యమళార్జున భంజనము ⚜️🕉️🚩 ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః🌹🙏
చిక్కఁడు సిరికౌగిటిలోఁ
జిక్కఁడు సనకాది యోగిచిత్తాబ్జములం
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్
💥భావం:
ఆయన లక్ష్మీదేవి కౌగిలించుకుందామనుకుంటే ఆమె కౌగిలికి దొరకని వాడు, సనక సనందనాది మహర్షుల మనస్సులకు చిక్కనివాడు, వేదమంత్రములకు దొరకని వాడు, ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడినాడు.
💥ఉలూఖల బంధనము:
.
💥యశోద ఎంత అదృష్టవంతురాలో.
ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు.
అపుడు ఆమె కృష్ణుడిని కట్టెయ్యడం కోసమని తాడుకోసం వెడుతోంది.
అక్కడ కవ్వమునకు అంతకు ముందు పెట్టి తిప్పిన తాళ్ళు ఉన్నాయి.
వాటిని తీసి బొజ్జ చుట్టూ తిప్పుతోంది.
తిప్పితే రెండు అంగుళములు తక్కువ వస్తోంది.
ఎన్ని తాడులు ముడివేసి కడదామనుకున్నా ఎప్పుడూ రెండు అంగుళములు తక్కువ వస్తోంది.
💥రెండు అంగుళముల తాడు తక్కువ అవడం అంటే ఏమిటి?
భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామో మరిచిపోవాలి.
నా స్వామికి యిది చేయకుండా
నేను ఎలా ఉండగలను? అనే భావన పెరగాలి.
ఒక ప్రయోజనమును ఆశించి చేస్తున్నాను,
నేను ఈ పూజను చేస్తున్నాను అను ఈ రెండు భావనలను మరచి పోవడమే తాడు రెండు అంగుళములు తక్కువ అవుతున్నదనే విషయమును మరిచిపోవడం.
కేవలము భక్తి చేత పరమాత్మ వశుడు అవుతాడు.
💥యమళార్జున భంజనము:
యశోదాదేవి కృష్ణుని తీసుకు వెళ్ళి రోటికి కట్టేసింది.
కర్మపాశముల చేత లోకముల నన్నిటిని కట్టగలిగిన పరమాత్మ, తాను ఆ కట్టు విప్పుకోలేని వాడిలా నటిస్తూ పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు
రోటికి కట్టివేయబడిన పరమాత్మ నెమ్మదిగా రాతిని ఈడ్చుకుంటూ పాకుతున్నాడు.
ఆ ఇంటి ప్రాంగణంలో రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి.
రెండు మద్దిచెట్ల మధ్య నుంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు.
ఈడుస్తున్న రోలు అడ్డం తిరిగింది.
అది రెండు మద్ది చెట్లకి అడ్డుపడింది.
కృష్ణుడు రాతిని ముందుకు లాగాడు.
ఆ రెండు మద్ది చెట్లు ఫెళఫెళమనే పెద్ద ధ్వనులతో పక్కకి పడిపోయాయి.
ఆ రెండు వృక్షముల నుంచి మహాపురుషులు ఇద్దరు ఆవిర్భవించారు.
💥వారు యక్షులు. వాళ్ళ పేర్లు #నలకూబర #మణిగ్రీవులు. కుబేరుని కుమారులు.
నలకూబర మణిగ్రీవులు ఒకనాడు ఆకాశగంగలో దిగంబరంగా స్నానం చేస్తున్నారు.
వారితో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు.
ఆకాశ మార్గమున నారద మహర్షి వెళ్తున్నారు.
గంధర్వకాంతలు నారదమహర్షికి నమస్కరించారు. నలకూబరమణిగ్రీవులు మాత్రం నారద మహర్షికి కనీసం నమస్కారం కూడా చేయలేదు.
💥పెద్దల పట్ల అవిధేయత మంచి పధ్ధతి కాదు.
అంత అవిధేయతతో నిలబడ్డ వారిని చూసి నారదుడు మనస్సులో...
వీళ్ళకి కలవారి సుతులం అనే అహంకారం వచ్చింది.
ఈ సంపాదన వీరి తండ్రిది.
వీరు ఈవేళ మదోన్మత్తులై ఉన్నారు.
తండ్రి గుణముల యందు వీరికి వారసత్వం లేదు అనుకుని వారితో...
"మీరు కోట్ల సంపదకు పడగలెత్తిన కుబేరుని కుమారులు. మీకు బట్ట కట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు. కాబట్టి అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి మీరు నూరు దివ్య సంవత్సరముల పాటు #యమళార్జునము లనే పేర్లతో మద్ది చెట్లయి నందవ్రజమునందు పడి యుండెదరు గాక!" అని శపించాడు.
💥వారు నారదుని కాళ్ళమీద పడ్డారు. ఆయన...
ఇపుడు మీకు పట్టిన మదం ఇంకెన్నడూ మీ తలలకు ఎక్కకూడదు. అలా చేయగలిగిన శక్తి ముకుంద పాదారవిందముల నుండి స్రవించే రజస్సుకు మాత్రమే ఉంది. భగవంతుని పాదములను చూడగానే ఆయన పాదములకు తగిలేటట్లుగా శిరస్సు వంచి నమస్కరించాలి.
ఆ పాదరేణువులు తలమీద పడాలి.
భాగవతుల పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉండే శక్తి చేరి ఉంటుంది. ఆ పాదధూళి వారి తలమీద పడగానే వారు పుణ్యతీర్థములలో స్నానం చేసినంతటి ఫలితమును పొందుతారు.
అదే వారి పుణ్యమునకు, ఐశ్వర్యమునకు, వారి అభివృద్ధికి హేతువు అవుతుంది. అందుకు
మీరు నందవ్రజంలో మద్ది చెట్లయి పుట్టండి.
కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదములనుండి స్రవించిన పరాగము మీ మీద పడుతుంది. అపుడు చెట్ల రూపంలో వున్న మీరు చెట్ల శరీరమును వదులుతారు.
నారాయణ భక్తులు అవుతారు. అపారమయిన ఐశ్వర్యముతో ఉంటారు. మరల యథా రూపమును పొంది మీ యక్ష లోకమునకు చేరుకుంటారు. చేరుకొని మీ సంపత్తిని మీ సౌఖ్యమును పొందుతారు" అని అనుగ్రహించాడు.
సేకరణ... పూజ్యశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి
ప్రవచనముల నుండి💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment