💥ఆది దంపతులు💥
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
నమో గౌరీశాయ స్ఫటిక దవళాజ్గాయచ నమో
నమో లోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః |
నమః శ్రీ కంఠాయ క్షపితపురదైత్యాయ చ నమః
నమః పాలక్షాయ స్మరమదవినాశాయ చ నమః ||
💥గౌరీశ్వరునికి నమస్కారం.
స్ఫటికంలా శుద్ధ ధవళకాంతులతో దీపించే లోకేశునికి,
దేవతా సమూహంచే స్తుతింపబడేవానికి,
శ్రీ (విషం) కంఠంలో ధరించినవానికి,
త్రిపురాసురులను నిర్మూలనం చేసినవానికి,
ఫాలభాగాన నేత్రంగల జ్ఞానమూర్తికి,
మన్మథుని మదాన్ని వినాశనం చేసిన శివునికి నమస్మృతులు.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹
💥ఆది దంపతులు💥
శివపార్వతులు ఆది దంపతులు.
పార్వతీ దేవి హిమవంతుని కూతురు.
కలిగిన వారింట పుట్టిన పిల్ల.
బాల్యంలో భోగ భాగ్యాలు అనుభవించింది.
జంగ మయ్యను చేరాక అదంతా మటు మాయమైపోతుంది.
కపాలం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ అంటూ ఊరంతా తిరుగుతుంటారు భర్తగారు.
వల్లకాడులో సంసారం నడపమంటాడు.
రూపం కూడా ఎగుడు దిగుడు నేత్రాలతో ఉంటుంది.
అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు.
తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకల మీదికి తెచ్చుకుంటాడు శివుడు.
అయినా ఆయనను పల్లెత్తుమాటయినా అనని
మహాఇల్లాలు పార్వతి.
ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను తనవాడిగా చేసుకుంది.
గంగమ్మను తెచ్చి సిగలో తురుముకున్నా, లోకం కోసమే పెనిమిటి ఈ పని చేశాడని అర్థం చేసుకోగలిగింది.
భృంగి వంటి సేవకులకు తనకంటే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న సమయాలు ఎదురైనా మరోలా అనుకోలేదు. ఉడుక్కోలేదు.
నమ్ముకున్న వారిని నట్టేట ముంచని ఆయన వర్తనను గర్వంగా చెప్పుకుంది.
💥క్షీరసాగరమథనం వేళ అమృతం పుడితే ఎవరో తాగుతారట. కామధేనువు, కల్పతరువు బయల్పడితే ఇంకెవరో తీసుకుని సుఖిస్తారట.
కాలకూటం వెలువడినప్పుడు ఎవరూ పట్టించుకోరట.
తన భర్తే దానికి ఎదురేగి తటాలున మింగేయాలట.
కట్టుకున్నవాడు చేస్తున్న పని ప్రపంచానికి మేలు చేసేదయినప్పుడు తన పసుపు కుంకుమలకు ఢోకా ఉండదన్న ధైర్యం ఆమెది.
లయకారకుడయిన పతిని ఏ విషమయినా ఏం చేయగలుగుతుందని తనకు తనే సమాధానం చెప్పుకుంటుంది.
తను #సర్వమంగళ అయినప్పుడు చింత ఎందుకని సంభాళించుకుంటుంది.
శివుడు నిశ్చలంగా విషాన్ని సేవిస్తుంటే పక్కన అంతకంటే నిశ్చింతగా నిలవగలుగుతుంది.
స్థాణువులాంటి భర్తను రాగమయునిగా, అనురాగమయునిగా చేయగలుగుతుంది.
💥శంకరుడు కూడా ఏ సందర్భంలోనూ పత్నికి అడ్డుచెప్పిందే లేదు.
ఆమె నిర్ణయాలను ప్రశ్నించనూ లేదు.
తనకేమీ ఆశలు లేకపోయినా, తనలో సగపాలయిన పార్వతీదేవికి ఉండవచ్చనేది ఆయన మాట, బాట.
ఆమె స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఆమెవే అనుకునేవాడు.
తనలో సగభాగాన్ని అర్థాంగి కిచ్చానంటూ ఈశ్వరుడెప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. సహజంగా, స్వతంత్రంగా ఆయన దేహంలో ఆమె కలిసిపోయింది.
అలా ఆమె కలవడానికి అనువుగా మనసా వాచా కర్మణా తనను తాను మార్చుకో గలిగాడు.
సతికి అంతగా విలువనిచ్చే పతి శివుడు.
ఇంకా చెప్పాలంటే. ప్రదోషవేళలో నటరాజుగా నృత్యకేళీ విలాసాల్లో తేలుతున్నప్పుడూ శంకరుడు ఒంటరి కాదు. తానొక్కడే ఆడిపాడి ఆనందించడు.
పార్వతితో కలిసే నర్తిస్తూ మహదానంద భరితుడవుతాడు.
భార్యను తనతో కలిసి నృత్యం చేసేందుకు అంగీకరించిన అరుదైన ప్రేమస్వామి ఆయనే.
ఆ ఆటను చిత్కళగా భావించి గౌరవిస్తాడు.
అర్ధనారీశ్వర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఈ నిప్పుకంటి దైవానికి మించిన మహిళావాది ఎవరుంటారు!
ఈశ్వరుడు జడధారిగా, తోలుదుస్తులతో నడయాడినా అమ్మవారు ఎప్పుడూ అలా ఉండదు.
మహారాణిలా ఉంటుంది.
ఏడువారాల నగలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది.
ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం.
ఆది దంపతులుగా ఈ ప్రపంచాన వీరు ప్రసిద్ధమైంది ఇందుకే.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment