హనుమద్వైభవం 💥🙏

 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏

💥🌼💥🌼💥🌼💥🌼💥🌼


ఆంజనేయ మతిపాటలాననమ్ - కాంచనాద్రి కమనీయ విగ్రహమ్

పారిజాత తరుమూల వాసినమ్ - భావయామి పవమాన నందనమ్

యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్ - తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్

బాష్పవారి పరిపూర్ణ లోచనమ్ - మారుతిం నమత రాక్షసాంతకమ్ 🌹

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸  


రామ, లక్ష్మణులను చూసి ప్రాణభయంతో పరుగు తీస్తున్న వానరేశ్వరుడు సుగ్రీవునకు ధైర్యం చెప్పి.. భిక్షుక రూపంలో రామ, లక్ష్మణుల దగ్గరకు వస్తాడు హనుమంతుడు.

తను వచ్చిన విషయాన్ని.. తడబడకుండా, గొంతు చించుకు  అరవకుండా, కనుబొమలు ఎగరేయకుండా.. స్పష్ఠంగా, ముచ్చటగా మూడు మాటల్లో చెప్పి వారు ఎందుకు వచ్చారో అడుగుతాడు హనుమంతుడు.

"లక్ష్మణా.. విన్నావుకదా.. ఈ వానరుని ప్రసంగం.

చతుర్వేదాలు, నవ వ్యాకరణాలు ఆమూలాగ్రంగా వచ్చినవాడే.. ఇంత ఆహ్లాదకరంగా ప్రసంగించగలడు.

ఇటువంటి సచివుడు ఉన్న రాజు, ప్రపంచాన్నే శాసించగలడు.

ఇట్టి వాక్చాతుర్య కుశలునితో, మనం వచ్చిన కార్యాన్ని చాలా జాగ్రత్తగా వివరించాలి సుమా"  అని అంటాడు శ్రీరాముడు.

సకలకళాకోవిదుడైన శ్రీరాముడు.. తనంతటి వాడైన లక్ష్మణుని హెచ్చరించిన సందర్బము రామాయణంలో ఇది ఒక్కటే.

అదీ... మన హనుమంతుని వాగ్వైభవం. 


రామ, సుగ్రీవులకు అగ్నిసాక్షిగా మైత్రి కలిపి, ధర్మచ్యుతుడైన వాలి వధకు మార్గం సుగమం చేసి.. రాజ్యభ్రష్ఠుడైన సుగ్రీవుని తిరిగి కిష్కిందాధిపతిగా అభిషిక్తుని చేసినదీ హనుమంతుడే. అదీ ఆయన మంత్రాంగవైభవం.


జాంబవంతుని ప్రోత్సాహంతో సాగర లంఘనం చేసాడు హనుమ.

ఆ మహత్తర కార్యంలో తన ప్రయాణానికి విఘ్నం కలిగించబోయిన మైనాకుని సంతృప్తి పరచి, నాగమాత సురసను జయించి, ఛాయాగ్రాహిణి సింహికను సంహరించి.. లంకానగరం చేరాడు.

దుర్భేద్యమైన లంకను చూసి రకరకాలుగా ఆలోచనలు చేసి.. ముందుగా లంకానగరాధి దేవత లంకిణి దర్పమణచి లంకలో ప్రవేశిస్తాడు.

అదీ ఆయన #వీర,విక్రమవైభవం.


లంకలో సీతాన్వేషణ చేస్తున్నాడు హనుమ. లంకానగర వైభవం ఆయన మనసు హరించలేదు. అతిలోక సౌందర్యవతులైన ఎందరో మోహనాంగులు నగ్నంగా నిదురిస్తూంటే.. సీతకోసం, వారిని నఖశిఖ పర్యంతం చూస్తున్నా హనుమ మనసు చలించలేదు. అదీ ఆయన ఇంద్రియనిగ్రహవైభవం.


అయ్యో.. పరస్త్రీని చూడడమే పాపం కదా.. ఇలా నగ్నంగా చూడడం మరింత పాపం కదా.. ఇంత సౌందర్యాన్ని చూస్తున్నా, నా మనసు చలించకుండా, నిర్మలంగా ఉంది.

కనుక నాకు పాపం లేదు.

అయినా సీతను వెతకాలంటే స్త్రీల మధ్యనే కదా వెతకాలి.

కనుక నా తప్పు ఏమీ లేదు అనుకుని సీతాన్వేషణ చేస్తున్నాడు హనుమ.

ఇదీ... ఆయన ధర్మచింతనావైభవం. 


రావణుని శయనం మీద నిదురిస్తున్న మండోదరిని చూసి.. సీత అని భ్రమపడి ఆనందంతో గంతులు వేస్తాడు.

మరుక్షణంలో ఆలోచనలో పడి... "రామునకు దూరమైన సీత అలంకరించుకోదు.. అన్న పానాలు ముట్టదు... ఇలా సుఖంగా నిదురించదు.. కనుక ఈమె సీత కాదు" అని నిర్ణయించుకుంటాడు.

ఇదీ.. ఆయన తార్కికవైభవం. 


అశోకవనంలో సీత కనిపించింది.

ఎలా కనిపించింది.?

ప్రాణ త్యాగానికి సిద్ధపడుతూ  కనిపించింది.

ఇప్పుడు... ఆమె ప్రయత్నాన్ని ఆపాలి.

రామగానం చేసి, రామాంగుళి ఆమెకు ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్తాడు.

అదీ ఆయన ఆలోచనావైభవం.


చిన్న వానర రూపంలో ఉన్న హనుమంతుని శక్తిని సీతమ్మ శంకించినవేళ.. తన విశ్వరూపం చూపించి "వానరసేనలో అందరూ నన్ను మించిన ఉద్దండులేనమ్మా... సుగ్రీవుని సేనలో ఏమీ చేతకానివాడను, ఏమీ తెలియనివాడను, నేను ఒక్కడినేనమ్మా.

దూతగా మహామహులను పంపరు కదమ్మా" అని వినయంగా పలుకడం... 

అఖండ ప్రతిభావంతుడైన ఒక్క హనుమంతునకే చెల్లు.

అదీ... ఆయన వినమ్రతావైభవం. 


వచ్చిన కార్యం పూర్తయింది.

అలాని వెంటనే వెనుతిరిగి వెళ్లిపోలేదు.

తమ బలం శత్రువుకు తెలియచెప్పాలి.

అందుకే అశోకవనం ధ్వంసం చేసాడు.

కొన్ని వేల మంది రాక్షసవీరులను  ఏకాకిగా సంహరించాడు.

రావణసభలో... రావణునికి హితోపదేశం చేసాడు. తనను పరాభవించిన రావణునికి బుద్ధివచ్చేలా.. లంకాదహనం చేసి.. శ్రీరామునికి సీతమ్మ జాడ తెలిపిన కార్యసాధకుడు హనుమ.

అదీ ఆయన కార్యసాధనావైభవం.


అంతేనా... యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛనొందిన వేళ.. అనన్య సామాన్యమైన సంజీవిని పర్వతాన్ని తెచ్చి కాపాడిన ఆయన ప్రతిభావైభవం ఇంకెవరికి ఉంటుంది?


శ్రీరామ పట్టాభిషేకం వేళ.. అందరూ వారి వారి ఉచితాసనాలలో కూర్చుంటే.. హనుమ మాత్రం శ్రీరామ పాద సాన్నిధ్యాన్ని మించిన ఉచితస్థానం మరొకటి లేదని తలచి.. భక్తిగా చేతులు జోడించి శ్రీరాముని పాదాల చెంత కూర్చున్న హనుమంతుని భక్తివైభవాన్ని వివరించడానికి భాష చాలదు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు