💥ఉగ్రం వీరం.. లక్ష్మీ వల్లభం!
⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మినృసింహ స్వామినే నమః 🌹🙏
💥ఉగ్రం వీరం.. లక్ష్మీ వల్లభం!
సమయాసమయాలు లేవు.
స్థల ఔచిత్య నియమాలు అంతకన్నా లేవు.
దివాసంధ్యల ప్రస్తావన లేదు.
ఉన్నదల్లా ఒక్కటే...
ప్రహ్లాదుడి అణువణువులో నిండిన నారాయణుని భక్తి.
అనంతమైన ప్రకృతిలో నిండిన పరమాత్మను దర్శించిన ప్రహ్లాదుడికి మాత్రమే తెలుసు భగవంతుడు సర్వవ్యాపి అని!
తాను పిలిస్తే దైవం వస్తాడని అతడి నమ్మిక.
అందుకే, స్తంభాన్ని చీల్చుకుని ఉగ్రనారసింహుడు ఆవిర్భవించాడు.
క్షణాల్లో క్రోధాన్ని ఆవహింపజేసుకుని, తమో గుణ ప్రధాన రూపమై, తానే రుద్రుడై శ్రీహరి నరసింహుడిగా వచ్చాడు.
ఆగ్రహం, అనుగ్రహం ఒకే సమయంలో ప్రకటించగల మూర్తి "#నరసింహస్వామి"
🌹నరసింహావతారంలోని మరొక విశిష్టత – ఇది శివ, విష్ణు అంశల కలయిక.
స్థితి కారుడైన విష్ణువు నర రూపం, లయకారుడైన శివుడి సింహ స్వరూపం రెండూ కలిసి నరసింహ స్వరూపంగా ఆవిర్భవించాయి.
విష్ణుమూర్తి సర్వాంతర్యామిత్వాన్ని నరసింహావతారం చాటి చెబుతుంది. ఇదే పరమాత్మ అంతర్యామిత్వం, విష్ణుతత్వం కూడా.
🌹శత్రుత్వాన్ని వహించిన వాడైనప్పటికీ హిరణ్యకశిపుడు నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూనే ఉంటాడు.
భక్తుడైన ప్రహ్లాదుడి దృష్టి మరొక వస్తువు మీద కొన్ని క్షణాల పాటు ఉంటుందేమో కానీ, హిరణ్యకశిపుని చిత్తం మాత్రం నిరంతరం విష్ణుద్వేషంతో నిండి ఉండేది.
ఫలితంగా నరసింహుడి చేతిలో హిరణ్యకశిపుడు అంతమయ్యాడు. లౌకిక దేహాన్ని వదిలిన హిరణ్యకశిపుడు స్వర్గలోకాన్ని చేరుకుంటాడు.
ఆశ్చర్యం అనిపించకమానదు.
ద్వేషించినవాడికి సైతం మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహమూర్తి "నరసింహస్వామి" అని ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది.
శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే ।
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥
🌹ఉగ్రమూర్తి అయినప్పటికీ నరసింహస్వామి పూర్తిగా కరుణాంతరంగుడు.
కన్నతండ్రి బిడ్డను అదిలించేటప్పుడు ఎలా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తాడో, పరమాత్మ కూడా అంతే!
ఆ ఉగ్రమూర్తిలోని శాంతమూర్తిని ఉపాసన చేస్తే శుభపరంపరలే కలుగుతాయి.
నరసింహ ఉపాసన ద్వారా అరిషడ్వర్గాలు అదుపులోకి వస్తాయి. ఇందుకు తగిన మానసిక శక్తి, అంతులేని ధైర్యం ఫలితాలుగా అందుతాయి.
🌹మృగస్వభావం ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. అయితే అది పరిధి దాటకూడదు. అలాకాకుండా, మృగస్వభావం మితిమీరితే ప్రతి మనిషీ హిరణ్యకశిపుడే అవుతాడు.
అప్పుడు భగవంతుడి అంశ దానిని తప్పకుండా సంహరిస్తుంది.
నరసింహావతారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం
🌹కొండల్లో వెలిసిన ఉగ్రమూర్తి కల్యాణం వేళకు ముసిముసి నవ్వులతో సిద్ధమవుతాడు.
ఉగ్ర తత్వం, వీరత్వంతో ఊగిపోయే వాడు కాస్తా అలివేణి చిటికెన వేలు పట్టుకోగానే లక్ష్మీవల్లభుడై పొంగిపోతాడు.
లక్ష్మీనారాయణుడే లక్ష్మీనరసింహుడు.
ఉగ్ర నరసింహుడే లక్ష్మీవల్లభుడు.
రూపం మాత్రమే వేరు... తత్వం మాత్రం ఒకటే!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment