మనం చేసిన తప్పును తెలుసుకుని, పూర్తి పశ్చాత్తాపంతో పరమాత్మ పాదాలు పట్టుకుంటే మనకంటే ఎక్కువగా పరవశించిపోయేది ఆయనే

 🕉️⚜️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

💥🌼💥🌼💥🌼💥🌼💥


🍁 ఓం ఫాలచంద్రాయ నమః 🍁


మనం సంపూర్తిగా మారి ఒక్క అడుగు పరమాత్మ వైపునకు వేస్తే, భగవంతుడు మన వైపుకు మరిన్ని అడుగులు వేస్తాడని చెప్తుందీ క్రింది వృత్తాంతం.


గణపతికి లంబోదరుడు అని పేరు.

లంబోదరం అంటే పెద్ద ఉదరం కలిగినవాడు అని అర్దం. సమస్త బ్రహ్మాండాలను తన బొజ్జలో దాచుకున్నాడు కనుక గణపతి లంబోదరుడయ్యాడు. 


ఒకానొక వినాయకచవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు.

పెద్ద బొజ్జ పూర్తిగా నిండడంతో కాస్త మెల్లిగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు.


అందరి ఆకలిని తీర్చే పరబ్రహ్మం యొక్క కడుపు ఎవరు మాత్రం నింపగలరు.

భక్తులు తనకు భక్తితో చేసిన పూజ వలన కలిగిన ఆనందం జీర్ణం కాక, ఇబ్బంది పడ్డాడు వినాయకుడు.


27 నక్షత్రాలు చంద్రుని భార్యలు.

వారందరు అక్కచెల్లెళ్లు, దక్షప్రజాపతి కూమార్తెలు.


కానీ చంద్రుడు అందరికి సమానమైన ప్రేమ పంచక, ఒక్క రోహిణితో ఉండడానికి మాత్రమే ఇష్టపడేవాడు.

దాంతో బాధపడిన మిగతా వారు తన తండ్రి అయిన దక్షునకు విషయం చెప్పగా, దక్షుడు కోపంతో కళావీహినుడిగా మారిపో అని శపించాడు.


తనను శాపం బారి నుంచి రక్షించగలవారు పరమశివుడు ఒక్కడేనని ఎన్నోవృధా ప్రయాసల తర్వాత గ్రహించిన చంద్రుడు, ఆయన్ను శరణు వేడగా, దయ తలచి తన తలపై ధరించాడు శివుడు.


కవులందరూ చంద్రుడు గొప్పవాడని, చల్లనివాడని, అందమైన ముఖమున్నవారిని చంద్రబింబంతో పొల్చడం వంటివి చేయడం చేత చంద్రునకు "అహంకారం" పెరిగింది.

తానే అందగాడినని భావించడం మొదలుపెట్టాడు.


వినాయకుడు బయటకు పెద్ద బొజ్జతో పొట్టిగా, చిన్నపిల్లవాడిలా, ఏనుగు ముఖంతో ఉన్నా ఆయన మానసికంగా మహా సౌందర్యవంతుడు.


ఆత్మ సౌందర్యం శాశ్వతమైనది.

శారీరక అందం ఆశాశ్వతమైనది.

అది ఈరోజు ఉంటుంది. రేపు పోతుంది.

రోజులు గడిచే కొద్ది, యవ్వనం తరిగిపోతుంది.

ఎన్నో లేపనాలు పూసి కాపాడుకున్న శరీరం ముసలి వయసురాగానే ముడతలు పడిపోతుంది.

ఆఖరికి నిప్పులో కాలిపోతుంది.

అటువంటి శరీరాల పట్ల మొహం పెంచుకున్నాడు చంద్రుడు.


గణపతికి కోపం వచ్చింది తనను చూసి చంద్రుడు నవ్వినందుకు కాదు.

ఇంతకు ముందు చంద్రుడికి దక్షుడు శాపం ఇస్తే, శివుడు వలన ఉపశమనం పొందాడు.

అయినా చంద్రుడికి ఇంకా బుద్ధి రాలేదు.

కనీసం పశ్చాత్తాపమైనా లేదు.

సృష్టిలో రకరకాల వ్యక్తిత్వాలను, వ్యక్తులను సృష్టించాడు భగవంతుడు.

అది అర్దమైనవాడు ఎవరిని విమర్శించడు, వెక్కిరించడు.


వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని గేలి చేసినా, అపహాస్యం చేసినా, అది భగవంతుని విమర్శించినట్టు అవుతుంది.

వైవిధ్యం సృష్టి లక్షణం. దాన్ని అలాగే అంగీకరించాలి. 


చంద్రుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తలచి, కోపం తెచ్చుకుని చంద్రుడిని చూసిన వారు నిలాపనిందలు పొందుతారంటూ శపించాడు.  


చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనం చంద్రుడిని ఛీ కొట్టడం మొదలుపెట్టారు.

రాత్రి అయితే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డుపెట్టుకుని బయట తిరిగేవారు.

ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు.

దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువు అయ్యారు.

ఔషధమూలికలు చంద్రకాంతిలోనే ఔషధులను తయారుచేసుకుంటాయని పురాణవచనం.

ప్రజలు ఇబ్బందులు పడ్డారు.


ఋషులు, దేవతలు, మునులు అందరు కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు.

బ్రహ్మ దేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు.

గణపతికి మించిన దేవుడు లేడు, ఆయనే పరిష్కారం చూపుతాడని బ్రహ్మదేవుడనగా..

అందరు కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు. 


చంద్రునికిచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకోమన్నారు.

ఒకసారి శపించిన తరువాత వెనక్కి తీసుకోవడం కుదరదు కనుక..

చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనాధుడు.

అందరు వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి, చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు.


చంద్రుడు చేసిన తప్పును ఒప్పుకొని, క్షమించమని వేడుకున్నాడు. పశ్చాత్తాపపడ్డాడు. 


సర్వవిఘ్నపాలాయ గణేశాయ పరాత్మనే|

బ్రహ్మశాయ స్వభక్తేభ్యో బ్రహ్మభూయ ప్రదాయతే|

అంటూ స్థుతించాడు.


తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుడిని తలమీద పెట్టుకొని, చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు.

చంద్రుడిని తలపై ధరించాడు కనుక గణపతి #ఫాలచంద్రుడు అయ్యాడు.


విదియ తిధి యందు సాయంకాలము నేను నిన్ను స్వీకరించాను. నిన్ను నా ఫాలభాగాన ధరించాను.

కనుక శుక్ల విదియనాడు ఏ మానవుడైతే చంద్రుడిని చూసి నమస్కరిస్తారో, అతడికి ఆ మాసం మొత్తం ఉండే దోషాలు దరిచేరవు అంటూ పలికాడు గణపతి.


ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేస్తూ, ఏ రోజునైతే నీవు నన్నుచూసి పరిహసించావో, ఆ రోజున (వినాయక చవితి రోజునే) ఎవరు నిన్ను చూస్తారో, వారికి చేయని తప్పుకు నీలాపనిందలు పడతారంటూ చంద్రుడికిచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి.


అంతటి కరుణామూర్తి మన గణపతి.


మనం చేసిన తప్పును తెలుసుకుని, పూర్తి పశ్చాత్తాపంతో పరమాత్మ పాదాలు పట్టుకుంటే మనకంటే ఎక్కువగా పరవశించిపోయేది ఆయనే అని చెప్తుంది ఈ ఘట్టం.

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు