గంగమ్మ తల్లి పన్నెండేండ్లకోసారి జరుపుకొనే పెద్ద పండుగ.. పుష్కరాలు!

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గంగా దేవ్యై నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥భారతీయత ఓ ముక్కాలిపీట అయితే...

గీత.. గాయత్రి.. గంగ..

ఆ పీటకు మూడు కాళ్లని చెబుతారు.


గంగమ్మ తల్లి పన్నెండేండ్లకోసారి జరుపుకొనే పెద్ద పండుగ.. పుష్కరాలు!


బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది.

బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది.

(ఏప్రిల్‌ 22న ఆరంభమైన గంగా పుష్కరాలు మే 3 న ముగుస్తాయి)


తవజల మమలం యేననిపీతమ్‌

పరమపదం ఖలుతేన గృహీతమ్‌

మాతర్గంగే త్వయియో భక్తః

కిల తం ద్రష్టుం న యమః శక్తః


🌹"తల్లీ! నీ నీళ్లు గుక్కెడు తాగినా చాలు. పరమ పదాన్ని చేరుకోవచ్చు.

యమరాజు అంతటివాడైనా నీ భక్తులవైపు కన్నెత్తి చూడలేడు" అంటుంది భారతీయత.

🍁🍁🍁🍁


💥గంగమ్మా.. అంటూ నోరారా పిలుస్తారు తెలుగువారు.

ఏ పెద్దమ్మనో పలకరించినట్టు, ఏ ముత్తయిదువనో ఇంటికి ఆహ్వానించినట్టు.

మన గడ్డ మీద ప్రవహించకపోవచ్చు, కానీ మన గుండెల్లో మాత్రం గంగ పారుతూనే ఉంటుంది. 


గోదావరి, తుంగభద్ర, కృష్ణ.. ప్రవాహాల్లోనే గంగా తరంగాలను ఊహించుకుంటాం.


పెద్దలను ‘గంగా భాగీరథీ సమానులు’గా గౌరవించుకుంటాం.


"గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ" అంటూ గంగతో ఆరంభించి ఏడు నదులను ప్రస్తావించుకుంటూ తొలి చెంబు కుమ్మరించుకుంటే కానీ స్నానం పూర్తయినట్టు కాదు.


పురుడునాడు గంగాజలంతో పసిబిడ్డ గొంతు తడపడం సంప్రదాయం.

బిడ్డను ఊయలలో వేస్తున్నప్పుడు గంగాపూజ చేస్తారు.

కొన ఊపిరిలో ఉన్నవారికి గంగాజలం.. ముక్తిమార్గం. 


గంగలో అంత్యక్రియలు జరిగితే.. అనంతలోకాలలో రాచ వైభోగాలని పెద్దలు చెబుతారు.

కాబట్టే, గంగ భారతీయుల హృదయాంతరంగ అనిపించుకుంది.

🔸🔹🔸🔹🔸


💥ఆది గంగ..


బలి చక్రవర్తి.. మహాదాతగా భళీ అనిపించుకున్నా.. స్వభావరీత్యా రక్కసుడు.

దేవతలను చూస్తే అక్కసు.


ధర్మ సంస్థాపనార్థం.. శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి.. ఇంతింతై వటుడింతయై.. బలి నెత్తిన కాలుపెట్టి దేవతల మొక్కులు స్వీకరిస్తున్న సమయాన.. స్వామి ఎడమపాదం నుంచి గంగ ఉద్భవించిందని పురాణ వచనం.

కానీ, ఆ సురగంగ ప్రవాహం స్వర్గసీమకే పరిమితమైంది.


త్రేతాయుగంలో భగీరథ ప్రయత్నంతో గంగమ్మ నేలకు దిగింది.

గంగావతరణ ఘట్టం రామాయణంలో ఓ మనోహర దృశ్యకావ్యం.


ఆ మహత్కార్యం అయోధ్య పాలకుడు సగరుడి కథతో మొదలవుతుంది. ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్దభార్య కేశిని. చిన్నభార్య సుమతి.

ఇద్దరికీ సంతానభాగ్యం లేదు.

దీంతో సగరుడు ఏండ్ల తరబడి తపస్సు చేశాడు.


ఆ సాధనకు మెచ్చి భృగుమహర్షి ‘ఒక భార్యకు వంశాన్ని నిలబెట్టే కొడుకు పుడతాడు. మరో భార్యకు అరవైవేలమంది కుమారులు జన్మిస్తారు’ అంటూ వరమిచ్చాడు.


కేశిని, సుమతి.. తమకు నచ్చిన వరాన్ని ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు మహర్షి.

కేశిని సత్సంతానాన్ని ఎంచుకున్నది. అంశుమంతుడికి జన్మనిచ్చింది.


సుమతి మహా ఉత్సాహవంతులైన అరవైవేలమంది బిడ్డలను కోరుకున్నది. అదొక అల్లరి మూక. పిడుగుల దండు. వాళ్ల అరాచకాలకు హద్దులు లేకుండాపోయాయి.


అంతలోనే సగరుడు అశ్వమేథ యాగం ప్రారంభించాడు.

అంశుమంతుడు యాగాశ్వాన్నిఅనుసరించాడు.


ఇంతలో, దేవేంద్రుడు కపటబుద్ధితో యాగాశ్వాన్ని అపహరించి పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు.

అశ్వమేథం విజయవంతమైతే తన పదవికి ఎసరు వస్తుందనే భయం.

ఆ పరిస్థితుల్లో సగరపుత్రులకు ఏం చేయాలో తోచలేదు. తండ్రికి వర్తమానం పంపారు.


‘యాగాశ్వం ఆనవాలు దొరికిన తర్వాతే.. నగరంలో ప్రవేశించండి’ అంటూ కండ్లెర్రజేశాడు పితృదేవుడు. అరవైవేల మొహాలూ తెల్లబోయాయి.

అణువణువూ గాలించాలని నిర్ణయించారు.

అశ్వం కనిపించేవరకూ భూమిని తవ్వాలని నిర్ణయించుకున్నారు.


ఎదురైన ప్రతి వ్యక్తిని.. గుర్రం ఆనవాలు చెప్పమంటూ హింసకు దిగారు. ప్రాణాలు తీశారు.

పాతాళం వరకూ వెళ్లారు.

కపిల మహర్షి ఆశ్రమం ఆవరణలో యాగాశ్వం కనిపించింది. దీంతో మహర్షిని అవమానించారు.


ఆ తపోధనుడి ఆగ్రహజ్వాలకు అరవైవేల మందీ బూడిదైపోయారు.

అంశుమంతుని మనుమడు, దిలీపుని కొడుకు భగీరథుడు యాగాన్ని పరిసమాప్తి చేసే ఉద్దేశంతో.. కపిలుడి ఆశ్రమానికెళ్లి, మహర్షికి నమస్కరించి.. తన కర్తవ్యాన్ని వివరించాడు.


సురగంగను నేలకు దింపి.. ఆ బూడిద కుప్పలపై ప్రవహింపజేస్తే.. ఆ అరవైవేల మందికీ ముక్తి లభిస్తుందని సలహా ఇచ్చాడు.

దీంతో భగీరథ ప్రయత్నం మొదలైంది.


పరమేశ్వరుడి కటాక్షమూ లభించింది.

ఆ సురగంగను శివుడు తన జటలలో బంధించాడు. 


అటునుంచి నేలకు పారుతున్న సమయంలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది.

జహ్ను.. ఆగ్రహంలో జమదగ్ని అయ్యాడు.

గంగను గుప్పిట తీసుకుని గుటుక్కున మింగేశాడు. 


భగీరథుడి ప్రార్థనతో శాంతించి.. తన చెవినుంచి వదిలాడు. అక్కడినుంచి జాహ్నవి.. పరుగుపరుగున వెళ్లి సగరుడి కుమారుల భస్మంపై పారింది.

అరవైవేల ఆత్మలకు ముకినిచ్చింది.

అనంతకోటి జీవరాశికి జీవ జలమైంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం