💥మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరషష్ఠి.

 ⚜️🕉🚩ఓం శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏


💥శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం:


షణ్ముఖం పార్వతీపుత్రం

క్రౌంచశైల విమర్దనం

దేవసేనాపతిం దేవం

స్కందం వందే శివాత్మజం

తారకాసుర హంతారం

మయూరాసన సంస్థితం

శక్తిపాణిం చ దేవేశం

స్కందం వందే శివాత్మజం

💥💥💥💥💥


నమస్తే నమస్తే మహాశక్తి పాణే |

నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||

నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |

నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||


ఒక చేతిలో మహాశక్తి అయుదాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు.


💥మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరషష్ఠి.


లోక సంరక్షణార్ధం పరమశివుని తేజస్సు నుంచి సుబ్రహ్మణ్యస్వామి వారు అవతరించిన రోజే "సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి"


దీనినే "స్కందషష్ఠి" అని, "సుబ్బారాయషష్ఠి" అని కూడా అంటారు.


🍁🍁🍁🍁🍁


💥పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులను చేసి పీడిస్తున్న "తారకాసురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు.


అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు.

ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు

కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు.


కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. 

వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు.


దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు.

ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు.

అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు.


దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు.

ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది.

ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు.

ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు.


ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.


ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని,

షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తీకేయుడని,

అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు.


కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా,

ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.


అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.


💥దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు.


💥వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణమును చూసిన వారికి వివాహములలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి.

అంతేకాక సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది.


విశేషించి షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి పాలకావడి (పంచదారతో, పాలతో నిండి ఉండే కుండలు)ని అర్పించినవారికి వంశవృద్ది కలుగునని విశ్వాసం.


💥ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం.

అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.


💥సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు. 


బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.


తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు.


"శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.


💥అక్షౌహిణుల సైన్యాన్ని, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి వారిని ఉక్కిరిబిక్కిరి చేసి, భీకరయుద్దము చేసి తారకాశురుని సంహరించాడు కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సంతానం కోసం, శత్రు విజయాల కోసం సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి సమర్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.

సేకరణ... 💐🙏

⚜️🕉⚜️🕉⚜️🕉⚜️🕉⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు