మానవ పరిణామ క్రమంలో అసంపూర్ణమైన (సగం మానవా కారం, సగం సింహాకారం) మానవ రూపంతో కనిపించే మొట్టమొదటి అవతారమే "నరసింహావతారం"
⚜️🕉️🚩ఓం లక్ష్మీనృసింహాయ నమః🌹🙏
అంధస్యమే హృతవివేక మహాధనస్య
చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||
💥తాత్పర్యము:
ఓ ప్రభూ! ఇంద్రియములనే చోరులు నా వివేకమును
దొంగిలించుట వలన నేను అంధుడ నైతిని.
అంధుడనైన నేను మోహమనే కూపములో పడి
కొట్టుకుంటున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ
కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.
🍁🍁🍁🍁🍁
💥ప్రార్ధన శ్లోకం:
సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్ |
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే ||
🔸🔹🔸🔹🔸
💥నరసింహావతారం
మానవ పరిణామ క్రమంలో అసంపూర్ణమైన (సగం మానవా కారం, సగం సింహాకారం) మానవ రూపంతో కనిపించే మొట్టమొదటి అవతారమే "నరసింహావతారం"
💥ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా...
ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు.
రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు.
ఆందుకు ప్రహ్లాదుడు -
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ చనునె తరంగిణులకు?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల సేరునే కుటజములకు?
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల?
విష్ణు భక్తి నాకు దైవయోగం వల్ల సహజంగా సంభవించింది... అని జవాబిచ్చాడు.
💥ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా
కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్?
- అన్నాడు ప్రహ్లాదుడు.
ఇంకా -
"చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు.
అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు.
"బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు.
నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు.
"సరే.. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.
శ్రీనృసింహదేవుడు స్తంభమునుండి ఆవిర్భవించాడు.
భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తన యొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.
💥ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)
నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తన తొడ పైన హిరణ్యకశిపుని సంహరించాడు.
బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.
💥నరసింహావతారంలో రెండు భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి.
నృసింహుడు హిరణ్యకశిపుని పాలిట ఉగ్రుడై కనిపిస్తే, అదే రూపం ప్రహ్లాదునిపై దయారసాన్ని కురిపించింది.
హిరణ్యకశిపుడు భయభ్రాంతుడైతే, అదే రూపాన్ని దర్శించిన ప్రహ్లాదుడు భక్తి రసాంబుధిలో ఓలాలాడాడు.
💥హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వీరిద్దరిలో ఎవరు ధైర్యవంతులు?
భుజబలం ఉన్నప్పటికీ మానసిక శక్తులు లేని హిరణ్యకశిపుని కన్నా, బాలుడైనా ఆత్మశక్తి ద్వారా సంపాదించిన భక్తి బలంతో ప్రహ్లాదుడు ఉగ్రభీకర నృసింహ స్వరూపాన్ని చూసి భయపడలేదు.
అలాగే హిరణ్యకశిపుడు కోరిన కోర్కెలు విషయవాంఛలు. విషయ వాంఛలపై ఎంతగా ప్రలోభపడినా చివరికి ఏదో ఒక రూపంలో అవి మనల్ని కాటేయక మానవు.
సంప్రదాయంలో నారసింహస్వామి విజయాన్ని అందించే వేల్పుగా ఖ్యాతి వహించాడు.
రాజ్యలక్ష్మి సమేతుడై శత్రు భయంకరుడై, ఆర్తుల ఆర్తిని పోగొట్టే ఆర్తత్రాణ పరాయణుడు.
నియమపూర్వకమైన సాధనల ద్వారా యౌగిక స్తంభాన్ని చేధిస్తే మాత్రమే మన హృదయంలో ఆవిర్భవించే విజ్ఞాన స్వరూపుడు.
అహంకారంతో, ప్రలోభాలతో శరీరాకృతిలో మనల్ని పీడించే భవబాధలను వివేకమనే నఖాగ్రాలతో చీల్చి ఉపశమంపచేసే వాత్సల్య స్వరూపుడు.
💥అందుకే ఆది శంకరాచార్యులు -
సంసార సాగర విశాల కరాళకాల
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
వ్యగ్రస్య రాగరసనోర్మిని పీడితస్య
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం!!
అని లక్ష్మీనృసింహుని సంసారం నుంచి విముక్తి కలింగించే ఆపద్బాంధవునిగా కొనియాడారు.
నరసింహుని వీరత్వంగానీ, వాత్సల్యం కానీ, విరాట్ రూపంగానీ సామాన్యమైనవి కాదు. వర్ణనాతీతమైనవి.
ప్రహ్లాదుడంటేనే లోకానికి ఆహ్లాదం కలిగించేవాడు.
ఆ ప్రహ్లాదునికే ఆహ్లాదంకలిగించిన నృసింహుడు
ప్రహ్లాదహ్లాదుడై, ప్రహ్లాద భక్త వరదుడై, కరుణా సముద్రుడయ్యాడు.
నృసింహ నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు – సర్వారిష్టాలు, భయభ్రాంతులు, ఈతిబాధలు, శారీరక రోగాలు పటాపంచలై పోతాయని ఎందరో విశ్వసిస్తారు.
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం🌹🙏
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment