💥అహోబిలేశ్వరా! నమో నమః...

 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః 🌹🙏

🏵️🌼🌷🏵️🌼🌷🏵️🌼🌷


💥అహోబిలేశ్వరా! నమో నమః...


లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం

పక్షీంద్రశైలభవనం భవనాశమీశం |

గోక్షీరసార ఘనసారపటీరవర్ణం

వందే కృపానిధిమహోబలనారసింహం ||


🌹తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఆదిశేషుని ఆకృతిలో గల పర్వత పంక్తిలోని మధ్య ప్రదేశం #అహోబిలం. 


దీనికి అహోబలం, అహోబిలం, అహోబిలగిరి, ఓబులం, దిగువ తిరుపతి, గరుడాద్రి, వీరక్షేత్రం, నగరి, నిధి, తక్ష్యాద్రి, నరసింహతీర్థం, గరుడాచలం తదితర పేర్లు ఉన్నా ‘అహోబిలం’ పేరే ప్రాచుర్యం లోకి వచ్చింది. 


హిరణ్యకశిపుని సంహరణకు శ్రీహరి స్తంభం నుంచి ఉద్భవించగా పేరెన్నిక గన్నదే శ్రీ ఉగ్ర నరసింహక్షేత్రం అహోబిలం.


స్తంభోద్భవుడు (నృసింహుడు) ఒక పాదం అహోబిలంలో, మరో పాదం పెన్నాహోబిలంలో మోపి హిరణ్యకశిపుడిని సంహరించాడని జనశ్రుతి. 


అసుర సంహారం తరువాత స్వామి  అహోబిలంలోని ‘రక్తకుండం’లో చేతులు కడుక్కున్నారని చెబుతారు.


మహోగ్ర నరసింహమూర్తిని వీక్షించి భీతాశ్చార్యాలకు లోనైన బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలు, గంధర్వ, యక్ష కిన్నెర, కింపురుషులు, ప్రజాపతులు, ఋషులు తదితరులు..


"అహో వీర్యం అహో శౌర్యం అహో బాహు పరాక్రమంః/

నారసింహం పరందైవం అహోబలం అహోబలం"

అని శ్లాఘించారట.

కాలక్రమంలో అది ‘అహోబిలం’గా మారిందంటారు.


🌹గరుత్మంతుడి ఘోర తపస్సుకు ప్రసన్నుడైన నరసింహుడు గుహ(బిలం)లో దర్శనమివ్వడంతో ‘అహోబిలం’ అనే పేరు వచ్చిందని మరో కథనం ప్రచారంలో ఉంది.


స్వామి వారి సాక్షాత్కారంతో సంతోషాతిశయంతో పక్షిరాజు "అహోబిలం మహాబలం"

(అహోబల క్షేత్రం మనలను మహాబలవంతులను చేస్తుంది) అన్నాడనీ కథనం.


ఈ నవనారసింహ క్షేత్రంలో ఎగువ అహోబిలంలో చెంచులక్ష్మీ సమేత ఉగ్రనరసింహ, దిగువన ప్రహ్లాద వరద శ్రీ అమృతవల్లి నరసింహుడిగా స్వామి దర్శనమిస్తున్నారు.


‘అహోబలేశుడు’గా పూజలందుకునే స్వామి జన సామాన్యంలో ‘ఓబులేశు’గా మారాడు.


మహా బలపరాక్రమాలతో స్వామి బిలం (గుహ)లో దర్శనం ఇవ్వడం వలన ఈ క్షేత్రానికి ‘అహోబలం, ‘అహోబిలం’ అనే పేర్లు వచ్చాయని ప్రతీతి.


పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరు (ఎనిమిదవ శతాబ్దానికి చెందిన) "తిరుమంగై ఆళ్వార్‌" ఈ ‌క్షేత్రాన్ని "సింగవేల్‌ ‌కుండ్రమ్‌" అన్నారు.

తమిళులు నేటికీ ఇలాగే వ్యవహరిస్తారు.


🌹కానుగ వృక్షం కింద కొలువై ఉన్నందున "కారంజ నరసింహుడు" అని పేరు వ్యవహరిస్తారు.


తమ ఆడపడుచు చెంచులక్ష్మిని మనువాడడం ద్వారా నరసింహుడు తమ అల్లుడయ్యాడన్నది ఈ ప్రాంతం (నల్లమల) చెంచుల ప్రగాఢ విశ్వాసం. 


గిరిజనులు స్వామి వారికి జుంటు తేనె, అడవి మాంసం నైవేద్యంగా పెట్టేవారట.


దివిజ గంగ ‘భవనాశిని’గా భువికి దిగి వచ్చి నృసింహుని పాదాలు కడుగుతూ ప్రవహిస్తోంది.

ఇది భవరోగాలకు దివ్యౌషధమని విశ్వాసం. 


దీనిద్వారా సకల పుణ్యాలు సమకూరు తాయని సాక్షాత్తు స్వామివారే అనుగ్రహించారని పురాణ వాక్కు.


ఈ క్షేత్రాన్ని పురాణపురుషులు పరశురామ, రామలక్ష్మణులు, బలరామ శ్రీకృష్ణార్జునులు, త్రిమతా చార్యులు శంకర, రామానుజ మధ్వాచార్యులు సందర్శించి స్వామిని అర్చించారని ఐతిహ్యం. 


విశిష్టాద్వైత స్థాపకులు రామానుజాచార్యులు, అనంతర కాలంలో వేదాంత దేవికులు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఈ స్వామి ఘనతను తమ సంకీర్తనలలో కీర్తించారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥