దత్తాత్రేయుడు స్మర్తృగామి 🌹🙏

 🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏


🌹ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే నమో నమః🌹🙏


⚜️🚩ధ్యానమ్:

జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే |

దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||

కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ |

దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః ||

దిగంబరం భస్మసుగంధ లేపనం చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ |

పద్మాసనం యోగిమునీంద్రవందితం దత్తేతినామస్మరణేన నిత్యమ్ ||


⚜️🚩పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను.

ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది.

పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనంపై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు.

వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు.

అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు.

అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది.

ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది.

అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు.

పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు.

అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది.


🌹ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది.

దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు.

వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు.


🌹ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు.

పరమ ధార్మికుడు.

ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు.

ప్రతిఫలంగా తానేమీ కోరడు.

ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు.


🌹అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు.

ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించిన‌వారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు.

మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు.

స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను.

నా అపరాధం మన్నించు." అన్నాడు.


🌹అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది.

భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు.

"నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా,

దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను.

నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు.


🌹శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు.

దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు.


🌹అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి.

సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు.


🌹"నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు.

అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు."

అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు.

దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు.

దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.

ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు.

                         🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు