⚜️🚩వాలికి ధర్మం గురించి ఉపదేశం చేసిన రాముడు🌹🙏

 🕉️⚜️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏


⚜️🚩శ్రీరాముడు ఉపదేశం చేసిన ధర్మం🙏


⚜️🚩 వాలికి ప్రాణాలు కడగడుతున్నాయి.

ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు. 

రాముని చూచి వాలి ఇలా నిందించాడు.


🌹రామా! నేను నీకు గాని, నీదేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు.

అయినా నన్ను వధిస్తున్నావు.


నా చర్మం, గోళ్ళు, రోమాలు, రక్తమాంసాలు నీకు నిరుపయోగం కనుక నన్ను మృగయావినోదం కోసం చంపావనే సాకు కూడా నీకు చెల్లదు.


మద్యపాన మత్తుడై నిద్రపోయేవాడిని పాము కాటు వేసినట్లుగా చెట్టుమాటునుండి నాపై బాణం వేశావు. 


నా సహాయమే కోరి వుంటే క్షణాలమీద రావణుడిని నీ కాళ్ళవద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని.


ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు.

నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు?


నిస్సత్తువలో ఎక్కువ మాట్లాడలేను.

కాని నీ సమాధానాన్ని వినగలను. – అని వాలి అన్నాడు.


⚜️🚩వాలికి ధర్మం గురించి ఉపదేశం చేసిన రాముడు🌹🙏


🌹"నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా?

నువ్వు అజ్ఞానివి.

బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి.

నీకు ఏమి తెలుసని నామీద ఇన్ని ఆరోపణలు చేశావు.

నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే,

ఆచారం తెలిసినవారిని,

పెద్దలైనవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి.

నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు.


ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది.

ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు.

ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది.

నీకు కామం తప్ప వేరొకటి తెలియదు.

అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు.


👉జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం.

అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము. 


నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము.

నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము.

కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు.

అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు.

ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. 


👉నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింపబడుతున్నవాడివి.

సంధ్యావందనం చేస్తున్నవాడివి.

నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు.

నేను క్షత్రియుడని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది.

ఇది తప్పు అని తెలిసికూడా నేను నిన్ను శిక్షించకపోతే, నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది.


ఈ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైనవాడికి తెలిసి వాడిని శిక్షిస్తే, వాడి పాపం పోతుంది.

కాని ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళుతుంది.


👉ఇంక నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు.

నాతో స్నేహం చేసి ఉంటే సీతమ్మని తీసుకువచ్చేవాడిని అన్నావు కదా.

నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. 


👉నన్ను చెట్టు చాటు నుండి చంపావు.

వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు.

అది దోషం కాదా? అని నన్ను అడిగావు.

దానికి నేను సమాధానం చెబుతాను విను.


తప్పు చేసినవాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది.

నేను నిన్ను చంపడం వలన నువ్వు ఏ పాపము లేని స్థితికి వచ్చావు.

నీ పాపం ఇక్కడితో పోయింది.

అందుకని నువ్వు ఉత్తమలోకాలకి వెళ్ళిపోతావు. 


నేను మానవుడిని, నువ్వు వానరానివి.

నేను మనిషిని, నువ్వు జంతువువి.

క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టవచ్చు.

వల వేసి పట్టుకొని కొట్టవచ్చు.

పాశం వేసి పట్టుకొని కొట్టవచ్చు.

అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టవచ్చు.

అది పడుకొని ఉన్నప్పుడు కొట్టవచ్చు.

నిలబడి ఉన్నప్పుడు కొట్టవచ్చు.

పారిపోతున్నప్పుడు కొట్టవచ్చు.

ఎప్పుడైనా కొట్టవచ్చు.

కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగం చెయ్యకూడదు.

నువ్వు మైధున లక్షణంతో లేవు.

అందుకని నిన్ను కొట్టాను.

నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను.

కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు.

నాయందు ఎటువంటి దోషము లేదు" అని శ్రీరామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.

🌹సేకరణ

                     ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు