జయించాడు.

అడవుల వైపు నడక సాగించినా, దశరథుని మరణానంతరం తన తండ్రికి మిత్రుడైన జటాయువుకు అంత్యేష్టి, అంటే అగ్నిసంస్కారం జరిపాడు.


పగలంతా దుష్ట సంహార క్రీడ సాగించి, రాత్రులన్నీ మహర్షుల సన్నిధిలో గడిపాడు.

వాలిని సంహరించి, సుగ్రీవ మైత్రిని సాధించుకుని, హనుమశక్తిని తన శక్తిలో ఇముడ్చుకుని, రావణ సంహారం తర్వాత మాతృమూర్తి, మాతృదేశాన్ని మించి వేరు స్వర్గం లేదని ప్రకటించిన యథార్థ జ్ఞాని శ్రీరాముడు!


దాంపత్య ధర్మాన్ని, కుటుంబ వ్యవస్థను, సోదర ప్రేమను, రాజధర్మాన్ని, ప్రజానురంజక పాలనను, వేద ధర్మాన్ని తన జీవన విధానం ద్వారా పరిపుష్టం చేసిన లలిత మర్యాదుడు శ్రీరాముడు!


💥వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః

జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః  


🌹భావం:

వేదాంతములచే గ్రహించబడే వాడు, యజ్ఞములకు అధిపతి, సనాతనుడు, పురుషోత్తముడు, సీతాప్రియుడు, శుభకరుడు, అనంతమైన పరాక్రమము కలవాడు ఈ రాముడు.


యజ్ఞం, దానం, త్యాగం కలిసినదే భారతీయ సంస్కృతి. ఫలితం లభించే వరకూ పనిచేస్తూ, లోకసంరక్షణకై యజ్ఞ నిర్వహణను చేస్తూ, అర్హులైన వారికి దానం చేస్తూ, దారితప్పిన వారికి దండన విధిస్తూ, నిరంతరం అప్రమత్తతతో మెలుగుతూ, మితభాషణం చేస్తూ, ధర్మాన్ని కవచంగా ధరిస్తూ, విధి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ, జీవితానికి సంపూర్ణత్వాన్ని సంతరించిన ఉదాత్తుడు శ్రీరాముడు.


💥లోకాభిరామం రణరంగధీరం

రాజీవనేత్రం రఘువంశనాథం

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే  


ఇంద్రియాతీత భావనే ఆనందం!

అది మూర్తిమంతమైతే, అవ్యాజ కరుణే స్వభావమైతే, అతిమానుష చర్యలే దివ్యశక్తులైతే, రామరాజ్యం సర్వదా ఆదర్శమైతే, నవోజ్వల శీలమే గుణమైతే, పరాశక్తిని పరిణయమాడగల ధీశక్తి సహజశక్తి అయితే, దేశ, కాల బద్ధత్వమే బుద్ధత్వమైతే, ఆసేతు శీతాచలం ధర్మ, కర్మ, తపో, యాగ, యోగ, ధ్యాన భూమి అయితే, అదే రామత్వమ్‌. అదే శ్రీరామతత్వమ్‌! 

సేకరణ... ఆధ్యాత్మిక శాస్త్రవేత్త -- వి.యస్‌.ఆర్‌.మూర్తి గారి పత్రికా వ్యాసముల నుండి 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు