💥అంతర్వేది నరసింహుడు...

 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥అంతర్వేది నరసింహుడు...


దక్షిణ కాశీగా పిలుచుకునే "అంతర్వేది" గోదావరి, సాగర సంగమ పవిత్ర ప్రదేశం.


సృష్టికర్త "చతుర్ముఖుడు" ఈ స్థల మహత్యమును గ్రహించి లోక శాంతి కోసం మహరుద్ర యాగం మనసారా ముగించి ఈశ్వరానుగ్రహమునకు పాత్రులై బ్రహ్మదేవుడే క్షేత్ర పాలకుని చేసి నీలకంఠేశ్వరుని ప్రతిష్టించాడని ప్రతీతి.

అందువల్లనే అంతర్వేది "దక్షిణ కాశీ"గా ఖ్యాతి గడించింది.


🌹స్థల పురాణం:


నారద మహర్షికి బ్రహ్మ తెలిపినట్టు పురాణాలు ఉటంకించే ఉదంతాన్ని పరిశీలిస్తే అంతర్వేది క్షేత్ర ఔన్నత్యం ప్రస్పుటమవుతుంది.


పవిత్రతకు పరాకాష్ఠగా ఉన్న అంతర్వేదిని "బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి" ఆశ్రమానికి తగిన స్థలమని ఎంపిక చేసుకున్నారు.


ఎన్నెన్నో యజ్ఞయాగాదులను నిరంతరం నిరాటంకంగా నిర్వహించుకున్నారు.

అంతటి మహామునికి ముప్పు వాటిల్లకపోలేదు. 


ఈశ్వరదత్త వరప్రసాద గర్వితుడైన హిరణ్యాక్ష కుమారుడు రత్నలోచనుడు విధ్వంసకాండకు పూనుకున్నాడు.


ఈ కిరాత కృత్యాలు ఆశ్రమ వాటికకు ఆవేదన ఆందోళన కలిగించాయి.

వశిష్టుని అర్ధాంగి అరుంధతిని హింసించాడు.

ముని వనితలను చెరపట్టాడు.


రుచి మొదలుగా గల నూర్గురు పుత్రులను పొట్టన పెట్టుకున్నాడు.

పసిపాపలనైనా చూడకుండా చంపి కసితీరా పచ్చినెత్తురు త్రాగసాగాడు.

మహర్షి సహనం నశించిపోయింది.

భరింపజాలని బాధతో విష్ణువుకు వివరించాడు. 


దీనితో శ్రీమహా విష్ణువు నరసింహవతారమెత్తి రణరంగ ప్రవేశం చేశారు.

రత్నలోచనుని సంహారం సాధ్యం కాలేదు.

రక్కసుని ఒంటి మీది గాయం నుంచి పడి రక్తసిక్తమైన మృత్తిక నుంచి అక్షౌహిణుల కొద్దీ రత్నాలోచనులే పుట్టుకు రాసాగారు.


అప్పుడు అశ్వరూఢాంబిక ఆదిశక్తిగా అన్నకు తొడుగా రణరంగంలో నిలిచింది.

రక్తపు బొట్టును నేలపై పడనియక యుద్ధభూమిలో నాలుక చాపి పరిచింది.


మహా విష్ణువు రత్నలోచనుని వధ పూర్తి చేసి కళేబరాన్ని అంతర్వేదికి విసిరివేశాడు.


 కృతయుగంలో వశిష్ఠుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అర్జునుడు, ఈ క్షేత్రాన్ని నందర్శించారని పురాణాలు చెబుతున్నాయి.


🌹ఆలయ చరిత్ర...


కలియగం ప్రవేశానికి ముందే వశిష్ఠుడు అంతర్వేదిని వదిలి వెళ్లడంతో ఆయన నిర్మించిన నరసింహ ఆలయం అర్చనాదులు లేక శిథిలవమైంది.


అదే కాలంలో కేశవదాసు అనే వ్యక్తి అడవిలాగా ఉన్న ఈ ప్రాంతంలో గోవులను మేపుకుంటూ ఉండేవాడు.

ఒక గోవు ప్రతిరోజు ఒక పుట్ట వద్దకు వచ్చి పుట్టలో ధారగా పాలు పోస్తుండడం అతడు గమనించాడట.


గోవులను ఇంటికి తోలుకెళ్లిన కేశవదాసుకు ఆ రాత్రే నరసింహస్వామి కలలో కనిపించి ఆ పుట్టలో తాను నివాసమున్నాని చెప్పడంతో, మరునాటి ఉదయమే పుట్టను తవ్వి పందిరి వేసి పూజలు ప్రారంభించాడట.

🔸🔹🔸🔹🔸


🌹ప్రతియేటా మాఘశుద్ధ దశమి నాటి రాత్రి స్వామి వారి కల్యాణం, మరునాడు భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారి రథయాత్ర కన్నుల పండుగగా లక్షలాదిమంది భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు.


"ఏటేటా పెళ్లి ఏమిట్రా వెర్రి నాగన్నా" అంటూ నరసింహుని సహోదరి అశ్వరూఢాంబిక (గుర్రాలక్క) మూతి తిప్పుకుందట.


అయినా సోదరిపై ఉన్న వాత్సల్యంతో కల్యాణ శోభితుడైన నరసింహుడు రథంపై ఊరేగింపుగా సోదరి ఆలయానికి వెళ్లి చీరె సారెలు ఇచ్చి రావడం ఆనవాయితీగా వస్తోంది.


🌹భీష్మ ఏకాదశి మొదలు పౌర్ణమి లోపు ఏదో ఒక రోజున సూర్యభగవానుడి కిరణాలు మూల విరాట్ పాదాలను తాకుతాయట.

ఈ అంశాలను పరిశీలిస్తే స్వామివారి విశిష్టత తేట తెల్లమవుతుంది.


మరొక యదార్థ నంఘటన కూడా పరిశీలించాలి. స్వామి ఆలయం వెనుక వైపు ఉన్న నదీ పాయలో ఒక జాలరికి ఒక రోజు అతని వలలో రెండు శిలలు పడ్డాయి, జాలరి వాటిని విసిరికొట్టాడు.


మరల వల వేయగా అవే శిలలు వలకు చిక్కాయి. దాంతో జాలరి ఆ రాళ్లను మరల విసిరి కొట్టగా వాటి నుండి రక్తం ధారగా కారడంతో జాలరి ఆ శిలలను ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు అందించగా ఆ శిలలే సాలగ్రామాలుగా నేటికీ ఆలయంలో నిత్యపూజలు అందుకుంటున్నాయి.


🌹తుపానులకు పెట్టింది పేరయిన బంగాళఖాతం ఒడ్డున వెలసిన నరసింహుడు ప్రణవ స్వరూపుడై సముద్రతీరం వెంబడి సంచరిస్తూ ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడతారని ప్రజల అపార విశ్వాసం.

ఎన్ని ఉప్పెనలు, సునామీలు, తుపానులు వచ్చినా నరసింహుడే రక్షించాడనేది ఇక్కడి ప్రజల విశ్వాసం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం