💥వటపత్రశాయి.. (అరణ్యపర్వము)
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి ||
🌹కలువల వంటి చేతులతో పద్మముల వంటి పాదములు పట్టుకొని తన కలువ వంటి ముఖము వద్దకు తీసుకువచ్చి మనలను అలరించే, వట పత్ర శాయి అయిన ఆ బాల ముకుందుని (మొక్షానందాన్ని కలిగించే వాడు) మనసులో స్మరిస్తున్నాను.
🍁🍁🍁🍁🍁
💥వటపత్రశాయి.. (అరణ్యపర్వము)
ధర్మజా! ఈ కల్పాంతంలో నేను దిక్కుతోచక తిరిగాను.
జలప్రళయంలో పెద్ద మర్రి చెట్టు కనపడింది.
ఆ మర్రి ఆకు మీద నీలమేఘశ్యాముడైన శ్రీమహావిష్ణువు చిన్ని బాలుని వలె పడుకుని ఉన్నాడు.
ఈ మహాప్రళయంలో ఈ చిన్ని బాలుడు ఎలా ఉన్నాడా అని ఆశ్చర్య పోయాను.
నేను ఆ బాలుని దగ్గరగా పోయాను.
ఆ బాలుడు నన్ను చూసి నవ్వుతూ "మహానుభావా ! నీకు విశ్రాంతి లేక అలసి పోయి ఉన్నావు. నా దేహంలో ప్రవేశించి కొంచెం విశ్రాంతి తీసుకో" అంటూ తన నోరు తెరిచాడు.
నేను ఆ నోట్లోకి బలవంతంగా నెట్టబడ్డాను.
ఆ బాలుని నోట్లో గంగ లాంటి మహానదులూ, మేరు పర్వతం లాంటి పర్వతాలు, సముద్రాలు, నగరాలు, జనపదాలు, ప్రజలు, పశుపక్ష్యాదులూ, సువిశాల భాగాలూ సూర్య చంద్రులూ, నక్షత్ర సముదాయాలు,
అనంతాకాశం, ఇంద్రాది దేవతలు, యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుషులు, విద్యాధరులు, సమస్త దేవతా సమూహములు, సమస్త జగములు అన్నీ నేను ఆ చిన్ని బాలుని ఉదరంలో చూసాను.
అక్కడ నేను నూరు సంవత్సరములు తిరిగాను.
తరువాత నాకు నాకు భయం వేసింది.
అప్పుడు ఆ బాలుడు వదిలిన గాలికి నేను బయటకు విసిరి వేయబడ్డాను.
తిరిగి మర్రి చెట్టు ఆకు పై పవళించి ఉన్న ఆ బాలకుని చూసాను.
ఆ బాలుడు నన్ను "మహాత్మా! నా ఉదరములో విశ్రాంతి తీసుకున్నావా?" అని అడిగాడు.
నేను ఆ బాలునికి నమస్కరించి దేవా ! నీ ప్రభావం వలన సమస్త లోకములు నీ ఉదరంలో చూసాను.
నీ మాయ అర్ధం కావడంలేదు.
నీవా చిన్న బాలుడివి. నీ ఉదరంలో సమస్త లోకాలున్నాయి. ఈ జల ప్రళయం ఏమిటి ?
దేవా ! నీవు నా భ్రాంతిని తొలగింపుము" అని అడిగాను.
🔸🔹🔸🔹🔸
💥#నారాయణ_తత్వం...
మార్కండేయునికి నారాయణుడు తనను గురించి వివరించ సాగాడు.
"మహాత్మా ! జలమును నారములంటారు.
అందుకే నన్ను నారాయణుడంటారు.
ఈ లోకమును నేనే సృష్టిస్తాను. నేనే పోషిస్తాను.
నేనే నాలో లయం చేసుకుంటాను.
బ్రహ్మ, ఇంద్రుడు, కుబేరుడు తదితర దేవతలందరూ నా అంశలే.
నాకు భూమి పాదం, అగ్ని ముఖం, సూర్యచంద్రులు నేత్రాలు, ఆకాశం శిరస్సు.
ఈ అద్భుతమైన ఆకారంలో నేను భాసిల్లుతాను.
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు యజ్ఞయాగాదులతో నన్ను ఆరాధిస్తారు.
ప్రళయకాలంలో ఈ భూమిని యజ్ఞవరాహావతారంతో ఉద్ధరించింది నేనే, ఈ భూమండలాన్ని భరిస్తున్నది నేనే.
అగ్ని రూపంలో సముద్ర జలాలను త్రాగి వర్ష రూపంలో విడిచి పెడతాను.
సృష్టి ఆరంభంలో నేను నా ముఖం నుండి, భుజముల నుండి, తొడలనుండి, పాదముల నుండి నాలుగు వర్ణాలను సృజిస్తాను.
ప్రళయకాలంలో వీటన్నిటినీ నాలో లయం చేసుకుంటాను.
అహంకారం విడిచి క్రోధం లేక ఎల్లప్పుడూ సత్యం పలుకుతూ కోరికలను జయించి అసూయకు లోబడక ఆత్మ జ్ఞానం పొందిన వారు అయిన ఋషులు ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తుంటారు.
ఈ జగత్తులో ఉండే గ్రహములు, గాలి, వర్షము అన్నీ నేనే.
సప్త సముద్రాలను నేను పడకగా అమర్చుకుని పడుకుంటాను.
మహర్షీ ! సత్యము పలకడమూ, తపము, అహింస, జ్ఞానము మొదలగు సాత్విక గుణములు నా స్వరూపాలు.
ఆలాగే కోరికలూ, కోపం, ద్వేషం, అసూయ, తామసము, అజ్ఞానం అన్నీ నేనే.
ఈ జగత్తులో కనిపించునదీ, కనిపించనిదీ అంతా నేనే.
ధర్మానికి హాని కలిగి అధర్మం పెరిగినప్పుడు కృరాత్ములు, రాక్షస ప్రవృత్తి కలిగిన వారు విజృంభించి ధర్మాత్ములు, సజ్జనులు హీనత పొందినప్పుడు నేను వారి ఇండ్లలో జన్మించి ధర్మమును నిలుపుతాను.
నేను కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలలో వరుసగా శ్వేత, రక్త, నీల, పసుపు వర్ణాలతో చరిస్తూ ధర్మ స్థాపన చేస్తాను.
ఆ కాలచక్రాన్ని నేను అవిశ్రాంతంగా నడుపుతాను. లయ కాలమందు నేను కాల యముడినై నాలో లీనం చేసుకుంటాను.
ముల్లోకాలను సృష్టించు బ్రహ్మదేవుడు నాలో సగభాగమే.
నా పేరు నారాయణుడు. నేను శంఖ చక్ర గధా ధారినై బాలుని రూపంలో ప్రళయకాల మందు వేయి సంవత్సరాలు యోగ నిద్రలో ఉంటాను.
ఈ కల్పాంతం చూసి నీవు భయపడతావని నా ఉదరంలో ఉంచాను.
ఇక నీ ఇచ్చ వచ్చిన చోటికి వెళ్ళవచ్చు.
ఇక బ్రహ్మదేవుడు మేలుకుని ఈ లోకాలను సృష్టిస్తాడు" అని చెప్పి బాలకుడు మాయం అయ్యాడు.
ఇది నేను కనులార చూసినాను.
"ఆ బాలుడే శ్రీకృష్ణుని రూపంలో మీకు సఖుడై ఉన్నాడు.
ఈనాడు నన్ను దయతలచి నాకు దర్శనం ఇచ్చాడు.
ఈ మహానుభావుని దర్శనం వలన నేను గతస్మృతులు గుర్తుకు వచ్చి మీకు చెప్పగలిగాను" మార్కండేయుడు ధర్మరాజుకు తనకు నారాయణుడు వివరించిన విషయాలు చెప్పాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment