💥ఈషణ త్రయం - వినాశ కారణం💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱


💥ఈషణ త్రయం - వినాశ కారణం💥


ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనమ్‌

ప్రత్యా యంతి గతా: పునర్నదివసా: కాలో జగద్భక్షక:

లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం

తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధున


💥మనం చూస్తూ ఉండగానే ప్రతిదినమూ మన యవ్వనము, ఆయుష్షు నశించిపోతూ ఉన్నాయి. గడచిన రోజులు తిరిగిరావు. కాలం జగత్తునే భక్షించి వేస్తూ ఉంది. సంపద నీటి అలల వలె అతి చంచలమైంది. కనుక ఓ పరమేశ్వరా! నాపై కరుణ చూపి, నీకు శరణాగతుడనైన నన్ను నీవు ఇప్పుడే కాపాడు...

అంటూ "శివాపరాధ క్షమాపణ స్తోత్రం" లో ఆదిశంకరాచార్యులవారు ఆ పరమేశ్వరుని ప్రార్థించారు.


ఆ మిషతో బుద్బుదప్రాయమైన మన జీవితాన్ని గురించి బోధ చేశారు.

అటువంటి బోధల ద్వారా, పై విషయం మనందరకూ తెలిసిందే అయినా, అజ్ఞానపు పొరలు క్రమ్మి ఉన్నంత వరకు, అహంకార మమకారాలు మనల్ని వీడనంత వరకు, మనకు పరమార్థమైన సత్యం బోధ పడదని నొక్కి చెప్పారు.


🌹"శ్రీకాళహస్తీశ్వర శతకం"లో "ధూర్జటి" మహాకవి ఇలా చెప్పారు.


అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌటె రింగిన్‌ సదా

కాంతల్పుత్రులు నర్థము న్‌ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతిన్‌ చెంది చరించుగాని పరమార్థంబైన నీయందు తా

చింతాకంత యు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!”


💥ఓ కాళహస్తీశ్వర స్వామీ, ఈ ప్రపంచమంతా మాయ అని తెలిసిన తర్వాత కూడా మనుషులు నిరంతరం స్త్రీ, పుత్ర, ధన, శరీర వ్యామోహాలలో చిక్కుకొని, వాటిని శాశ్వతాలని భావించి, పరమార్థమైన నీపై చింతాకంత ధ్యాస కూడా పెట్టరు కదా! ఇదెంత అవివేకము? అని భావము. 


పై పద్యంలో ధూర్జటి కవి చెప్పిన స్త్రీ, పుత్ర, ధన, శరీర వ్యామోహాలు మమకార జనితాలు.

నాది, నావి అనుకొని వాటి పై అతి మోహాన్ని పెంచుకోవడమే మమకారం.


శరీర వ్యామోహం అహంకారం. ఈ శరీరమే నేను. ఈ రూపం, అందచందాలు, జవసత్వాలు నా సొంతం. నేను సాధించలేనిది ఏదిలేదు అనుకోవడమే అహంకారం.


అహంకార మమకారాల వలన మనసును అజ్ఞానమనే పొరలు కప్పి వేసి, జ్ఞాన చైతన్యాన్ని కలుగనీయవు.


🌹స్త్రీ, ధన, పుత్ర వ్యామోహములనే మూడింటినీ "ఈషణ త్రయం" అని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్నారు.

ఈషణ అంటే కోరిక, వ్యామోహం.


దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే మూడు రకాలైన మోహాలతో మానవులు పీడించబడుతూ, కర్మ బంధితులై ఉంటారు.

వాటి కోసం ఎలాంటి తప్పుడు పనులు చేయడానికైనా సాహసిస్తారు.

తాను తనవిగా భావించిన దారా, పుత్ర, ధన, శరీరాలు తన వెంట రావని గ్రహంప లేరు.


ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే , నారీ గృహ ద్వారి, జన:శ్మశానే

దేహాశ్చితాయాం, పర లోక మార్గే కర్మానుగ: గచ్ఛతి జీవ యేక:


💥మానవుడు మరణించినప్పుడు అతడు సంపాదించిన ధనం దాచి ఉంచిన చోటే ఉండి పోతుంది.

తాను పెంచుకొన్న పశువులు చావడిలోనే ఉండిపోతాయి.

తాను అమితంగా ప్రేమించిన భార్య ఇంటి గుమ్మం వరకే వెంట వస్తుంది.

కొడుకులు శ్మశానం వరకే వస్తారు.

తనదనుకొన్న శరీరం చితిపై కాలి బూడిద అయిపోతుంది.

మరి తనతోబాటు పరలోకానికి ప్రయాణించేది తాను ఆచరించిన ధర్మం లేదా అధర్మం మాత్రమే.

కనుక వ్యామోహాల్ని వదలాలని పై శ్లోకం చెబుతోంది.


ఈ వ్యామోహం ఊబిలో చిక్కుకొని సర్వనాశనం కొని తెచ్చుకొనిన వారెందరో ఉన్నారు.


🌹#దారేషణ


రావణుని స్త్రీ వ్యామోహం అతని వివేకాన్ని, వైభవాన్ని, అతని వంశాన్ని, అతని సర్వస్వాన్ని నశింపచేసి ఉండటం మనకు తెలిసినదే.

తన భార్యపైగానీ, పరస్త్రీలపైగానీ మితి మీరిన కోరిక అనర్థహతువు.


శివ భారత కావ్యంలో మహాకవి గడియారం వేంకటశేషశాస్త్రిగారు ఛత్రపతి శివాజీ నోట ఇలా పలికించారు.


అనల జ్యోతులనీ పతివ్రతల పాపాచారులై డాయు భూ

జనులెల్లన్‌ నిజసంపదల్‌ దొరగి యస్తధ్వస్తులైపోరె? వి

త్తనమే నిల్చునె? మున్నెరుంగమె పులస్త్య బ్రహ్మ సంతానమో

జననీ!హందవభూమినీ పగిది దుశ్చారిత్రము ల్‌ సాగునే?


విజయోత్సాహంతో, శత్రు దేశపు రాణివాసాన్ని, తన సేనాధి పతి అయిన అబ్బాజీ సోన్‌ దేవుడు, బంధించి తెచ్చిన సందర్భంలో, ఆ ముసల్మాను రాణితో, తమను క్షమించమని కోరుతూ శివాజి చెప్పిన పద్యమిది.


💥"అగ్ని కీలలవంటి సాధ్వీమణులను పాప చింతనతో తాకిన వారెవరైనా సర్వ సంపదలనూ కోల్పోయి, పతనమైపోతారు కదా! మనకు రావణాసురుని ఉదంతమే ఇందుకు ఉదాహరణ కదా! మన దేశ సంస్కృతిలో ఇలాంటి దురాగతాలకు తావులేదు" అంటూ,


ఆ యువరాణిని మాతృసమానురాలిగా గౌరవించి సకల సత్కారాలతో, క్షేమంగా, ఆమె భర్త వద్దకు చేరుస్తాడు శివాజి.


అది మన భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యము.


🌹ఇక రెండవది #ధనేషణ.


ధనం పరిమితంగా, మన అవసరాలకు తగినంత ఉంటే చాలు.


కబీర్‌దాస్‌ ఇలా ప్రార్థించాడు.


"సాయీ, ఇత్‌ నా దీజియే, సామే కుటుంబ్‌ సమాయ్‌

మై భీ భూకా నరహూ, సాధూ నభూకా జాయ్‌!”


ఓ దేవా, నేను, నా కుటుంబము, నా ఇంటికి వచ్చిన అతిథులు, ఆకలి తీర్చుకోగలిగినంత మాత్రం సంపద నాకు ఇవ్వుము” అని.


ధనేషణ చాలా చెడ్డది. ధనం కూడే కొద్దీ ఆశలు పెరిగిపోతూనే ఉంటాయి. ఆ ఆశలనే గుర్రాలకు కళ్ళెం వేయకుంటే అవి మనలను పతనమనే గోతిలో పడదోయక మానవు.


🌹ఈషణ త్రయంలో చివరిది #పుత్రేషణ.


పుత్రుల కోసం పలవరించి, పుత్రకామేష్ఠి యాగం చేసి, నలుగురు కొడుకులను పొందిన దశరథ మహారాజు తన అంత్యకాలంలో ఏ కొడుకూ తన దగ్గరలేని స్థితిలో మరణించాడు.


పుత్ర వ్యామోహంతో తన కొడుకుల ఆగడాలకు కళ్ళెం వేయలేక ధృతరాష్ట్రుడు దుర్గతిని పొందాడు. తన వంశాన్ని నిర్వంశం చేసుకొన్నాడు.


ధూర్జటి కవి చెప్పినట్లు...


కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకుల్‌ జీవన భ్రాంతులై

కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రు న కనేకుల్‌? వారిచే నేగతిల్‌

వడసెన్‌? పుత్రులు లేని ఆ శుకునకున్‌ పాటిల్లె నే దుర్గతుల్‌?

చెడునే మోక్ష పదంబ పుత్రకునకున్‌? శ్రీకాళహస్తీశ్వరా!

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు